వాడుకరి:Newafrican/సోమంచి కోదండ రామయ్య
సోమంచి కోదండరామయ్య' (10 నవంబర్ 1881-31 మార్చి 1935) సోమంచి కోదండ రామయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ( అప్పటి గంజాం ) జిల్లా శ్రీకాకుళం పట్టణంలోని కానుకుర్తి వారివీధికి చెందినవాడు.
జననం
మార్చుకోదండ రామయ్య, రామయ్య, వేంకట నరసమ్మ దంపతులకు 10, నవంబర్, 1881 లో, జన్మించాడు. తండ్రి వృత్తి పౌరోహిత్యం. తల్లి వేంకట నరసమ్మ కుటుంబ ఆలనాపాలనా చూసుకునేది.
విద్యాభ్యాసం
మార్చుకోదండరామయ్య బాల్యం, విద్యాభ్యాసం శ్రీకాకుళం విజయనగరం, కాశీ నగరంలో జరిగింది. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, హిందీ భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు.తండ్రి ప్రోత్సాహంతో కాశీనగరంలో కొంతకాలం వేదవిద్యలను, ఆయుర్వేదాన్ని అభ్యసించాడు.కోదండరామయ్య, జ్యోతిష్య శస్త్రములో ప్రావీణ్యత పొందాడు. దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లి యజ్ఞ యాగాదులు నిర్వహించాడు.
వివాహం సంతానం
మార్చుప్రస్తుత విజయనగరం జిల్లాలో పార్వతీపురం పట్టణానికి చెందిన యర్రగుంట్ల కుటుంబానికి చెందిన సూరమ్మను 1899లో వివాహం చేసుకున్నాడు. 1900 లో కోదండరామయ్యకు వేంకట నారాయణ, 1902 లో వాసుదేవరావు జన్మించారు. వీరి తరువాత లక్ష్మీ నరసమ్మ అనే కుమార్తె జన్మించింది.
దేవాలయాల స్థాపన ===
శ్రీకాకుళం పట్టణంలో బలగ ప్రాంతంలో గల ఉత్తరేశ్వరుడి (శివాలయం) దేవాలయం 1909 లోనూ 1934 లోనూ కోదండరామయ్య పునఃప్రతిష్టించాడు. కానుకుర్తివారి వీధిలో గల తన నివాసానికి సమీపంలో ఉండే శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయానికి కూడా కోదండరామయ్య తరచూ వెళుతూ తన ఆధ్వర్యంలో వసంత నవరాత్రులను, శ్రీరామనవమి నిర్వహించేవాడు.
సామాజిక జీవనం
మార్చుకోదండరామయ్యకు వ్యవసాయం అంటే గల ఆసక్తితో తను కొనుగోలు చేసిన భూములలో రకరకాల పంటలను పండించేవాడు. తను పౌరోహిత్యం నిర్వహించే బలగ గ్రామంలో కరువు కాటకాలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గ్రహించిన కోదండరామయ్య 1925 లో వైశాఖ మాసంలో పెద్ద బావిని త్రవ్వించదలచి సంకల్పించాడు. 75 మంది పెద్దపాడు కు చెందిన కూలీలతో సొంత ఖర్చులతో బావిని రాతికట్టుతో త్రవ్వించి తన స్వంత పొలంలో జలనిధిని ఏర్పాటు చేశాడు. ఆ పరిసర రైతులందరూ మంచినీటిని వాడుకోవచ్చని ప్రకటించాడు. ప్రస్తుతం కూడా ఆ బావి రైతులందరికీ ఉపయోగకరంగా ఉంది.
జ్యోతిష్యం, వైద్యం
కోదండ రామయ్య జ్యోతిష్యం తో పాటు ఆయుర్వేదం లో కూడా మంచి ప్రవేశం ఉండటం వలన ముహుర్తాలు వంటి మతపరమైన కార్యక్రమాలతో పాటు స్థానికంగా రైతులకు అవసరమైన ఆయుర్వేద మందులు ఇవ్వడంతో పాటు చిన్న చికిత్సలు ఉచితంగా చేసేవాడు. తేలుకాటు, పాముకాట్లు కు మందులు ఇవ్వడం మంత్రాలు వేయడం చేసేవాడు.
వ్యాపారంలో రాణింపు
మార్చుసూరత్, కలకత్తా, బొంబాయి మొదలగు నగరాలనుండి వస్త్రాలు తెప్పించి దుకాణం నిర్వహించేవాడు. సోమంచి కోదండ రామయ్య & సన్స్ పేరుతో ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలో పెట్రోమాక్స్ వీధిలో వ్యాపార సంస్థను నడిపాడు.
ధార్మిక సామాజిక కార్యక్రమాలు
మార్చుశ్రీకాకుళం పట్టణంలో జరిగే వివిధ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. స్వాత్రంత్య్ర సమరంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన అనేకమంది కి బస ఏర్పాటు చేసేవాడు.
