విష్ణువు వేయి నామములు-901-1000
విష్ణు సహస్రనామ స్తోత్రము | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 901 నుండి 1000 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.
కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.
విష్ణువు వేయి నామములు-901-1000
మార్చు901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.
902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.
903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.
904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.
906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.
907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.
911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.
912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.
914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.
916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.
917) దక్ష: - సమర్థుడైనవాడు.
918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.
920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీతభయ: - భయము లేనివాడు.
922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.
927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.
929) సంత: - పవిత్ర స్వరూపుడు.
930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.
931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.
932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.
933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.
934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.
935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.
936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.
946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.
947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.
951) అధాతా - తానే ఆధారమైనవాడు.
952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.
953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.
954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.
955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.
956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.
962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
968) తార: - సంసార సాగరమును దాటించువాడు.
969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.
974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.
977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.
978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.
980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.
982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.
983) అన్నం - ఆహారము తానైనవాడు.
984) అన్నాద: - అన్నము భక్షించువాడు.
985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
990) స్రష్టా - సృష్టికర్త
991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.
992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.
993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.
994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.
995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.
997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.
1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.