రాతాపానీ పులుల అభయారణ్యం
రాతాపానీ వన్యప్రాణుల అభయారణ్యం మధ్య భారతదేశంలోని వింధ్య పర్వత శ్రేణిలో ఉంది. మధ్యప్రదేశ్ రాయ్‌సేన్ జిల్లాలో ఉన్న ఈ అభయారణ్యం, రాష్ట్రంలోని అత్యుత్తమ టేకు అడవులలో ఒకటి. రాష్ట్ర రాజధాని భోపాల్ నుండి 50 కిలోమీటర్ల (31 మైళ్ళు) కంటే తక్కువ దూరంలో ఉంది.[2]
రాతాపానీ పులుల అభయారణ్యం | |
---|---|
రాతాపానీ వన్యప్రాణుల అభయారణ్యం | |
Location | భారతదేశం మధ్య ప్రదేశ్‌లోని రాయ్‌సేన్ జిల్లా |
Nearest city | భోపాల్ |
Coordinates | 22°55′05″N 77°43′19″E / 22.918°N 77.722°E[1] |
Area | 824 కి.మీ2 (318 చ. మై.) |
Established | 1976 |
Governing body | మధ్య ప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ |
ఇది 1976 నుండి వన్యప్రాణుల అభయారణ్యంగా ఉంది. 2013 మార్చి నాటికి, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) నుంచి దీనిని పులుల అభయారణ్యంగా అభివృద్ధి చేయడానికి సూత్రప్రాయంగా అనుమతి మంజూరైనప్పటికీ, తుది ఆమోదానికి ప్రభుత్వ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రకటన ద్వారా పులుల అభయారణ్యంగా మారనుంది.[3] రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటం, మానవ ప్రమేయం లేక ప్రాకృతిక సౌందర్యం పాడవకుండా ఉండడం వల్ల ఈ అడవులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సమీప భవిష్యత్తులో దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మధ్యప్రదేశ్ పర్యాటక బోర్డు యోచిస్తోంది. సమృద్ధిగా వృక్షసంపద, జంతుజాలం ఉన్న ఈ అభయారణ్యం అనేక రకాల పక్షులు, క్షీరదాలకు నివాసం.
మొత్తం అటవీ ప్రాంతం విస్తీర్ణం సుమారు 824 చదరపు కిలోమీటర్లు (318 చదరపు మైళ్ళు). కొండలు, పీఠభూములు, లోయలు, మైదానాలతో ఈ ప్రాంతం ఎత్తుపల్లాలుగా ఉంటుంది. వర్షాకాలంలో అనేక ఏర్లు పారుతూ ఉంటాయి. వీటి ప్రవాహాల్లో అక్కడక్కడా ఏర్పడే మడుగులు వేసవిలో కూడా నీటితో నిండి ఉంటాయి. అభయారణ్యం సమీపంలో ఉన్న రెండు పెద్ద జలాశయాలు బర్నా జలాశయం, రాతాపానీ ఆనకట్ట (బారూసోట్ సరస్సు). రాతాపానీ అడవి పొడి, తేమతో కూడిన ఆకురాల్చే అడవుల కలయిక. టేకు (టెక్టోనా గ్రాండిస్) ప్రధాన వృక్ష జాతి. సుమారు 55% ప్రాంతం టేకు చెట్లతో నిండి ఉంది. మిగిలిన ప్రాంతంలో వివిధ పొడి ఆకురాల్చే వృక్షజాతులు ఉన్నాయి. పై రెండు రకాల అడవులకూ వెదురు (డెండ్రోకలామస్ స్ట్రిక్టస్) సహజ వృక్ష జాతి. అటవీ ప్రాంతంలో నాలుగింట ఒక వంతు వెదురు విస్తరించి ఉంది. భీమ్‌బేట్కా శిలా గుహలు ఈ పులుల అభయారణ్యంలోనే ఉన్నాయి. ఈ రాతి గుహల్లో వందల వేల సంవత్సరాల క్రితం మానవులు నివసించేవారు. వీటిలో ఉన్న రాతి యుగానికి చెందిన చిత్రాలు 30,000 సంవత్సరాల కన్నా ఎక్కువ పురాతనమైనవి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ అటవీప్రాంతంలో భీమ్‌బేట్కా, దేలావాడీ, గిన్నోర్గఢ్ కోట, రాతాపానీ ఆనకట్ట, కేరి మహాదేవ్ ఆలయం, ఖేర్బానా ఆలయం మొదలగు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
పులుల అభయారణ్య హోదా
మార్చుప్రభుత్వం ప్రకారం, రెండు కొత్త పులుల అభయారణ్యాల ఏర్పాటుకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అవి రాతాపానీ (మధ్యప్రదేశ్), సునాబేడ (ఒడిశా). పులుల అభయారణ్యాలుగా ప్రకటించడానికి కుద్రేముఖ్ (కర్ణాటక), రాజాజీ (ఉత్తరాఖండ్)లకు తుది ఆమోదం లభించింది. ఈ క్రింది ప్రాంతాలను పులుల అభయారణ్యాలుగా ప్రకటించడానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌టీసీఏ సూచించింది: (i) సుహేల్వా వన్యప్రాణుల అభయారణ్యం (ఉత్తర ప్రదేశ్) (iii) గురు ఘాసీదాస్ జాతీయ వనం (ఛత్తీస్గఢ్) (iiiiii) మ్హాదేయ్ వన్యప్రాణుల అభయారణ్యం (గోవా) (iv) శ్రీవిల్లిపుత్తూర్ గ్రిజ్‌ల్డ్ జయంట్ స్క్విరెల్/మేగమలై వన్యప్రాణుల అభయారణ్యాలు/వరుషనాడు లోయ (తమిళనాడు) (v) దిబాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం (అరుణాచల్ ప్రదేశ్) [4]
వన్యప్రాణులు
మార్చుఈ అభయారణ్యంలో అనేక రకాల వన్యప్రాణులు కనిపిస్తాయి. కొన్ని చోట్ల కొండలు బాగా ఏటవాలుగా ఉండి చరియలు, కొండకొమ్ములు ఏర్పడ్డాయి. వాటి అడుగున పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ రాబందులు, సరీసృపాలు, చిన్న క్షీరదాల వంటివి నివసించడానికి అనువుగా ఉంటాయి.