సాహిత్య అభిరుచి, ప్రభావం
మార్చుకోదండరామయ్య సాహిత్యం లో మంచి అభిరుచి కలవాడు. తెలుగు సంస్కృత భాషలను బాగా అధ్యయనం చేసాడు. శివపురాణం పై ఆసక్తితో అనేకసార్లు అధ్యయనం చేసి పార్వతీపురం, జలుమూరు, మురపాక వంటి ప్రదేశాలలో పురాణ ప్రవచనాలు చేసేవాడు. తన కుమారులకు శివతత్వం మీద ఆసక్తి కలిగించాడు. తన రెండవ కుమారుడైన వాసుదేవరావును శివానందలహరి రచనకు (సంస్కృతం నుండి తెలుగుకు అనువాదం) ప్రోత్సహించాడు. వాసుదేవరావు ను సాహిత్యరంగంలో కృషి చేయమని ప్రోత్సహించాడు. సూర్యారాయాంధ్ర నిఘంటువు రూపకల్పనలో వాసుదేవరావు పాల్గొనడానికి తండ్రి కోదండరామయ్య ప్రోత్సాహమే కారణం. తరువాత కాలంలో ఈ ప్రభావంతో ఉమా రుద్ర కోటేశ్వర స్వామి పైన కూడా వాసుదేవరావు స్తోత్రాలు రచించాడు.
కోదండ రామయ్య స్వయంగా ఏ రచనలు చేయనప్పటికీ, అనేక పుస్తకాలు చదివేవాడు. బంకించంద్ర ఛటర్జీ రాసిన పుస్తకాలు చదివి వాటి మీద వ్యాఖ్యానం రాసేవాడు. కోదండరామయ్యకు కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన రాజశేఖర చరిత్రము అంటే చాలా ఇష్టం. ఆ రచనను ప్రశంసిస్తూ కోదండరామయ్య వ్యాసం రాశాడు. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ నవలను కూడా చదివిన కోదండరామయ్య వీరేశలింగం రాసిన కధ ఎందుకు ఉత్తమమయినదో అందులో వివరించాడు. అప్పటిలో రాజమహేంద్రవరం వెళ్లినపుడు, వీరేశలింగం పంతులును కలుసుకోగా ఆయన తన సంతకంతో బహుకరించిన పుస్తకం శ్రీకాకుళంలో ఇప్పటికీ ఉపనిషన్మందిరం లో లభ్యమవుతోంది. కందుకూరి వీరేశలింగం పంతులుకు ఆప్తుడైన సోమంచి భీమశంకరం కోదండరామయ్యకు బంధువు మరియు మిత్రుడు. వీరేశలింగం సమాజ సేవను ఆదర్శభావాలను కోదండరామయ్య హర్షించేవాడు. సాహిత్యంలో అనేకమంది ఉద్దండులైన వారు ఆయనను కలుసుకోవడానికి వచ్చేవారు. ఆయనతో సాహిత్యం, ఆధ్యాత్మిక అంశాలు చర్చిస్తూ ఉండేవారు. వారిలో రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ వంటి వారు ఉన్నారు. సోమంచి యజ్ఞన్న శాస్త్రి తండ్రియైన సీతారామయ్య కోదండ రామయ్యకు తమ్ముడు వరస.
శ్రీకాకుళం పట్టణంలో వీరేశలింగం పంతులు నిర్వహించిన కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు ఆయన ప్రచురించిన పత్రికలను తెప్పించి అందరికీ అందుబాటులో ఉంచేవాడు. వీరేశలింగం పంతులుకు సన్నిహితుడయిన సోమంచి భీమశంకరం కోదండరామయ్యకు బంధువు. ఆయన ప్రోత్సాహంతో శ్రీకాకుళం పట్టణంలో సంఘసంస్కరణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నించాడు.
ఆధ్యాత్మిక ధృక్పదం
మార్చుదేవాలయాల సందర్శన వలన మనశాంతి కలుగుతుందని, దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనుషులలో సహనం, సాధులక్షణాలు ఏర్పడతాయని నమ్మేవాడు.
మరణం
మార్చుకోదండరామయ్య 1934 వ సంవత్సరం నుండి శ్రీ ఉత్తరేశ్వర స్వామి (శివాలయం) దేవాలయం నిర్మాణం లో తలమునకలుగా ఉన్నాడు. దేవాలయ పనులు, నిధుల సమీకరణ, తన వైదీక వృత్తి, వైద్య వ్యాసంగం, వ్యవసాయం వల్ల వత్తిడికి గురై అనారోగ్యం పాలయ్యాడు. 1935 మార్చి నెల 27 వ తేదీన దేవాలయం కోసం కాంక్రీటు పనులు ప్రారంభించినపుడు పార్వతీపురం వెళ్ళాడు. అక్కడ తన అత్తవారింట బసచేసి మరునాడు 28 వ తేదీన సంధ్యవేళ శ్రీకాకుళం చేరుకున్నాడు. అప్పటికే పొద్దుపోవడంతో భార్య పెట్టిన అల్పాహారం సేవించి నిద్రకు ఉపక్రమించాడు.
