విశాల నేత్రాలు
విశాల నేత్రాలు నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు పిలకా గణపతిశాస్త్రి రచించారు. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని ప్రతిబింబించించిన ఈ చారిత్రిక నవల పాఠకుల విశేషాదరణను పొందింది.
విశాల నేత్రాలు | |
విశాల నేత్రాలు ముఖచిత్రం | |
కృతికర్త: | పిలకా గణపతి శాస్త్రి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | ఎమోస్కో, విజయవాడ |
విడుదల: | జూన్ 2010 |
పేజీలు: | 200 |
రచన నేపథ్యం
మార్చుఆంధ్రపత్రిక సంపాదకవర్గంలో పనిచేసిన పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు నవలను ధారావాహికగా "ఆంధ్ర సచిత్ర వార పత్రిక"లో ప్రచురించారు. వార, మాసపత్రికలలో నవలలు ధారావాహికలుగా ప్రచురింపబడుతూ ఆదరం పొందడం ప్రారంభమైన తొలి రోజులు కావడంతో ఈ నవల ఓ సంచలనంగా నిలిచింది.
ఈ గ్రంథ రచనలో శ్రీరామకృష్ణ మఠాధిపతులు శ్రీరామకృష్ణస్వామి రచించిన ఆంగ్లగ్రంథం లైఫ్ ఆఫ్ రామానుజ చాలా ఉపకరించిందని రచయిత పేర్కొన్నారు. రామానుజుల జీవితం, వైష్ణవమతాల గురించిన సంస్కృతాంధ్ర భాషల్లోని గ్రంథాలను ఆయన పరిశీలించి గ్రంథానికి అవసరమైన నేపథ్యం సమకూర్చుకున్నారు.[1]
అంకితం
మార్చుసైనమైడ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు ప్రాంతీయ మేనేజర్‌గా పనిచేసిన ఇ.కె.కుమార్‌కు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు.[1]
ఇతివృత్తం
మార్చుకథాకాలం 11వ శతాబ్ది. ఇతివృత్తాన్ని వేశ్య, రైతుబిడ్డల ప్రేమకథ స్థాయి నుంచి విశిష్టాద్వైతంలోని ప్రగాఢ భక్తి భావనల వరకూ తీసుకు వెళ్ళారు రచయిత. కాంచీ రాజ్యంలోని నిచుళాపురం పట్టణంలో వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు హేమసుందరి గొప్ప అందగత్తె. ఆమెవి చెంపకి చారెడు కళ్ళు. ఓనాడు దేవాలయంలో హేమసుందరి నాట్యం చేస్తూ ఉండగా ఆమె విశాలనేత్రాలని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు రంగనాయకుడు, ఓ మామూలు రైతు చిన్న కొడుకు. అతని స్పురద్రూపం, సాము గరిడీల్లో అతని ప్రతిభ, మీదు మిక్కిలి అతడు తనపై చూపించే గాఢమైన ప్రేమ హేమసుందరిని అతనితో ప్రేమలో పడేలా చేస్తాయి.
పట్టణ ప్రముఖుడు తిరుమల రెడ్డి శృంగారమంజరి పెద్ద కుమార్తె మాణిక్యవల్లిని ఆదరిస్తూ ఉంటాడు. నానాటికీ పెరుగుతున్న హేమసుందరి సౌందర్యం అతనిలో కొత్త ఆలోచనలు రేపుతుంది. ఒకనాటి రాత్రి తిరుమల రెడ్డి పై దాడిచేసి, అతని కాలు విరిచి, బంగారు నగలు సంగ్రహించి హేమసుందరితో కలిసి పొరుగునే ఉన్న పాండ్యరాజ్య ముఖ్య పట్టణం శ్రీరంగానికి పారిపోతాడు రంగనాయకుడు. వారిద్దరూ తమ పేర్లని హేమాంబా ధనుర్దాసులుగా మార్చుకుని భార్యాభర్తలుగా చెలామణి అవుతూ కొత్తజీవితం ప్రారంభిస్తారు.
