వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 39వ వారం

స్వామీ వివేకానంద, (జనవరి 12, 1863 - జూలై 4, 1902), ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాధుడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.


భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం(పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిదేళ్ళ వయసు లోనే మరణించాడు.


వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని బోధనల ప్రకారం అద్వైత వేదాంతము తత్త్వ శాస్త్రములోనే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. "దరిద్ర నారాయణ సేవ" అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అతని సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతని జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది. ......పూర్తివ్యాసం: పాతవి