వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 51వ వారం

భారత దేశపు పరుగుల రాణి గా పేరుగాంచిన పి.టి.ఉష 1964 మే 20 న జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలవుల్లకాండి థెక్కెపరాంబిల్ ఉష. 1979 నుంచి భారతదేశం తరఫున అథ్లెటిక్స్ లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించింది. ఈమె ముద్దు పేరు పయోలి ఎక్స్‌ప్రెస్ (Payyoli Express). 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు. ఒక రజిత పతకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడలలో కూడా 2 రజిత, 1990 ఆసియాడ్ లో 3 రజిత, 1994 ఆసియాడ్ లో ఒక రజిత పతకాలు సాధించింది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985 లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లలో సత్కరించింది.


కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీ లో జన్మించిన పి.టి.ఉష 1976 లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిద్యం వహించి అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-. 1979 లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982 లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. మరియు 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985 లో కువైట్ లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకమే పొందడమే కాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1986 లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985 లో జకార్తా లో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.


ఇంకా... పూర్తివ్యాసం పాతవి