వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 35వ వారం
భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం జిల్లా లో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ.,మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడినది.
పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధము గా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరిఅని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిర పడింది. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరి పై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది.
సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.