వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 38వ వారం

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.

చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు.

1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూరులో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉఛ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలి చిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.

పూర్తి వ్యాసము, పాతవి