ఈ అభయారణ్యంలో పులి, చిరుత, రేచుకుక్క, హైనా, నక్క వంటి మాంసాహార జంతువులు, దుప్పి, సాంబార్ జింక, నీల్గాయ్, నాలుగు కొమ్ముల జింక, లంగూర్, అడవి పంది వంటి శాకాహార జంతువులు ఉన్నాయి. వానర జాతుల్లో లంగూర్, రీసస్ మకాక్ ఉన్నాయి. సర్వభక్షక స్లాత్ కూడా తరచుగా కనిపిస్తుంది. ఉడుతలు, ముంగిసలు, జెర్బిళ్ళు, ముళ్లపందులు, కుందేళ్ళు మొదలైన చిన్న జంతువులు సర్వసాధారణం. సరీసృపాలలో ముఖ్యమైన జాతులు వివిధ రకాల బల్లులు, ఊసరవెల్లి, పాములు మొదలైనవి. ఇక్కడ 150 కంటే ఎక్కువ జాతుల పక్షులను చూడవచ్చు. సామాన్య బాబ్లర్, క్రిమ్సన్-బ్రెస్టెడ్ బార్బెట్, బుల్బుల్, బీ-ఈటర్, బయా, కోకిల, కింగ్‌ఫిషర్, కైట్, లార్క్, బెంగాల్ రాబందు, సన్‌బర్డ్, వైట్ వ్యాగ్‌టెయిల్, కాకి నెమలి, అడవి కాకి, ఎగ్రెట్, మైనా, అడవి కోడి, చిలుకలు, హూపో, బావల, వడ్రంగిపిట్టలు, బ్లూ జే, పావురం, నల్ల డ్రోంగో, ఫ్లైకాచర్, ఫ్లవర్ పెకర్, రాక్ పావురం వంటివి ప్రస్తావించదగిన పక్షి జాతులు.ద ఎ
2019 ఫిబ్రవరిలో, గుజరాత్ రాష్ట్రంలోని మహిసాగర్ జిల్లా లునావడా ప్రాంతంలో కనపడిన పులి చనిపోయినట్లు గుర్తించడానికి ముందు, ఈ అభయారణ్యం నుండి వచ్చిందని చెప్పబడింది.[5][6][7]
ఆల్ఫా లోయ
మార్చు20,000 ఎకరాల వింధ్యాంచల్ పర్వతశ్రేణిని ఆనుకుని, రాతాపానీ ఒడ్డున ఆల్ఫా లోయ ఉంది. వృక్షసంపద, జంతుసంపద సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం, లోయలు, పర్వతాలు, సరస్సులు, ఆనకట్టలతో స్వర్గాన్ని తలపిస్తుంది.
