విష్ణువు వేయి నామములు-501-600
విష్ణు సహస్రనామ స్తోత్రము | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 501 నుండి 600 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.
కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.
విష్ణువు వేయి నామములు-501-600
మార్చు501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.
538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.
540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.
544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.
547) వేధా: - సృష్టి చేయువాడు.
548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.
551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.
552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.
553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.
559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.
560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.
561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.
564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.
569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.
571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మాతృగర్భమున జన్మించనివాడు.
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.
576) సామ - సామవేదము తానైనవాడు.
577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.
579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.
580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.
581) శమ: - శాంత స్వరూపమైనవాడు.
582) శాంత: - శాంతి స్వరూపుడు.
583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.
584) శాంతి: - శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.
586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.
589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.
591) గోహిత: - భూమికి హితము చేయువాడు.
592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.
593) గోప్తా - జగత్తును రక్షించువాడు.
594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.
595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.
596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.
598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.
600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.