లార్డ్ కర్జన్గా ప్రసిధ్ది చెందిన బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ (వైస్రాయి) పూర్తి పేరు జార్జి నథానియేల్ కర్జన్ (GEORGE NATHANIEL CURZON). లార్డ్ కర్జన్ వైస్రాయిగా 1899-1905 మధ్యకాలములో పరిపాలించాడు. భారతదేశములో స్వరాజ్య కాంక్షతో సాగించుతున్న ఉద్యమములకు నాయకత్వము వహిస్తున్న కాంగ్రెస్సు ఆట్టేకాలము నిలవదనీ స్వరాజ్య ఉద్యమములు విఫలమౌతాయనీ నమ్మి భారతీయ నాయకులను అవహేళనచేసిన దొరలలో కర్జన్ ఒకడు. వైస్రాయిగా అతని అబిమతములూ, అనుసరించిన కార్యాచరణే స్వరాజ్యోద్యమములనూ, కాంగ్రెస్సు నాయకత్వమును మరింత బలపరచుటక దోహదముచేసాయి. భారతదేశమును పరిపాలించిన బ్రిటిష్ వైస్రాయిలలో నిరంకుశ సార్వభౌముడుగా ప్రజాభిప్రాయమును త్రుణీకరించి పరిపాలనాయంత్రమును నడిపినవారిలో కర్జన్ దొర అగ్రస్థానము వహించాడు. ఢిల్లీలో 1903లో స్వాతిశయంతో పెద్ద దర్బారు నిర్వహించి బ్రిటిష్ ప్రభుభక్తులైన దేశీయ నాయకులచేత మ్రొక్కించుకున్న అహంభావి. లార్డ్ కర్జన్ దొర స్వాభావికంగానే అహంభావి అని తన స్వదేశమైన ఇంగ్లండు రాజకీయాలలో కూడా ప్రసిధ్ది చెంది ఉన్నాడు. భారతదేశానికి వైస్రాయిగా అతని కార్యకాలము లోని అతి ప్రముఖ కార్యాచరణ బెంగాల్ విభజన. ఆ విభజనతో భారతదేశములో వెల్లుబికిన జాతీయచైతన్యము, స్వరాజ్యదీక్ష బ్రిటిష్ ఇండియా చరిత్రలో పెద్ద మైలురాయి. బ్రిటిష్ ఇండియా చరిత్రలో 1899 నుండి 1905 దాకా కర్జన్ యుగమని చరిత్రకారులు ఉల్లేఖించారు.[1] లార్డ్ కర్జన్ థామస్ రాలి అధ్యక్షతన భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్-1902 ను నియమించాడు.