హేమని తనకి దక్కేలా చేస్తే శ్రీరంగేశునికి హేమసుందరి నేత్రాలని పోలిన పైడి కనుదోయి, స్వర్ణ తిలకం సమర్పించుకుంటానని విచిత్రమైన మొక్కు మొక్కుకున్న రంగనాయకుడు, దానిని తీర్చుకుని తిరిగి వస్తుండగా రామాజున మఠాధీశుడు రామానుజ యతి తన శిష్యులతో నగర సంచారం చేస్తూ ఎదురు పడతాడు. పండుటాకులా ఉన్న ఆ వృద్ధ యతి ముఖంలో చూడగానే ఆకర్షించేవి విశాలమైన నేత్రాలు. తొలిచూపులోనే యతికి రంగనాయకుడి మీద తెలియని వాత్సల్యం ఏర్పడుతుంది.
యతి తన శిష్యుని ద్వారా రంగనాయకుని పిలిపించుకొని అతడితో సాన్నిహిత్యం పెంచుకొంటాడు.
యతి సమక్షంలో శ్రీరంగేశుని దర్శించుకున్న రంగనాయకుడికి కోటికొక్కరికి మాత్రమే కలిగే మహద్భాగ్యం - శ్రీరంగశాయి నిజ నేత్ర దర్శనం - దొరుకుతుంది. ఆ విశాల నేత్రాలని దర్శించిన క్షణం రంగనాయకుడి జీవితం మరో అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. హేమసుందరి, రామానుజ యతి, శ్రీరంగనాధ స్వామి వారల 'విశాల నేత్రాలు' అతిసామాన్యుడైన రంగనాయకుడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే నలభైనాలుగేళ్ళ క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన నవల 'విశాల నేత్రాలు' కథాంశం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి అందుకున్నదీ నవల.
రాజభవంతిని తలపించే శృంగారమంజరి భవంతిలోకి ఒక అర్ధరాత్రి వేళ కావలి వాళ్ళ కళ్లుగప్పి, దేహానికి మసిపూసుకుని రంగనాయకుడు ప్రవేశించడంతో కథ ప్రారంభమవుతుంది. చకచకా మలుపులు తిరుగుతూ హేమసుందరి, రంగానాయకుడూ శ్రీరంగం చేరెంతవరకూ అత్యంత వేగంగా సాగే కథనం, అక్కడినుంచి కూసింత మందగిస్తుంది. కథానాయకుడు తొలి లక్ష్యాన్ని చేరుకోవడం, ఆ తర్వాతి లక్ష్యం ఏమిటన్నది పాఠకులకి తెలియకపోవడం ఇందుకు కారణాలని చెప్పాలి.
కాంచీ రాజ్య పాలన, క్రమశిక్షణ, శాంతిభద్రతలపై పాలకుల ప్రత్యేక శ్రద్ధ వంటి విషయాలతో పాటు, కుమార్తెల ద్వారా వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశించే వృద్ధ వేశ్య శృంగారమంజరి, తన చెల్లెలే తనకి పోటీ వస్తోందని భయపడే మాణిక్యవల్లి పాత్రలు ప్రథమార్ధాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. రెండోసగంలో శ్రీరంగేశుడి మీద భక్తి, రామానుజ యతి మీద గౌరవం చూపిస్తూనే, రంగనాయకుడు వ్యసనాలకి బానిసవ్వడం, నేరం చేయడానికి వెనుకాడకపోవడం కథని మలుపులు తిప్పుతాయి.