గాఢనిద్రలో ఉండగా తన ఇష్టదైవమయిన ఉత్తరేశ్వర స్వామి వారి ఆలయంలో పరమశివుడు కనిపించినట్లు స్వప్నం వచ్చిందట. కోదండరామయ్య బొడ్లో దోపుకున్న రూపాయల మూటలోంచి ఒక రూపాయి తనకిచ్చి మరొకటి కోదండరామయ్యను తీసుకోమని శివుడు కోరాడట. నిద్రలోనే ఉన్న కోదండరామయ్య పరమశివుడు తనను కోరాడని భావించి ఒక రూపాయి నాణాన్ని నోట్లో వేసుకుని మరొకటి శివుడికి ఇచ్చాడట. తెల్లవారుతూనే కోదండరామయ్య గొంతులో ఏదో అడ్డంపడుతూ ఇబ్బంది పడుతుండడంతో గమనించిన భార్య సూరమ్మ వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లగా, గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుందని, విశాఖపట్నం లో కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. విశాఖపట్నం లో కోదండరామయ్యను చేర్చిన తరువాత అప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులను విన్న బ్రిటీష్ కలెక్టర్ సర్ ఈ సీ ఉడ్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. కోదండరామయ్య మంచి చికిత్సను అందించాలని వైద్యులకు సూచించారు. అయినప్పటికీ కోదండరామయ్య గొంతులో అడ్డుపడిన నాణెం మరింత కిందకు వెళ్ళింది. శ్వాసకు ఇబ్బంది కలుగుతుండడంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి నాణెంను బయటకు తీసారు. కానీ అప్పటికే కోదండరామయ్య ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్ళాడు. పరిస్థితి మెరుగుపడకపోగా మార్చి 31 వ తేదీ సాయంత్రం కోదండరామయ్య మరణించాడు.
మరునాడు ఏప్రిల్ 1వ తేదీన శ్రీకాకుళం లో నాగావళి నదీతీరంలో కోదండరామయ్య అంత్యక్రియలు జరిగాయి. పట్టణంలో ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు.
వనరులు
మార్చు1. శివానందలహరి , శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/తెలుగు అనువాదం: సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీరామకృష్ణ ప్రింటింగ్ వర్క్స్, చికాకోల్ ( ప్రస్తుత శ్రీకాకుళం) వైజాగ్ జిల్లా1936
సోమంచి వాసుదేవరావు రచించిన శివానందలహరి లో పేజీ 8 లో తండ్రి కోదండరామయ్యకి అంకితమిస్తూ చేసిన ప్రస్తావన.
2. సమీర సందేశం, ప్రచురణ: శ్రీ వెంకటరమణ ముద్రణాలయం, శ్రీకాకుళం, శాలివాహన శకం 1884 శుభకృత నామ సంవత్సరం, మార్చి, 1963
సోమంచి వాసుదేవరావు రచించిన సమీరసందేశంలో తన తల్లిదండ్రులు కోదండరామయ్య, సూరమ్మ, అన్నయ్య వేంకట నారాయణ గురించి పేజీ 3-4 లో చేసిన ప్రస్తావన.
3. సౌందర్యలహరి, శంకర భగవత్పాదుల విరచితం - ఆంధ్రీకరణ/ తెలుగు అనువాదం : సోమంచి వాసుదేవరావు, ప్రచురణ: శ్రీ కోరంగి ఆయుర్వేదీయ ముద్రాక్షరశాల, జగన్నాధపురం కాకినాడ,1936 సోమంచి వాసుదేవరావు రచించిన సౌందర్యలహరిలో కోదండరామయ్య గురించి ప్రస్తావన.
4. నేడు ఘనంగా సోమంచి జయంతి ప్రజాశక్తి దినపత్రిక తే 10, నవంబర్, 2022 https://epaper.prajasakti.com/download/11461/ [1]
5. ఘనంగా సోమంచి జయంతి ప్రజాశక్తి దినపత్రిక తే 11, నవంబర్, 2022 https://epaper.prajasakti.com/download/11461/eHl3aD1waXhlbDoxMzc3Ljk5ODA0Njg3NSw1MjI0LjkzMTE1MjM0Mzc1LDIwMDAuNzU1NjE1MjM0Mzc1LDExMTMuMDAzNDE3OTY4NzU- 1
- ↑ Dr Somanchi Sai Kumar (1934-03-14). Sri Uttareswara Swami Vari Temple Balga Srikakulam Document. https://archive.org/details/sri-uttareswara-swami-vari-temple-balga-srikakulam-document