జీవిత విశేషాలు

మార్చు

కర్జన్ దొర పూర్వీకులు తూర్పు ఇంగ్లండ్ లోని డెర్బీషైర్ అను కౌంటి (జిల్లా) లోని కెడల్‌స్టన్ గ్రామంలో ప్రసిధ్దమైన కుటుంబమునకు చెందినవారు. 1859 జనవరి 11 తేదీ జన్మించిన కర్జన్ యొక్క తల్లితండ్రులు ఆల్ఫ్రెడ్ కర్జన్ లేడీ బ్లాంచె దంపతులు. కెడల్‌స్టన్ ప్రభువుగనూ (Earl of Kedleston) తదుపరి 1922లో మార్క్విస్ కెడల్‌స్టన్ (Marquess of Kedleston) అను ఇంగ్లండులో ని 18-19 వశతాబ్దపు రాజకీయహోదాలు (Peerages of England) తోనే కాక బారన్ కెడల్‌స్టన్ (Baron of Kedleston) అను ఐర్లాండ్ దేశ ( Peerages of Irland) రాజకీయ హోదాలతో కూడా ప్రసిద్ధిచెందాడు. ఈటన్ కాలేజీ తరువాత ఆక్స్‌ఫర్డులో చదువుతున్నరోజులలోనే విద్యార్థి రాజకీయాలలో అనుభవం సంపాదించాడు. 1886 లో మొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడయ్యాడు. 1891లో ఇండియా రాజ్యాంగ ఉపమంత్రిగా కొద్దికాలం చేసిన తరువాత 1895 విదేశాంగ మంత్రిగా చేశాడు. 1888 నుండి 1892 దాకా ఆసియా ఖండములోని అనేక ఆసియా దేశములలో పర్యటించి, అక్కడి స్థితిగతులను అధ్యయనంచేసి బ్రిటిష్ వారి సామ్రాజ్యము పై వాటి ప్రభావము గ్రహించి భారతదేశము బ్రిటిష్ వారి వలసరాజ్యములలో కెల్లా అత్యంత విలువైనదని గ్రహించాడు. రష్యా మరియూ పర్షియా (ఇరాన్) దేశముల స్దితిగతులపై కర్జన్ రచించిన రెండు పుస్తకాలు ("Russia in Central Asia", "Persia and the Persian Question") ఈ అంశ్లపై అతడికి ఉన్న పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. మధ్య ఆసియా దేశమైన రష్యా నుండి పశ్చమాసియా దేశమైన ఇరాన్ దాకా ఉన్న ఆసియా దేశములపైన నియంత్రణచేయగల గొప్ప స్తోమత కలిగియున్నదని, ఆ పరిస్థితి ఆసియా ఖండములోని మిగతా దేశాలు అందలి బ్రిటిష్ వలస రాజ్యాల పైన చూపుననీ, తత్ఫలితముగా బ్రిటిష్ వారి అధికారానికి ముప్పు కలిగి వలసరాజ్యాలపై వారి పట్టు సడలుననీ గ్రహించిన సంగతి కర్జన్, తన పుస్తకములో పేర్కొన్నాడు. అతని విశిష్ట ఆసియా పర్యాటనానుభవానికి గాను, రాయల్ జియోగ్రాఫికల్ సంఘము వారిచేతనూ, నేషనల్ జియోగ్రాఫికల్ వారి చేతనూ సత్కరించబడ్డాడు.

లార్డు కర్జన్ తన 40 వ ఏటనే (1898 వసంవత్సరమున) భారతదేశానికి వైస్రాయిగా వచ్చాడు . ఐదు సంవత్సరములు మొదటి విడతగా కార్యకాలమునందు అహంభావుడైననూ మంచి ఉత్సాహవంతుడుగను పరిపాలనా దక్షుడుగను నుండి కొన్ని అభివృధ్ది కార్యక్రమములు చేపట్టి సఫలుడని పించుకున్నాడు. 1905లో కార్యకాలము పూర్తికాగనే ఐదుసంవత్సరములలో చేసిన సఫలతను గుర్తించి ఇంగ్లండ్ ప్రభువులు అతని కార్యకాలము పొడిగించిరి. 1905 నుండి రెండవ విడత కార్యాకాలంలో తన సైనికాధిపతి లార్డ్ కిచ్నర్ (Lord Kitchener of Khartoum) తోటి విభేదములు కలిగినమీదట ఇంగ్లండు ప్రభువులు తనవైపు మగ్గు చూపకపోవుటవల్ల పదవికి రాజీనామాచేసి 1905 ఇంగ్లండ్ కు తిరిగి వెడలి పోయాడు. 1904 లో వివాహంచేసుకున్న సతీమణి మేరీ లైటర్ ముగ్గురు కుమార్తెలను కలిగిన తరువాత 1906 లో మరణించినది . రెండవసారి వివాహము 1917 లో ఆల్ఫ్రెడొ దుగ్గన్ (గ్రేస్) వల్ల సంతానము కలుగలేదు. భారతదేశ వైస్రాయిగా 1905 లో పదవీవిరమణానంతరం 1907 లో ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయమునకు ఛాన్సలరయ్యను. 1908లో ఐర్లాడు శాసనసభ్యడై నాడు. 1915 లో మొదటి ప్రపంచ యుధ్దము సమయములో వార్ కాబినెట్ సభ్యుడుగానుండెను. 1919-24మద్య బ్రిటన్ విదేశాంగ మంత్రిగనుండెను. 1917 లో ఇండియా వ్యవహారాల మంత్రి గానున్న ఎడ్విన్ మాంటెగు బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశానికి చేయవలసిన రాజ్యాంగ సంస్కరణల ప్రకటనకు చిత్తును సవరించి అంగీకరించినది అప్పటి వార్ కాబినట్ మెంబరుగా నున్న లార్డు కర్జన్ కు అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి లాయిడ జార్జి వప్పగించెను. ఆ చిత్తు ప్రకటనలోనున్న మాట స్వపరిపాలనని బాధ్యతాయు తస్వపరిపాలనగా మార్చినది లార్డు కర్జన్ [2] (చూడు మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము ). స్వభావిక అహంభావమే కర్జన్ దొరకు 1905లో భారతదేశ వైస్రాయిగా రాజీనామచేయుటకు కారణమైనదని చెప్పవచ్చును. అంతేకాక 1923 లో బ్రిటన్ ప్రదానమంత్రిస్థానము కలుగనీయక జీవితములో తీరని నిరాశ కలిగించింది. బాల్డ్విన్ ప్రదానమంత్రిత్వముక్రింది మంత్రిమండలి విఘటమైయ్యే దాక విదేశాంగమంత్రిగనే వుండి 1924 లో విరమణచేసిన కొలది రోజులకో 1925 మార్చి 20వతేది మరణించాడు.[3]

