వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 14వ వారం

కాంచీపురం లేదా కంచి, తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దేశమంతటా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో మొసళ్ళ బ్రీడింగ్ సెంటర్ ఉన్నది. 2001 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం కాంచీపురం జనాభా 152,984.


మధ్య యుగములలో చైనా రాయబారి హుయాన్ సాంగ్ తన భారతయాత్రలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. 4వ శతాబ్ధం నుండి 9వ శతాబ్ధం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఇది రాజధాని. అప్పటి కాలంలో కాంచీపురం విద్యాబోధనలో కాశి అంత ప్రాముఖ్యం పొందింది. క్రీ.పూ.రెండవ శతాబ్ధంలో పతంజలి వ్రాసిన మహాభాష్యాలలో కూడా కంచి యొక్క ప్రస్తావన ఉన్నది. మణిమెక్కళ్ అనే తమిళ కవి, పెరుమపంత్రు అనే మరో తమిళ కవి తమ సాహిత్యంలో కంచిని వర్ణించారు. పల్లవుల తరువాత కంచిని చోళులు పదవ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఆ తరువాత విజయ నగర రాజులు 14 నుండి 17 శతాబ్ధం వరకు పరిపాలించారు. తరువాత కంచి ఆంగ్లేయుల హస్తగతం అయ్యింది. ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వరదరాజ పెరుమాళ్ కు ఒక హారాన్ని బహుకరించాడని దానిని క్లైవ్ మకరకండి అని పిలుస్తారు. కంచి హిందువులకే కాక బౌద్ధులు, జైనులకు కూడా తీర్థ స్థలం. ...పూర్తివ్యాసం: పాతవి