రంగనాయకుడి మీద యతి చూపే అభిమానం, ఆశ్రమంలో మిగిలిన శిష్యులకి కంటగింపు కావడం, ఓ దశలో యతి ఆశ్రమం విడిచిపెట్టడానికి సిద్ధపడడం కథని ముగింపు వైపు నడుపుతాయి.[2]
శైలి, శిల్పం
మార్చుఎంతో లలితమైన కథావస్తువుతో, ఆ కాలానికి తగినట్టు ప్రత్యేక రచనతో పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు తీర్చిదిద్దడం పాఠకుల్ని విడువక చదివించిందని రచయిత, విమర్శకుడు వి.రాజారామమోహనరావు పేర్కొన్నారు. రచనాపరంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబించారు. పాఠకులకు తిరిగి చెప్పదలచుకున్న అంశాలను, అంతకుముందే జరిగిపోయినా తిరిగి ప్రస్తావించారు. నవలలోని వర్ణనలు, చాలాచోట్ల వాతావరణ విశదీకరనకే కాక, పాత్రల మనస్థితిని తెలిపేలా తీర్చిదిద్దారు.[3]
ప్రాధాన్యత
మార్చునవలలు పత్రికల్లో ధారావాహికలుగా ప్రచురితమై ప్రజాదరణ సంపాదించిన రోజులకు నాంది పలికిన నవలల్లో ఒకటిగా విశాల నేత్రాలు ప్రాధాన్యత సంతరించుకుంది. పత్రికలో బాపుబొమ్మలతో వెలువడిన ఈ నవల వల్ల సాహిత్యానికి చిత్రాలు ఎంత ప్రయోజనకరమో పాఠకుల స్పందన ద్వారానే తెలిసింది. ఈ నేపథ్యంలో పత్రికల్లో ప్రచురితమయ్యే నవలలకు, కథలకు భావస్ఫోరకమైన చిత్రాలు ఉండేలా చూసుకోవడం ప్రారంభించారు.
ఇలా నవలల ప్రచురణలో సంప్రదాయాలను నెలకొల్పి ఒరవడి దిద్దిన నవలగా విశాల నేత్రాలు నిలిచింది.
ప్రాచుర్యం
మార్చుఈ నవల ధారావాహికగా వెలువడే రోజుల్లో వారం వారం పత్రిక కోసం పాఠకులు ఆత్రుతగా ఎదురుచూసేవారని పలువురు సాహిత్య విమర్శకులు పేర్కొన్నారు. గణపతిశాస్త్రి కూర్చిన అనేక రకాల వర్ణనలను, సౌందర్య వివరాలను అపురూపమైన చిత్రాలుగా బాపు మలిచేవారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా నవల పాఠకలోకంలో ఒక సంచలనంగా నిలిచింది. అనంతర కాలంలో పుస్తకరూపాన్ని సంతరించుకున్న విశాల నేత్రాలు పలుమార్లు పునర్ముద్రితమైంది.
ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2003 ప్రాంతాలలో "ధనుర్దాసు" అన్న పేరుతో దూరదర్శన్ ఈ నవలను చిత్రీకరించి ప్రసారం చేశారు. ఈ నవలను సినిమాగా తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగాయి. ప్రముఖ సినీనటుడు, నిర్మాత ఉప్పలపాటి కృష్ణంరాజు పలుమార్లు విశాల నేత్రాలు చిత్రంగా తీయడం తన కల అంటూ పేర్కొన్నారు. ఆయన సినిమాకు అనుగుణంగా పూర్తిస్థాయి స్క్రిప్టు రాయించుకుని, ప్రభాస్ కథానాయకునిగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కారణాంతరాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. "విశాలమైన నేత్రాలతో గణపతిశాస్త్రి వర్ణనలకు తగ్గ కథానాయిక దొరకక ఈ కథ చిత్రరూపం దాల్చలేదని" పలు ముఖాముఖీల్లో పాల్గొన్న ఆయన త్వరలోనే విశాలనేత్రాలు సినిమాగా వస్తుందని కూడా చెప్తున్నారు.[4][5]
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 విశాల నేత్రాలు గ్రంథానికి ముందుమాట "రెండుమాటలు":పిలకా గణపతిశాస్త్రి:1963 ప్రచురణ
- ↑ పిలకా గణపతి శాస్త్రి రచించిన "విశాల నేత్రాలు" నవల
- ↑ వి.రాజారామమోహనరావు రచించిన "నవలాహృదయం"లో విశాల నేత్రాలు వ్యాసం; పేజీ.54
- ↑ [1][permanent dead link] కృష్ణంరాజు ఇంటర్వ్యూ
- ↑ [2] Archived 2016-03-07 at the Wayback Machine 2012 జనవరిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