వైస్రాయిగా కార్యాకాలమందలి ముఖ్యాంశములు (1899-1905)

మార్చు
  • విశ్వవిద్యాలయముల చట్టము (1904), మునిసిపాలిటీల చట్టములు శాసించి అమలుచేసెను. ఆ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయ పరిపాలక సంఘము (గవర్నింగ్ బాడీ) ను తిరిగి నిర్మించెను
  • వంగరాష్ట్ర విభజన ( బెంగాల్ విభజన (1905) ):హిందూవులను మహమ్మదీయులను విడదీసి పరిపాలించవలెనన్న (divide and rule) కుటిల రాజ్యతంత్ర ప్రయోగముచేసి 1905 లో వంగరాష్ట్రము (అప్పటి విశాల బెంగాల్) ను తూర్పు బెంగాల్+అస్సం కలిపిన విభాగమును వాయవ్య రాష్ట్రమను క్రొత్త రాష్ట్రముగా (Northwest province) సృష్టించి మహమ్మదీయులు అధికంగానుడేలా విభజించి మిగతా భాగమును పశ్ఛమ బెంగాల్ గాచేసెను. దాంతో బిహారీ,ఒరియా భాషాయుక్తమైనప్రజలు రెండు వైపులా విభజించబడిరి. అలాగ విభజించిన రెండు రాష్ట్రములకు ఇద్దరు లెఫ్టనెంన్టు గవర్నర్లను నియమిచెను.
  • బెంగాల్ కఱవు (1899), (1900) కాలములో వైస్రాయి కర్జన్ చేసిన ఔపచారిక కార్యచరణ తగినంతగా లేకపోయనవి
  • టిబెట్టు,గ్యాంసే, ఆక్రమణ లహసా సంధి (1904)................
  • పశ్చమోత్తర పరగణా నిర్మాణము (1900) ..........
  • పోలీసు వ్యవస్థ సంస్కరణలకు కమిషన్ నియమించి వారి సిఫారసులమేరకు సంస్కరణలు అమలుచేయబడినవి.......
  • సిమ్లాలో క్రొత్త వాణిజ్యవిభాగమును సృష్టించబడింది.
  • వంగరాష్ట్రమును విభజించిన తరువాత ఇద్దరు లెఫ్టెనెన్టు గవర్నలు నియమింపబడెను. తూర్పు వంగరాష్ట్రమునకు సర్ ఛాంఫీల్డ్ ఫుల్లర్ ని పశ్చమ వంగరాష్ట్రమునకు సర్ ఆండ్రూ ఫ్రేజర్ ని లెప్టనెన్టు గవర్నరులగా నియమింప బడిరి
  • 1905 ఆగస్టు-సెప్టెంబరు నెలలో వేల్సు యువరాజు సతీమణితో భారతదేశ పర్యటనకు వచ్చుచున్నందున లార్డు కర్జన్ 1905 సంవత్సరము ఆగస్టు 12 తేదీనునడీ పదవికి రాజీనామ చేసినప్పటికిని, క్రొత్త వైస్రాయిగా లార్డు మింటో పదవిచేపట్టినప్పటికినీ లార్డు కర్జన్ భారతదేశములోనే కొన్ని నెలలు వుండవసి వచ్చినది [4],[1]

