రురు మహర్షి

(రురు నుండి దారిమార్పు చెందింది)

రురు, రురుడు లేదా రురు మహర్షి హిందూ పురాణాలలోని భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి. చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పుత్రుడు ప్రమతి. ప్రమతి మహాతపస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస ఆతనిని వలచి ఆశ్రమమునకు వచ్చి సేవ చేయుచుండగా కొంతకాలమునకు వారి మధ్య అనురాగము జనించి ఆతడు ఘృతాచి యందు ప్రమతి యొక సుపుత్రుని గాంచెను. అతడు రురుడు అనే పేరున పెరుగుచు ధర్మాత్ముడు, తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.

మహాతపస్వి అయిన స్థూలకేశుడను మహర్షి ఆశ్రమము పరమ పవిత్రమై ప్రశాంత నిలయమై వుండెను. విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక ఈ ముని ఆశ్రమ ప్రాంతమున విహరించి, మిథునకృత్య మొనరించి తమ కోరికలను తీర్చుకొనిరి. కొంతకాలమునకు మేనక గర్భవతి అయి చక్కని కూతుర్ని కని ఆమెను ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను. స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.

రురుడు ఒకసారి స్థూలకేశ మహర్షి ఆశ్రమమునకు విచ్చేసి మనోహరముగ దేవకన్య వంటి సౌందర్యము మూర్తీభవించిన ప్రమద్వరను చూచి ఆమెపై అనురాగము కలిగెను. తండ్రి ప్రమతికి విషయము విన్నవించగా ఆ కన్యామణి వృత్తాంతము విని అంగీరించగా, కన్య దానం చేయడానికి స్థూలకేశుడానందించెను. వివాహము కొలది దినములుండగా ప్రమద్వర వనములో పూలుకోయడానికి వెళ్లగా పాముకాటు వలన మరణించెను. అందరూ దుఃఖిస్తుండగా రురుడు మిక్కిలి రోదిస్తూ, ఏకాంతమున తీవ్రముగా వాపోవుచుండెను. అదిచూచిన దేవదూత జాలిపడి నీ ఆయువులో సగము ఆమెకు ఇచ్చిన ఈమె మరల జీవింపగలదు అని పలికెను. వెంటనే రురుడు తన జీవితకాలంలో సగము ఆమెకు ధారపోసెను. అనంతరము రురువునకు ప్రమద్వరకు కళ్యాణము చేసిరి.

నిజ తపశ్శక్తి వలన, త్యాగము వలన, వలచిన కాంత మరణింపగా పునర్జీవింపజేసికొని ఆమెను ధర్మపత్నిగా పరిగ్రహించిన రురుడు, తనకొరకై చూపిన నిష్కల్మష ప్రేమ, నిరుపమాన త్యాగము నెంతయే మెచ్చుకొని పునర్జీవితయై అపూర్వ సౌందర్యము నందిన ప్రమద్వర ఉత్తమోత్తమ దాంపత్య ధర్మమును పాటించుచు గృహస్థాశ్రమమును నిర్వర్తించుచు చిరకాలము జీవించిరి. కాలక్రమమున ఆతని దయవలన ప్రమద్వర గర్భము ధరించి నవమాసములు నిండిన పిదప పుత్రుని పొందెను. అతడే శునక మహర్షి. శునకుడు పెరిగి పెద్దవాడై భృగు వంశీయుల కందరికి ఆనందదాయకుడై, సత్త్వగుణసంపన్నుడై తీవ్రతపస్సు సలిపి శాశ్వత యశస్సును సంపాదించెను. ఆతని కుమారుడే శౌనక మహర్షి.

మూలాలు

మార్చు
  • రురు మహర్షి, మహర్షుల చరిత్రలు, ఏడవ సంపుటము, విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.