వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 25వ వారం

కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి. ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోద్ధారక అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.


కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్తి గ్రామంలో 1867 లో మే 1న జన్మించాడు. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి. నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.


1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవుసరం. సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.

పూర్తి వ్యాసము, పాతవి