వడ్డెమాను చిదానందం
వడ్డెమాను చిదానందం బద్వేలు తొలి శాసనసభా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు. ఈయన బద్వేలు నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
చిదానందం, అట్లూరు మండలంలోని కమలకూరు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి, కాంగ్రేసు పార్టీ అభ్యర్ధి బొమ్ము రామారెడ్డిని ఓడించి మద్రాసు రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టాడు. 1955లో జరిగిన ఎన్నికలలో, కొత్తగా ఏర్పడిన మైదుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, బొమ్ము రామారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1962లో తిరిగి బద్వేలు నియోజకవర్గం నుండి పోటీ చేసి, కాంగ్రేసు అభ్యర్ధి బండారు రత్నసభాపతిని ఓడించి రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యాడు.[1] కానీ రెండవ పర్యాయం పూర్తిచేయకుండానే చిదానందం 1962 అక్టోబరు 26న మరణించాడు.[2]
చిదానందం మరణించిన కారణంగా 1963లో జరిగిన ఉప ఎన్నికలలో ఈయన పెద్ద కొడుకు వడ్డెమాను వెంకటరమణారావు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేశాడు కానీ గెలవలేదు. కానీ ఆ తర్వాత చిన్న కొడుకు వడ్డెమాను శివరామకృష్ణారావు రాజకీయాల్లో ప్రవేశించి, రెండు సార్లు బద్వేలు నియోజకవర్గం నుండి గెలిచి శాసనసభ్యుడయ్యాడు.[2]
చిదానందం తర్వాత అతని కుమారులైన వడ్డెమాని వెంకటరమణ, వడ్డెమాను శివరామకృష్ణారావులు ఇద్దరూ రాజకీయాలలో ప్రవేశించారు. వెంకటరమణ కమలకూరు సర్పంచిగా చాలా కాలం పనిచేశాడు. శివరామకృష్ణారావు బద్వేలు శాసనసభ సభ్యునిగా పది సంవత్సరాలు పైగా పనిచేశాడు. ఈయన స్మృత్యర్ధం కుటుంబం వడ్డెమాని చిదానందం స్మారక పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించి, నిర్వహిస్తుంది. ఈయన గౌరవార్ధం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సగిలేరు నదిపై వైఎస్ఆర్ జిల్లాలో బి.కోడూరు మండలంలోని వడ్డెమాను గ్రామం వద్ద నిర్మించిన దిగువ సగిలేరు ప్రాజెక్టుకు 2009లో వడ్డెమాను చిదానందం జలాశయం అని పేరు మార్చారు.[3]
మూలాలు
మార్చు- ↑ "సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే". సాక్షి. 2 April 2021. Retrieved 6 September 2024.
- ↑ 2.0 2.1 "35 nominations for Badvel bypoll". Deccan Chronicle. 9 October 2021. Retrieved 6 September 2024.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-02. Retrieved 2009-05-12.