రోజ్ గోవిందరాజులు

రోజ్ గోవిందరాజులు (1865 - 1921)[1] తొలితరం భారతీయ వైద్యురాలు. మద్రాసు వైద్య కళాశాల నుండి శిక్షణ పొందిన తొలి మహిళలలో ఈమె ఒకర్తె.[2] మైసూరు వైద్యసముదాయంలో తొలి మహిళ.

రోజ్ 1884లో మద్రాసు వైద్య కళాశాలలో చేరి, 1888లో అబలా దాస్, గుర్దియాల్ సింగ్‌లతో పాటు ఎల్.ఎం.ఎస్ (లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ) డిగ్రీతో ఉత్తీర్ణురాలైంది. వీరు ముగ్గురు ఎల్.ఎం.ఎస్ పట్టా పొందిన తొలి భారతీయ వనితలు[3][4] మద్రాసు వైద్య కళాశాలలో శిక్షణ తర్వాత ఈమె మైసూరు రాజ్య వైద్య సేవలో సహాయ సర్జనుగా పనిచేసింది. ఈమెకు స్కాటిష్ ప్రభుత్వం స్కాలర్షిప్పు పొంది పైచదువులకై ఇంగ్లాండు వెళ్ళింది. మైసూరు ప్రభుత్వం ఈమెను ప్రోత్సహిస్తూ మూడు సంవత్సరాల ప్రత్యేక సెలవును మంజూరు చేసింది.[5] పైచదువులకు ఇంగ్లాండు వెళ్ళి, ఎం.డి.ప్రవేశ పరీక్షలైన ఎడిన్‌బరో, గ్లాస్గో, బ్రసెల్స్ విశ్వవిద్యాలయ పరీక్షలు మూడింటిలోనూ ఉత్తీర్ణురాలైంది. ఈమె 1895లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ సర్జన్స్ (ఐర్లాండు), డబ్లిన్ నుండి మిడ్‌వైఫరీలో డిప్లొమా కూడా పొందింది.[6] 1902లో భారతదేశం తిరిగివచ్చి మరళా మైసూరు వైద్య సేవలో చేరింది.[1] రోజ్ మైసూరు, బెంగుళూరులలో ప్రసూతి వైద్యశాలలను ఏర్పాటుకు కృషి చేసింది. సెయింట్ జాన్స్ ఆంబులెన్స్ సేవలతో కూడా ఈమె కృషి ఉన్నది. ఈమె సామాజిక సేవను గుర్తిస్తూ 1919లో బ్రిటీషు ప్రభుత్వం, మెడల్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (ఎం.బి.ఈ) పురస్కారంతో సత్కరించింది.[1] మొత్తం 33 సంవత్సరాలు మైసూరు రాజ్య వైద్య సేవలో పనిచేసి 1920లో పదవీ విరమణ పొందింది. 1920లో ఈమె బెంగుళూరులో హేగ్ స్మారక భవనానికి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత అక్కడ యూనిటీ బిల్డింగుకు ప్రారంభోత్సవం కూడా చేసింది.[7] మరణించిన తర్వాత 1922లో ఈమె తైలవర్ణ చిత్రపటాన్ని బెంగుళూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఆవిష్కరించారు.[8][1]

రోజ్ తండ్రి కట్టమంచి గోవిందరాజులు రెడ్డి, తల్లి చార్లెట్. వీరు క్రైస్త్రవం స్వీకరించిన భారతీయులు. రోజ్ తండ్రి గోవిందరాజులు రెవరెండు జాన్ ఆండర్సన్ బాప్తిస్మము ఇచ్చిన తొలి భారతీయుల్లో ఒకడు. ఈయన జాన్ ఆండర్సన్ స్థాపించిన పాఠశాలకు తొలి బర్సరుగానూ, ఆ తర్వాత మద్రాసు క్రైస్తవ కళాశాలకు బర్సరుగానూ పనిచేశాడు.[8]


మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Reddi, C.A. "Dr. Rose Govindarajulu". Freedom First. Retrieved 19 September 2019.[permanent dead link]
  2. "HISTORY OF MADRAS MEDICAL COLLEGE" (PDF). mmc.tn.gov.in. Archived from the original (PDF) on 26 జనవరి 2012. Retrieved 24 November 2017.
  3. "Women medical graduates of Madras". The New Indian Express. 13 Sep 2010. Retrieved 19 September 2019.
  4. "History of Madras Medical College". Alumni Association of Madras Medical College. Archived from the original on 15 ఆగస్టు 2018. Retrieved 19 September 2019.
  5. Fernandez, Lawrence (1895). The Medical Reporter: A Record of Medicine, Surgery, Public Health and of General Medical Intelligence, Volume 6. Medical Publishing Press. p. 90.
  6. "National Indian Association in Aid of Social Progress and Education in India". The Indian Magazine and Review. 26: 550. 1895. Retrieved 24 November 2017.
  7. Rizvi, Aliyeh. "RESIDENT RENDEZVOYEUR: A HAIGHER PURPOSE". Bangalore Mirror. No. Jan 17, 2016. Retrieved 24 November 2017.[permanent dead link]
  8. 8.0 8.1 S., Muthaiah. "The Doric column lighthouse". The Hindu. No. October 06, 2013. Retrieved 24 November 2017.