లంకపల్లి బుల్లయ్య

భారతీయ ఉపకులపతి

ఎల్.బుల్లయ్య లేదా లంకపల్లి బుల్లయ్య (1918 - 1992) సుప్రసిద్ధ విద్యావేత్త.

ఇతడు గుంటూరు జిల్లాలోని పెరవలి గ్రామంలో జన్మించాడు. ఎన్నో వ్యయప్రయాసలకు సహించి పాఠశాల కోసం సుదూర ప్రాంతాలకు నడుచుకొనే వెళ్ళి చదువుకున్నాడు. ఇదే విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పూర్తిచేశారు.

బి.ఎడ్. శిక్షణ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కాలంలోనే (1956) ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. విశ్వవిద్యాలయంలో అధిపతిగా విద్యా వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు దృఢపరిచే బాధ్యతను స్వీకరించారు.

ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతిగా 1968 - 1974 మధ్యకాలంలో పనిచేశాడు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దళితుడు ఇతడు. ఆ కాలంలో పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించాడు. ఈ కాలంలోనే మానవ జెనిటిక్స్, మెరైన్ బయాలజీ శాఖలు ప్రారంభించారు.

ఈయన విద్యా విధానాల విభాగానికి (Director of Public Instruction) అధ్యక్షుడుగా చేసిన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ విద్యా విధానంలో 10+2+3 పద్ధతిని కొతారి కమిషన్ (Kothari Commission) కన్నా ముందుగానే ప్రతిపాదించాడు.

ఈయన కాలంలో పరీక్షలలో డిటెన్షన్ పద్ధతి నిషేధించబడినది, సెమిస్టర్ పద్ధతి ప్రవేశపెట్టబడినది, అంతర్గత పరిశీలనా విధానం అమలులోకి వచ్చింది. M.A. M.Com. కోర్సులు యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేసే కళాశాలల నుండి చేయడానికి అనుమతించారు. ఈయన కాలంలోనే విద్యా, జియోగ్రఫీ, జీవరసాయనశాస్త్రం, మానవ జెనిటిక్స్, ఆంథ్రపాలజీ శాఖలు మొదలయ్యాయి.

సివిల్ సర్వీసుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించడం ప్రారంభించారు.

ఈయన కృషి ఫలితంగా దూరవిద్య కోర్సుల కళాశాల (The School of Correspondence Courses) మొదలైంది. ఈయనకు రాష్ట్ర, భారత ప్రభుత్వాలతో సత్సంబంధాలు ఉండేవి.

1970 సంవత్సరంలో సంభవించిన తుఫాను మూలంగా విశ్వవిద్యాలయ భవనాలు బాగా శిథిలమైనాయి. వాటి చిత్రపటాలతో న్యూఢిల్లీ వెళ్లి, యు.జి.సి. అధికారులతో వ్యక్తిగతంగా ముఖాముఖి సంభాషణలతో నూతన గ్రాంటులను విడుదల చేయించిన ప్రతిభాశాలి.

డా.లంకపల్లి బుల్లయ్య కళాశాలలు ఈయన పేరు మీద విశాఖపట్నంలో కొందరు విద్యావేత్తలు, వ్యాపారవేత్తల సహకారంతో ప్రారంభించబడ్డాయి. అయితే బుల్లయ్య డా.వాసిరెడ్డి శ్రీకృష్ణ జ్ఞాపకార్ధం కళాశాలను ప్రారంభించి, దాని అభివృద్ధి మీద ఎక్కువ శ్రద్ధ కనపరిచేవాడు.

ఇంతటి ప్రతిభాశాలి యొక్క ప్రతిమ విశ్వవిద్యాలయ ఆవరణలో ప్రతిష్ఠించబడింది.

బయటి లింకులు మార్చు