1899-1905 మధ్య జరిగిన దేశ, దేశాంతర సందర్భానుసారిక ముఖ్య చరిత్రాంశములు

మార్చు
  • బెంగాల్ కఱవు (1899), (1900)
  • హబీబుల్లా ఆఫ గన్ అమీరగుట, ఇంగ్లండు రాణి విక్టోరియా మరణించుట (1901)
  • మార్కొని (Guglielmo Marconi) కనుగొన్న తీగలేని తంతితపాలా పధ్దతి (Radio transmission) (1902) భారతదేశములో ప్రవేశం
  • స్వామి వివేకనంద నిర్యాణము (1902)
  • ఇంగ్లండుకు రాజుగా ఏడవ ఎడ్వర్డు (King Edward Vii) పట్టాభిషేకము జరుగుట (1902 ఆగస్టు 9)
  • రష్యా-జపాను దేశముల యుధ్దము ప్రారంభమగుట (1904)

వైస్రాయి కర్జన్ కార్యాచరణ ఫలితముల సమీక్ష

మార్చు

లార్డు కర్జన్ తన 40 వ సంవత్సరములోనే భారతదేశానికి వైస్రాయిగా వచ్చెను. 1899 నుండి ఐదు సంవత్సరములు మొదటి విడతగా కార్యకాలమునందు అహంభావుడైననూ మంచి ఉత్సాహవంతుడుగను పరిపాలనా దక్షుడుగనూ, నిష్పక్షపాతిగనే యుండుననియూ ( అరాజకముగా ప్రవర్తించిన ఆంగ్లసైనికులను దండించుటలో వెనుకంజవేయనందున) ప్రజాభిప్రాయముగైకొని కొన్ని అభివృధ్ది కార్యక్రమములు చేపట్టి సఫలుడని పించుకున్నాడు. అతని కార్యకాలంలో 1899 నుండి బెంగాల్ విభజనచేయకముందు అతని కార్యాచరణ కీర్తిదాయకముగనేయుండెను.వివిధ ప్రభుత్వశాఖలలో కొన్ని సంస్కరణలు చేసెను. ముఖ్యముగా పెద్ద రైలు, రోడ్డుమార్గములు వేయించుట, అమూల్యమైన పురాతనవస్తుపరిరక్షణకు తీసుకున్న చర్యలు, కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ నెలకొల్పుట మొదలగు చర్యలు. కానీ 1899, 1900 సంవత్సరములలో తీవ్రమైన కఱవుతో ప్రజలు భాదలుపడి కోలుకుంటున్న సమయమందు 1903 సంవత్సరములో ఢిల్లీలో పెద్ద దర్బారు నిర్వహించి కర్జన్ దొర తనస్వాతిశయంచాటుకునటకు దేశీయ రాజులు చేమ్రొక్కించుకునుట తదపరి 1905 సంవత్సరములో నిరంకుశముగా నిర్ణయముతీసుకుని ప్రజలకు కష్టములు కలిగించు విధముగా విశాల వంగరాష్ట్రము ను (బెంగాల్) విభజించటముతో కర్జన్ దొరకు తీరని అపకీర్తికి కలిగి ప్రజల ఆగ్రహపాత్రుడైనాడు. ఆ బెంగాల్ విభజన వల్లనే అసంఖ్యాక జనం అప్పటివరకూ కాంగ్రెస్సు వారి స్వరాజ్యోద్యమములు ఆంటే అవగాహనంలేకయుండిన వారు కూడా స్వరాజ్యఉద్యమములలో కార్యకర్తలుగా చేరి దేశమునలుమూలలా ఉద్యమమును వుధృతస్థాయికి తీసువెళ్లిరి. అప్పటినించే వందేమాతరం అను గీతము జాతీయగీతమంత ఉన్నత స్థాయి ప్రాముఖ్యతతో యావద్భారతదేశానికి పట్టుబడి సాధారణప్ర జానీకానికి బ్రిటిష్ ప్రభుత్వము వారు సహించలేనంత స్వరాజ్య నినాదమగుట, స్వరాజ్యభావన 