వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 13వ వారం

అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. భీమవరంలో మిషన్ హైస్కూలులో, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో, కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో, విశాఖపట్నంలో, నర్సాపురంలో ఇతని చదువు సాగింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలో ఉన్నది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవి పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.


చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, స్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. ....పూర్తివ్యాసం: పాతవి