రామతీర్థం పురాతత్వ ప్రదేశం
రామతీర్థం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని గ్రామం . ఇది విజయనగరం నగరం నుండి దాదాపు 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది పురాతన చారిత్రక ప్రదేశం, సా.పూ. 3వ శతాబ్దం నుండి ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలం. రామతీర్థం పిన్ కోడ్ 535218.[1]
పురాతత్వ ప్రదేశం
మార్చు1903 నాటి పురాతత్వ సర్వే నివేదిక[2] దీనిని ఇలా వివరిస్తుంది:
రామతీర్థం శ్రీరామునితో సాంప్రదాయక సంబంధంతో పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఇది దృఢమైన రాతి కొండల శ్రేణిలో నెలకొని ఉన్న ఆలయం, గ్రామం. దానిపై కొన్ని శాశ్వత నీటి బుగ్గలు, వివిధ ప్రదేశాలు అన్నీ పేరులో రామ నామంతో ముడిపడి ఉన్నాయి. జైనులు కూడా ఇక్కడ నివసించేవారు. జైన అవశేషాల్లో ప్రధానంగా సహజ గుహలు, వాటిలో స్లాబ్ శిల్పాలు, కొన్ని చిన్న శిధిలమైన ఇటుక దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జైనుల అవశేషాలు ఉన్న కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడి అవశేషాల గురించిన సమాచారం సెవెల్స్ లిస్టులు (వాల్యూమ్. I, పేజీ 15) ఒక్కదాని లోనే లభిస్తుంది. ఎక్కడానికి కష్టంగా ఉండే ఒక కొండపై అనేక విరిగిన ఇటుకలు, చెక్కిన రాళ్ల కుప్పల గురించి ఇందులో ప్రస్తావించాడు. ఈ అవశేషాలు బౌద్ధులవని అప్పటి వరకు తెలియదు. ఆ తరువాత, ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. నిస్సందేహంగా ఒక పెద్ద బౌద్ధ విహారాన్ని వెలుహ్గు లోకి వచ్చింది.
బౌద్ధమతం, జైనమతం
మార్చుబ్లాక్ గ్రానైట్ కొండలపై బోధికొండ అనే పేరున్న కొన్ని బౌద్ధ, జైన నిర్మాణాల శిధిలాలను ఇక్కడ చూడవచ్చు. ఇది కాకుండా గురుభక్తకొండ (గురుభక్తులకొండ), ఘని కొండ (దుర్గకొండ అని కూడా పిలుస్తారు) పేరుతో మరో రెండు కొండలు ఉన్నాయి. వీటిపై సా.పూ 3వ శతాబ్దపు బౌద్ధ సన్యాసుల సముదాయం, గోడలపై జైన తీర్థంకర చిత్రాలతో కూడిన రాతి గుహలూ ఉన్నాయి.
బోడికొండ
మార్చురామతీర్థం వద్ద తూర్పు, పడమరలుగా, ఒకదానికొకటి సమాంతరంగా ఉన్న మూడు వరుసల కొండలు ఉన్నాయి. వీటి మధ్య సన్నటి లోయలు ఉన్నాయి. దక్షిణాన ఉన్న కొండను బోధికొండ అంటారు. దానిపై రాముడితో అనుసంధానించబడిన ప్రదేశాలు ఉన్నాయి. సహజ గుహలు, రాతి కళ, చిత్రాలు, శిధిలమైన జైన ఇటుక ఆలయాలతో కూడిన జైన అవశేషాలు కొండపై నైరుతి ప్రాంతంలో ఉన్నాయి.
దుర్గకొండ (ఘనికొండ)
మార్చుఉత్తరాన ఉన్న కొండ దుర్గకొండ. దాని పశ్చిమ భాగంలో సహజమైన గుహలో ఉన్న దుర్గాదేవి చిత్రం నుండి ఆ పేరు వచ్చింది. ఈ గుహకు ముందు భాగానా, దాని పైన ఉన్న రాతిపైనా కొన్ని గుట్టలు ఉన్నాయి. వాటిలో బౌద్ధ, జైన అవశేషాలు ఉన్నాయి.
గురభక్తకొండ
మార్చుమధ్యలో ఉన్న కొండను గురభక్తకొండ (గురుభక్తులకొండ) అంటారు. దాని ఉత్తరం వైపున శిధిలమైన బౌద్ధ విహారం ఉంది. కొండ పైభాగంలో 500 అడుగుల ఎత్తులో గుండ్రంగా ఉండే ఒంటి రాతితో ఏర్పడింది. దాని దక్షిణ శిఖరానికి సమీపంలో, నిట్టనిలువు రాతి గోడ కింద శాశ్వత నీటి బుగ్గ ఉంది. దాని పక్కన శిధిలమైన ఇటుక దిబ్బ, కొన్ని జైన చిత్రాలు ఉన్నాయి. శిఖరంపై కొన్ని ఇటుక దిబ్బలు ఉన్నాయి. కొండ పాదం నుండి సుమారు 400 అడుగుల ఎత్తున, కొండపై ఉత్తరాన 903 అడుగుల పొడవు, సగటున 100 అడుగుల వెడల్పుతో ఓ ప్లాట్‌ఫారమ్ ఉంది. దాని పైన కొండ దాదాపు 100 అడుగుల ఎత్తున నిలువు గోడలాగా విస్తరించింది. మొత్తం ప్లాట్‌ఫారమ్ పొడవునా దట్టమైన అడవి కప్పేసిన ఇటుక దిబ్బలు ఉన్నాయి.
