వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 42వ వారం

జలుబు

జలుబు లేదా పడిసం లేదా రొంప శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికలను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, గొంతు రాపు, ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం (ముక్కు దిబ్బడ), తలనొప్పి, మరియు జ్వరము. ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి, కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి. ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి న్యుమోనియాగా మార్పు చెందే అవకాశం కూడా ఉంది.

జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో రైనోవైరస్‌లు అత్యంత సాధారణమైనవి. వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది. జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి. ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి.

(ఇంకా…)