వందేమాతరం రామచంద్రరావు

వందేమాతరం రామచంద్రరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు హైదరాబాద్‌స్టేట్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిజాం సంస్థానాన్ని భారతదేశంవిలీనం చేయడానికి చేసిన కృషికి గాను ఇతడిని వందేమాతరం పేరుతో గౌరవిస్తూ వస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావు రెండు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఇతడు రెండు పర్యాయాలు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.

వందేమాతరం రామచంద్రరావు
జననం
వావిలాల రామచంద్రరావు

ఏప్రిల్ 25, 1918
మరణంనవంబర్ 28, 2001
ఇతర పేర్లువావిలాల రామచంద్రరావు
వృత్తిఅధ్యక్షుడు, అధికార భాషా సంఘం(1978-1981)
అధ్యక్షుడు, అంతర్జాతీయ తెలుగు సంఘం
స్వాతంత్ర్య సమరయోధుడు
రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమర యోధుడు,రచయిత
తల్లిదండ్రులు
  • వావిలాల రామారావు (తండ్రి)
  • రామలక్ష్మమ్మ (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

వావిలాల రామచంద్రరావు 1918, ఏప్రిల్ 25వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా, క్యాతూరులో వావిలాల వారింట జన్మించాడు.[1] తండ్రి వావిలాల రామారావు - తల్లి రామలక్ష్మమ్మ. ఇతడు గద్వాలలో మాధ్యమిక పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించి కొంతకాలం కర్నూలులో చదివాడు. ఉన్నత విద్యాభ్యాసానికి హైదరాబాదు చేరి సీతారాంబాగ్‌లో నివసించాడు. అప్పట్లో ఆర్య సమాజనేత, రాంచందర్ దేహెల్వా ఉపన్యాసాలతో ప్రభావితులైన యువకులలో ఇతడు ఒకడు. ఇతడు, ఇతని సోదరుడు నరేంద్రరావు (వీరభద్రరావు) ఆర్య సమాజ సభ్యులుగా చేరారు. తర్వాత సీతారాంబాగ్‌లో ఆర్య సమాజ శాఖను ప్రారంభించాడు.

రాజకీయాల్లో వావిలాల మార్చు

వావిలాల నుండి వందేమాతరం మార్చు

1939లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆర్యసమాజ్ - మూడూ కలిసి నైజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పౌరహక్కుల సాధనకోసం సత్యాగ్రహం ప్రారంభించాయి. రామచంద్రరావు జైలుకెళ్ళాడు. జైలులో జరిగిన ఒక సంఘటన ఇతని జీవితంలో మలుపు తెచ్చింది. జైలులో వున్న సత్యాగ్రహులందరూ ప్రతిరోజు వందేమాతరం గీతాన్ని పాడుతుండేవారు. జైలు సూపరింటెండెంట్ వందేమాతరం గీతం జైల్లో పాడటాన్ని నిషేధించాడు. జైలులో వున్న సత్యాగ్రహులు జైలు సూపరింటెండెంట్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ యథావిధిగా పాడేవారు. జైలు సూపరింటెండెంట్ రామచంద్రరావును పిలిపించి స్వయంగా రెండు చెంపలు వాయించి, 24 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. ప్రతి దెబ్బకు రామచంద్రరావు ‘‘వందేమాతరం’’ అంటూ నినాదం చేశాడు. 24 లాఠీ దెబ్బలు తిన్న రామచంద్రరావు తుదకు స్పృహ తప్పిపడిపోయాడు. అప్పటినుంచి ‘‘ప్రజలు’’ ఇతడిని ‘వందేమాతరం రామచంద్రరావు’ అన్న బిరుదుతో గౌరవించారు. తర్వాత అతడు జీవితాంతం వందేమాతరం రామచంద్రరావుగా ప్రఖ్యాతిగాంచాడు.

హైదరాబాదు సంస్థానంలో మార్చు

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించాడు. 1947లో నిజాం స్టేట్‌లో ప్రారంభమైన ప్రజా ఉద్యమానికి అతను నాయకత్వం వహించాడు. కొంతకాలం అజ్ఞాతంగా వుండి పోరాటం సాగించాడు. నిజాం సైనిక రహస్యాలను సేకరించి, అప్పట్లో హైదరాబాద్‌లో వున్న భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీకి తెలియజేస్తూండేవాడు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత, ఇతడు సహకారోద్యమంలో పనిచేశాడు. నల్లగొండ జిల్లా, మల్కాపూర్‌లో వ్యవసాయదారుల సహకార సంఘం స్థాపించి వారి అభివృద్ధికి కృషి చేశాడు. మజ్దూర్ యూనియన్ స్థాపించి కార్మికుల హక్కుల కోసం పోరాడాడు.

ఆంధ్ర ప్రదేశ్‌లో మార్చు

1957, 1962, 1967లలో జరిగిన సాధారణ ఎన్నికలలో రాష్ట్ర శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. ఇద్దరు మంత్రులు, వి.బి.రాజు, మర్రి చెన్నారెడ్డి ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లు కోర్టులో నిరూపించి వారి శాసనసభ, సభ్యత్వాన్ని రద్దు చేయించాడు. 1967లో అప్పటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డిని ఓడించి శాసనసభకు ఎన్నికయ్యాడు. ప్రత్యేక తెలంగాణ వాదనను బలపరిచాడు.

రామఛంద్రరావు అనర్గళ వక్త. హిందీ, తెలుగు, ఉర్ద్ భాషలో గొప్ప పండితుడు. ఇతని రచనలలో ముఖ్యమైనవి ‘‘హైదరాబాద్ పై పోలీస్ చర్య’’ ‘‘చైనా దురాక్రమణ’’, స్వామి దయానంద జీవితంలోని కొన్ని ఘట్టాలు, స్వాతంత్ర్య వీర సావర్కర్ మొదలైనవి. ఇవే కాక హిందీ, తెలుగు పత్రికలలో వివిధ సాంఘిక, సాంస్కృతిక విషయాలపై వ్యాసాలు వ్రాశాడు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా 1978-81 మధ్యకాలంలో తెలుగును ప్రభుత్వ శాఖలలో అమలుపరచటానికి విశేష కృషి చేశాడు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత, అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడయ్యాడు.[2]

మరణం మార్చు

వందేమాతరం రామచంద్రరావు 2001, నవంబర్ 28వ తేదీన, తన 89వ ఏట హైదరాబాదులో గుండెపోటుతో మరణించాడు[3].

మూలాలు మార్చు

  1. బి.ఎన్., శాస్త్రి (1993). మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వము. హైదరాబాదు: మూసీపబ్లికేషన్స్. pp. 1174–1175.
  2. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి (22 February 2012). "వందేమాతరం అతను ఊపిరి". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 2 డిసెంబరు 2016. Retrieved 2 December 2016.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. వెబ్ మాస్టర్. "ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు కన్నుమూత". oneindia. Retrieved 2 December 2016.