ఇప్పటి వరకు సాగిన తవ్వకం ఫలితంగా పశ్చిమం నుండి తూర్పు వరకు వరుసగా గుర్తించబడిన క్రింది భవనాలు బయటపడ్డాయి. పశ్చిమ అంచున, 65 అడుగుల వ్యాసం కలిగిన ఉన్న ఒక ఇటుక స్థూపం, దాని ప్రక్కన ఒక చెరువు ఉంది. కొండపై ఉన్న శాశ్వత నీటి బుగ్గ నుండి వచ్చే నీరు ఇందులో నిలువ ఉంటుంది. తూర్పున, తూర్పు శిఖరంపై 55 అడుగుల పొడవున్న చైత్యం ఉంది. దాని పైభాగంలో గోపురంలో కొంత భాగం తప్ప మంచి సంరక్షణలో ఒక రాతి డాగోబ్ ఉంది. అందులో ఒక అవశేషాల పేటిక మూత ఉంది. రాతికి ఉత్తర, దక్షిణ దిగువ వైపున రెండు వరుసల ఇటుక గదులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి చిన్న స్థూపం లేదా దాగోబాతో ముగుస్తుంది. దీని నుండి తూర్పున 77 అడుగుల చతురస్రాకారంలో స్తంభాలతో కూడిన హాలు, భారీ రాతి స్తంభాల వరుసలు ఉన్నాయి. అవన్నీ పడిపోయాయి లేదా విరిగిపోయాయి.
తూర్పున మరో రెండు పెద్ద చైత్యాల గోడలు ఆనుకొని ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్ బయటి ముఖంలో ఒక పొడవైన వరుస గదులు, ఇతర భవనాలూ ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్ తూర్పు అంచున ఉన్న ఇతర మట్టిదిబ్బలు ఇంకా పాక్షికంగానే పరిశోధించారు. సొగసుగా వేలాడే వస్త్రాలతో అమరావతి శిల్పకళతో ఉండే బుద్ధుని రాతి విగ్రహం ఒక్కటే ఇప్పటివరకు కనుగొన్న విగ్రహం. ఇక్కడి చైత్యాలు క్రమరహితంగా ఉంటాయి. బహుశా వాటిని నిర్మించినది వివిధ కాలాలలో అని ఇది తెలియజేస్తుంది.
స్వాతంత్ర్యం తరువాత తవ్వకాలు
మార్చుభారత పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో ఈ రామతీర్థం కొండల వెంబడి బౌద్ధ అవశేషాలు, జైన బొమ్మలతో కూడిన మరికొన్ని అవశేషాలు లభించాయి. ఈ ప్రదేశం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి హైదరాబాద్ సర్కిల్ నిర్వహణలో ఉంది.
రామ మందిరం
మార్చుప్రసిద్ధ పురాతన రామచంద్ర స్వామి దేవాలయం ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో వెండి కవచాలలో రామచంద్ర స్వామి, సీత, లక్ష్మణుల అందమైన విగ్రహాలను చూడవచ్చు. ఆలయ పరిసరాల్లో అందమైన సరస్సు ఉంది. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి పండుగలు ఇక్కడ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో గిరిప్రదర్శన నిర్వహిస్తారు. విష్ణు నామాలతో అనేక తాబేళ్లు ఆలయంలో తిరుగుతూ ఉంటాయి. పెద్ద జీయర్ ప్రతిష్టించిన రామస్థంభం కూడా ఉంది.
రాముడి విగ్రహం ధ్వంసం
బోడికొండ కోదండరామ మందిరంలోని శ్రీరామ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 2020 డిసెంబరు 29 న రాముడి విగ్రహ తలను తీసేసినట్లు స్థానికులు గుర్తించారు.[3][4][5]
శివాలయం
రామాలయం పక్కనే 2007 లో నిర్మించిన శివాలయం ఉంది. ప్రతి పౌర్ణమికి, నవరాత్రి ఉత్సవాల సమయంలో శివాలయంలో చాలా మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమైన రోజులలో చాలా మంది భక్తులు రెండు దేవాలయాలను సందర్శిస్తారు.
చిత్రమాలిక
మార్చు-
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర అవశేషాల మ్యాప్
-
గురుభక్తులకొండ మఠం శిథిలాలు
-
బోధికొండపై జైన్ రిలీఫ్‌లు
-
బోడికొండపై అవశేషాలు
-
గనికొండలోని రాక్కట్ గుహలలో జైన తీర్థంకర చిత్రం
-
రామతీర్థంలోని బోధికొండ వద్ద జైన గుహలు
-
బోధికొండలో శిథిలమైన ఆలయం
-
బోధికొండ కొండపై లోతైన నీటి తొట్టి
-
గనికొండలో జైన గుహలు
-
గనికొండ వద్ద వృత్తాకార స్థూపం
-
ఘనికొండపై స్థూపం అవశేషాలు
-
గురుభక్తులకొండ ఆశ్రమంలో అప్సిడల్ స్థూపం గోడలు
-
గురుభక్తులకొండ మఠంలో శిథిలమైన రాతి స్థూపం
-
గురుభక్తులకొండ మఠానికి దారితీసే మెట్లు
ఇది కూడా చూడండి
మార్చు- దానవులపాడు జైన దేవాలయం
మూలాలు
మార్చు- ↑ Indian Postal PIN codes Archived 2007-05-27 at the Wayback Machine
- ↑ Annual Report of the Archaeological Department, Southern Circle, Madras (1903)
- ↑ Gandhi (2020-12-29). "Tension prevails at Rama Teertham as miscreants beheads Rama's idol in Vizianagaram". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-01.
- ↑ "400-year-old Lord Rama idol vandalised at Andhra's Ramateertham temple, triggers protest". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-01-01.
- ↑ "Lord Ram idol vandalised in Andhra Pradesh's Ramatheertham". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-12-30. Retrieved 2021-01-01.