వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 20వ వారం

కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. 1953 నుండి 1956 నవంబర్ 1 వరకు ఈ పట్టణం ఆంధ్ర రాష్ట్రం రాజధాని గా కొనసాగింది. శ్రీశైలం - నాగార్జునసాగర్ ప్రాంతంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం బాగా పెద్దది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలో తుంగభద్రానదీ తీరంలో ఉంది. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.


ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది. ....పూర్తివ్యాసం: పాతవి