1906 కాంగ్రెస్స మహాసభకు అధ్యక్షత వహించిన దాదాభాయి నౌరోజీ ఉద్ఘోషించగా అప్పటినుంచీ గొప్ప మంత్రమై వీధివీదుల వెల్లివిరిసింది. "స్వరాజ్యము నా జన్మ హక్కు" అనిన బాలగంగాధర తిలక్ ఉద్ఘోషణ స్వరాజ్యాందోళనకు గొప్ప శక్తిదాయకమైన ఉద్యమమై స్వరాజ్యము ప్రతిభారతపౌరునికి జన్మహక్కు అని అవగాహనము కలిగినది. అంతేకాక కర్జన్ నిరంకుశ బెంగాల్ విభజనము తోనే పాశ్చాత్య వస్తువులు ఏవైతే బ్రిటిన్ దేశమునుండి మిగతా ఐరోపా దేశములనుండి తయారీయై వచ్చినవో అవియన్నియూ బహిష్కరించి (బహిష్కారోద్యముములు మొదలైయ్యను) భారతదేశమునందు అనేక నిత్యావసర వస్తువలను స్వశక్తిపై ఉత్పాదన చేయబడసాగెను ముఖ్యముగా అగ్గిపుల్లలు దగ్గరనుండి అనేక వస్తువులు వస్త్రములసహితము, ఇనుము, గ్లాస్,తో చేయబడిన అనేక వస్తువుల ఉత్పాదన ప్రారంభమై దేశీయ పారిశ్రామిక యుగము మొదలైనదని చెప్పవచ్చును. బాలగంగాధర తిలకు స్వయముగా ఉూరూరా పర్యటనచేసి బహిష్కారోద్యమమును అవగతపరుచుచూ బహుకొద్ది చందాలతో అనేక వేల రూపాయలు పొందుపరచి తెలిగాను అను గ్రామమందు గాజుఫ్యాక్టరి నెలకోల్పి స్వదేశపారిశ్రమ అంకురార్పణ చేసెను. < ref name= "దివవల్లి(1958)" </>. కర్జన్ చేసిన బెంగాల్ విభజనను రద్దుపరచి పూర్వస్థితిలో నుంచమని 1910-1916 భారతదేశమును మద్య పరిపాలించిన వైస్రాయి లార్డు హార్డింజి చేసిన సిఫారసు ప్రకారం 1911 సంవత్సరములో డిసెంబరు 12 తేదీన బ్రిటిన్ దేశపు రాజు ఐదవ జార్జి ఢీల్లీలోజరిగిన పట్టాభిషేకమహోత్సవములో అంగీకార ప్రకటనచేసియుండెను. కర్జన్ 1904 లో సైనిక చర్యచేబట్టి టిబెట్టు, చుంబా లోయలు గ్యాంసే (Gyantse) హిమాలయ పర్వత కనుమలు కూడా ఆక్రమించి బ్రిటిష్ వారి నియంత్రణలోకి తీసుకువచ్చుట అతిశయోక్తమైన బ్రిటిష్ జాతీయ సార్వభౌమత్వమును చాటుచున్నది. కొన్నిముఖ్యమైన కర్జన్ తీసుకున్న నిర్ణయములు, కార్యచరణలు కర్జన్ తదనంతరం రద్దుపరచబడుట, ఉపసంహరింపబడుట గమనార్ధం. ఉదాహరణకు 1905 బెంగాల్ విభజన 1911లో రద్దుపరచబడింది. 1904చేసిన టిబెట్టు ఆక్రమణ, లాహసా సంధి 1907లో ఉపసంహరింపబడింది. అదే కాలములో పెర్షయన్ గల్ఫ్ 1899లో కర్జన్ ప్రేరేపణపై బ్రిటిష్ వారి అధికారములోనకు తెచ్చిన కార్యచరణ 1903 లో రద్దుపరచబడింది. యుద్ద అనుభవములేకనే దేశీయ రాజులకు గౌరవ సైనికహోదాలిచ్చు ప్రత్యేక సామ్రాజ్యసైనిక అధికారుల వ్యవస్థను (Imperial Cadet Corpse) ఏదైతే 1901లో కర్జన్ స్థాపించాడో అది 1914 లో రద్దుకావించబడింది.

