విష్ణువు వేయి నామములు-201-300
విష్ణు సహస్రనామ స్తోత్రము | ||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 201 నుండి 300 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.
విష్ణు సహస్రనామాల గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించింది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.
కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.
శ్లోకం 22
మార్చు- అమృత్యుః --- మరణము గాని, నాశనము గాని లేనివాడు.
- సర్వదృక్ --- విశ్వ దర్శియై మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు.
- సింహః ---సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు.
- సంధాతా --- జీవులను వారి కర్మఫలములకు ముడివేయు (అనుసంధానించు) వాడు; నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు.
- సంధిమాన్ --- భక్తులందు ఐక్యమై యుండువాడు; తాను స్వయముగా జీవరూపుడై కర్మఫలములను అనుభవించువాడు.
- స్థిరః --- భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలాడు; నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు.
- అజః --- పుట్టుకలేనివాడు (స్తంభమునుండి అవతరించిన శ్రీనారసింహమూర్తి) ; అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు; సకల శబ్దములకును మూలము ('అ'కారము)
- దుర్మర్షణః --- ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు భరింపశక్యముగాని వాడు.
- శాస్తా --- బోధించువాడు, జగద్గురువు; శాసించువాడు, భక్తుల మార్గము నవరోధించువారిని శిక్షించువాడు.
- విశ్రుతాత్మా --- జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయునో ఆ దేవదేవుడు; సత్యము, జ్ఞానము, పరబ్రహ్మము - ఇత్యాది విశిష్ట నామములచే స్తుతింపబడు అనంతగుణ సంపన్నుడు; వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి; విశేష, షడ్గుణ్య పరిపూర్ణ, పరమాత్మ.
- సురారిహా --- దేవతల శతృవులను హరించువాడు.
శ్లోకం 23
మార్చు - గురుర్గురుతమః --- గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;
గురుః --- సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;
గురుతమః --- ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి. - ధామ --- పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.
- సత్యః --- మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.
- సత్యపరాక్రమః --- నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.
- నిమిషః --- యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)
- అనిమిషః --- ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.
- స్రగ్వీ --- వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.
- వాచస్పతిః --- వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.
- ఉదారధీః --- ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.
వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)శ్లోకం 24
మార్చు - అగ్రణీః --- ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు, భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు, మార్గదర్శి.
- గ్రామణిః --- సకల సముదాయములకు (సామాన్యజీవులకు, దేవతలకు, ముముక్షువులకు) నాయకుడు; అందరికిని మోక్షమార్గము చూపు పెద్దదిక్కు; సత్యసూరులకు నాధుడు.
- శ్రీమాన్ --- (22, 180, 222వ నామములు) శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద; సకల సంపదలు మూర్తీభవించిన మూర్తి, సిరిగలవాడు; సమస్త వైభవము గలవాడు, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి గలవాడు; ప్రకాశించువాడు, తేజోమూర్తి; శ్రీమహాలక్ష్మీపతి; వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు; సకల శక్తిమంతుడు. 'శ్రీ' అనగా లక్ష్మీదేవి. సదా లక్ష్మీదేవితో కూడి యుండువాడు - విష్ణుమూర్తి. ఆదిదేవుని వక్షస్థలమున లక్ష్మీదేవి సదా వసించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము.
- న్యాయః --- భక్తులకు తగురీతిలో (మోక్ష) ఫలము ప్రసాదించువాడు; పరబ్రహ్మజ్ఞానమునకు దారిచూపు తర్ము, యుక్తి; విశ్వమందు అంతటిని సక్రమముగా నియమముగా నడుపు శక్తి.
- నేతా --- భక్తుల కోరికలను తీర్చువాడు; విశ్వమునందన్ని వ్యవహారములను నిర్వహించు అధికారి; భక్తులను తన నేతృత్వములో సన్మార్గ మోక్షమార్గములకు చేర్చువాడు.
- సమీరణః --- అద్భుతమైన, మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు; ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు; సకల జీవుల శ్వాసను, తదితర చైతన్యమును నడపువాడు.
- సహస్రమూర్ధా --- వేయి (లెక్క పెట్టలేనన్ని) శిరసులు గలవాడు;అంతటను ఉండువాడు.
- విశ్వాత్మా --- విశ్వమునకే ఆత్మ; సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు.
- సహస్రాక్షః --- వేయి (లెక్క పెట్టలేనన్ని) కన్నులు గలవాడు; అంతటిని చూచుచుండువాడు.
- సహస్రపాత్ --- వేయి (లెక్క పెట్టలేనన్ని) పాదములు గలవాడు; అన్ని చోట్ల చరించువాడు.
శ్లోకం 25
మార్చు - ఆవర్తనః --- సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.
- నివృత్తాత్మా --- (231, 454, 604, 780 నామములు) అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.
- సంవృతః --- కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.
- సంప్రమర్దనః --- చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).
- అహఃసంవర్తకః --- సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.
- వహ్నిః --- సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.
- అనిలః --- (236, 818 నామములు) వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.
- ధరణీధరః --- భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).
శ్లోకం 26
మార్చు - సుప్రసాదః --- అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు.
- ప్రసన్నాత్మా --- సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు.
- విశ్వసృట్, విశ్వసృడ్ --- విశ్వమును సృజించినవాడు;
విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు.
(పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్ - విశ్వభుగ్విభుః --- 'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు.
శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి.
విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు
విభుః --- హిరణ్య గర్భుడై, అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు. - సత్కర్తా --- సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు.
- సత్కృతః --- పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు.
- సాధుః --- (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు.
- జహ్నుః --- గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు.
- నారాయణః --- సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు.
- నరః --- నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు..
శ్లోకం 27
మార్చు - అసంