జొన్నలగడ్డ రాజగోపాలరావు - రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యాడు. వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామ లోనే వెయ్యికి పైగా కథలు వ్రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. బొమ్మరిల్లులో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు వ్రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేసింది. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు వ్రాసింది.

ఇక పెద్దలకోసం వారు వ్రాసిన కథలను, నవలలను ప్రచురించని పత్రికలు తెలుగులో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ కథలు ఇంకో వెయ్యిదాకా ఉంటాయి. వాటిలో "ఒక్క అపనలోనే రెండొందలుంటాయి." (అపన: అపరాధపరిశోధన అనే పేరుగల పత్రిక) ఈ కథల్లోనుంచి ఎంపిక చేసిన కొన్ని కథలు రెండు సంపుటాలుగా వచ్చాయి: రసికరాజతగువారముకామా?, చిరునవ్వు వెల ఎంత? (హాస్యకథల సంపుటి) వీటిలోని కొన్ని కథలు చదివితే 'ఇలాంటి విశేషాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని కథలుగా మలచగల దృష్టి ఉండాలేగానీ ఎవరైనా కథలు రాయొచ్చు' అనే ధైర్యమొస్తుంది. (నిజంగా వీరు చాలామందిని కథలు వ్రాయమని ప్రోత్సహించారు, కొందరిని వేధించారు కూడా: తీరుబాటు అనే కథలో ఆ విషయం వివరిస్తారు. కానీ అధిక శాతం కథలు పాఠకులను అబ్బురపరుస్తాయి.

మనకు ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తులమీద గానీ, పరిస్థితుల మీద గానీ కోపమో, చిరాకో, అసహ్యమో, అభిమానమో, అబ్బురపాటో, ఆవేశమో, ఆక్రోశమో, నవ్వో, ఇలా ఎలాంటి భావమైనా కలిగితే దాన్ని మాటల్లోనో, చేతల్లోనో చూపిస్తాం. వీరు మాత్రం దాని మీద కథ వ్రాసేస్తారు అని కూడా అనిపిస్తుంది వీరి కథలు చదివితే. తాము చెప్పదలచుకున్న ఏ విషయాన్ని గురించైనా కథో, నవలో వ్రాయగల ప్రతిభ వీరికి ఉంది.

అలాగని వీరు కథలు మాత్రమే వ్ర్రాసి ఊరుకోలేదు. రచన మాసపత్రికలో సాహితీ వైద్యం (సా.వై.), కథాపీఠం, కథాప్రహేళిక, నిషిద్ధాక్షరి, దొరకునా ఇటువంటి సేవ లాంటి శీర్షికలు నిర్వహించారు. సా.వై. శీర్షిక కొన్ని వందలమంది రచయితలను తయారుచేసింది, ఇంకా చేస్తోంది. ఇలాంటి శీర్షికా నిర్వహణ ఏ భాషలోనైనా అపూర్వం. కాగా ఆ శీర్షికను దశాబ్దం పైగా ఏకథాటిగా నిర్వహిస్తున్నారు.

వీరు వ్రాసిన నవలల్లో కొన్ని: అద్దం ముందు పిచికలు, ఆడపడుచు, సూర్యనమస్కారం, శ్రీరాముని దయచేతను, మొక్కలు పిలుస్తున్నాయి, ఇలా మాత్రం ప్రేమించకు, మగవాడు అనే చక్రవర్తి కథ, పెళ్ళిచేసి చూడు, పెళ్ళయ్యాక చూడు, నందికేశుని నోము, ఇది ఒక కుక్క కథ, సున్నాలేని విప్లవం కథ, మధ్యతరగతి విప్లవం, ఒక సింహం కథ (చాలావరకు విజయ, నీలిమ, స్వాతి అనుబంధ నవలలుగా వచ్చాయి) మొదలైనవి. వీరి నవలలు కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. వారాలబ్బాయిగా కామరాజు కథ, రామరాజ్యంలో భీమరాజు, ప్రేమించుపెళ్ళాడుగా తులసితీర్థం సినిమాలుగా వచ్చాయి.

వీటితోబాటు వీరు అప్పుడప్పుడూ కవితలు కూడా రాస్తారు. రాజగోపాలరావు ఆయన సతీమణి రామలక్ష్మితో కలసి మంగాదేవి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.[1]

వసుంధర రచనలు

మార్చు

మూలాలు

మార్చు