'వందేమాతరం' యొక్క చరిత్రాంశములు

మార్చు

బంకించంద్ర ఛటర్జీ 1882లో రచించిన ఆనందమఠము అను గొప్ప నవలలోని పాట వందేమాతరం. ఆ పాట దేశభక్తిగీతమైనప్పటికీ 20 వశతాబ్దపు మొదటి దశాబ్దమునందు వందేమాతరం ఒక శక్తివంతమైన స్వరాజ్యోద్యమమైనది. స్వరాజ్యము అను పదము వాడుకలోకి రాకమునుపే వందేమాతరం అను పదం వాడుకలోనికి వచ్చిఒక ఉద్యమమైనటుల చరిత్రలో కనబడుచున్నది (వందేమాతరోద్యమము). గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతిరాయ్ 1905 సంవత్సరములో ఇంగ్లండులో గావించిన గొప్ప ప్రచారములలో భాగముగా గోఖలే ప్రసంగించిన అనేకమైన అఖండ ఉపన్యాసములలో భారతదేశములోని స్థితిగతులు బ్రిటిష్ ప్రజలకు రాజకీయనాయకులకు అవగతముచేసి ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చిన వెంటనే బెనారస్ లో 1905 సంవత్సరపు కాంగ్రెస్సు మహాసభకు అధ్యక్షత ప్రసంగములో కర్జన్ యొక్క నిరంకుశ పరిపాలనను ఔరంగజేబుతో పోల్చెను. 1905వ సంవత్సరములో బెంగాల్ విభజనతో వందేమాతర ఉద్యమము విస్త్రుతమైనది. 1906 సంవత్సరంపు కలకత్తా కాంగ్రెస్సు మహాసభలో దాదాభాయి నౌరోజీ అధ్యక్షతన సభవారు చేసిన తీర్మానములో భారతదేశానికి స్వరాజ్యము కావలెను అన్న ఘోషణయందు "స్వరాజ్యము" అను పదము మొట్టమొదటగా వెలువడినది. అప్పటినుంచీ వాడుకలోకి వచ్చింది. అటుతరువాత బాలగంగాధర తిలక్ బెల్గాంలో చేసిన ప్రసంగమునందు "స్వరాజ్యము నా జన్మ హక్కు " అను ఉల్లేఖన యావద్భారతదేశములో వీధివీధిన స్వరాజ్య కాంక్ష దీక్షగా వెల్లివిరిసినది. స్వరాజ్యోద్యమములలో వందేమాతర నినాదము బ్రిటిష్ వారు సహించలేని అస్త్రశస్త ప్రభావముకలిగించింది. వందేమాతరం అని నినాదము చేయుట రాజద్రోహనేరముగా పరిగణించి బ్రిటిష్ ప్రభుత్వము వారు ఆ నినాదముచేసినవారిన నిర్భందిచసాగెను. 1907 లో (సూరత్ కాంగ్రెస్సు మహా సభ) కాంగ్రేస్సు లోని అతివాదులు మితవాదులు విభజన జరిగిగన తరువాత అతివాదనాయకులైన బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ ప్రచురించిన పత్రిక పేరుకూడా బందే మాతరం.[2][4]

బయటి లింకులు

మార్చు

https://en.wikipedia.org/wiki/George_Curzon,_1st_Marquess_Curzon_of_Kedleston
https://www.britannica.com/biography/Lord-Curzon

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "లోకమాన్య తిలకు "దిగవల్లి వేంకట శివరావు (1958) క్రిష్ణా పత్రిక శీర్షక వ్యాసములు జులై 19- ఆగస్టు 30 1958
  2. 2.0 2.1 "The Making of a Nation" B.R. Nanda (2004) pp60-67 HaperCollins
  3. Macropedia Britannica 15th Edition Vol 9 (1984) The Indian Subcontinent pp414-415
  4. 4.0 4.1 "The British Rule in India" D.V. Siva Rao (1938)ఆంధ్రగ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 357-361