పక్షులు
మార్చురాతాపానీ అభయారణ్యం మధ్య భారతదేశంలోని విలక్షణమైన వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. ఇక్కడి పక్షిజాతులపై విస్తృత పరిశోధన జరగకపోయినా, ఇక్కడికి వచ్చే పక్షుల పరిశీలకుల నుంచి కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. రాతాపానీ వన్యప్రాణుల అభయారణ్యం 150 పైచిలుకు పక్షిజాతులకు ఆవాసం.[8]
ఓరియంటల్ వైట్-బ్యాక్డ్ రాబందు (జిప్స్ బెంగాలెన్సిస్) లాంగ్-బిల్డ్ రాబందు (జిప్స్ ఇండికస్), రెడ్-హెడెడ్ రాబందు (సార్కోజిప్స్ కాల్వస్) తరచుగా చెట్లపై కూర్చొని, లేదా ఆహారం కోసం వెతుకుతూ ఎత్తున ఎగురుతూ కనిపిస్తాయి. అభయారణ్యం అంచున ఉన్న రాతాపానీ ఆనకట్ట శీతాకాలంలో వేలాది వలస పక్షులకు ఆశ్రయమిస్తుంది. అభయారణ్యం అంతటా అనేక చిన్న జలాశయాలు ఉన్నాయి. ఈ చిన్న జలాశయాలూ, రాతాపానీ ఆనకట్ట జలాశయామూ కలిపి మొత్తం నీటి పక్షుల జనాభా కనీసం 20,000 ఉంటుంది. అంతేకాకుండా, ఈ నీటి వనరుల్లో సరస్సు కొంగ (గ్రస్ యాంటిగోన్), పెయింటెడ్ స్టార్క్ (మైక్టేరియా ల్యూకోసెఫలా), బ్లాక్-నెక్డ్ స్టార్క్ (ఎఫిప్పియోరింకస్ ఏషియాటికస్), వైట్-నెక్డ్ స్టార్క్ (సికోనియా ఎపిస్కోపస్) వంటి పెద్ద పక్షులు కూడా ఉంటాయి.[8]
ఇండో-మలయన్ ట్రాపికల్ డ్రై జోన్ (బయోమ్-11)కు స్వాభావికమైన అడవుల్లో అత్యుత్తమమైనది రాతాపానీ అటవీప్రాంతం. ఈ బయోమ్‌లో బర్డ్‌లైఫ్ ఇంటర్నేషనల్ గుర్తించిన 59 పక్షి జాతులలో 33 రాతాపానీలో కనిపిస్తాయి. దీన్ని బట్టి ఈ ప్రాంతంలో జీవవైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యత తెలుస్తుంది. [9]
జీవవైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదాలు, పరిరక్షణ సమస్యలు
మార్చుఅభయారణ్యాల్లోని జంతు, వృక్ష వైవుధ్యానికి ప్రాకృతిక, మానవకారక ప్రమాదాల నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రమాదాల్లో కొన్ని -
- దొంగతనంగా జరిగే జంతువుల వేట
- ఆక్రమణలు, కార్చిచ్చులు
- అక్రమంగా చెట్ల నరికివేత
- పశువుల మేత
- మానవ-జంతు సంఘర్షణ
ఈ అభయారణ్యానికి నలుదిశల నుంచీ ప్రమాదం పొంచి ఉంది. చెట్ల అక్రమ నరికివేత, పశువుల మేత, వేట, ఆక్రమణలు ప్రధాన ఆందోళనలు. అభయారణ్యం లోపల 26 గ్రామాలు, చుట్టూ మరో 109 గ్రామాలు ఉన్నాయి. వీటి సంబంధిత మానవజన్య ఒత్తిళ్లు అటవీప్రాంతంపై ఉంటాయి. ఈ గ్రామాలు తమ రోజువారీ అవసరాలకు అభయారణ్య జీవద్రవ్య వనరులపై ఆధారపడతాయి. వేసవికలంలో ఉండే ఒక ప్రధాన సమస్య సహజ, మానవకారక కార్చిచ్చులు. సన్నగా, పొడుగ్గా ఉండడం వల్ల (సుమారు 70 కిమీ పొడవు, 15 కిమీ వెడల్పు) రాతాపానీ అభయారణ్య ప్రాంతంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన జీవ పీడనానికి లోనౌతాయి.[10]
మూలాలు
మార్చు- ↑ "Kheoni". protectedplanet.net.
- ↑ "About Ratapani (Archived copy)". Archived from the original on 2014-10-06. Retrieved 2014-10-03.
- ↑ "Press Information Bureau".
- ↑ "Milestone Initiatives:National Tiger Conservation Authority / Project Tiger". Archived from the original on 2015-05-30. Retrieved 2015-06-10.
- ↑ "Like humans, animals too have a right to migrate". The Hindustan Times. 2019-02-18. Retrieved 2019-03-17.
- ↑ Ghai, Rajat (2019-02-12). "Camera trap proves Gujarat now has tiger". Down To Earth. Retrieved 2019-03-17.
- ↑ Kaushik, Himashu (2019-03-09). "Tiger that trekked from MP to Gujarat died of starvation: Post-mortem report". The Times of India. Retrieved 2019-03-17.
- ↑ 8.0 8.1 Key Biodiversity Areas Partnership (2024) Key Biodiversity Areas factsheet: Ratapani Wildlife Sanctuary. Extracted from the World Database of Key Biodiversity Areas. Developed by the Key Biodiversity Areas Partnership: BirdLife International, IUCN, American Bird Conservancy, Amphibian Survival Alliance, Conservation International, Critical Ecosystem Partnership Fund, Global Environment Facility, Re:wild, NatureServe, Rainforest Trust, Royal Society for the Protection of Birds, World Wildlife Fund and Wildlife Conservation Society. Downloaded from https://keybiodiversityareas.org/ on 3 Jul 2024.
- ↑ http://ibcn.in/wp-content/uploads/2011/12/28-657_690-Madhya-Pradesh.pdf[permanent dead link]
- ↑ http://ibcn.in/wp-content/uploads/2011/12/28-657_690-Madhya-Pradesh.pdf[permanent dead link]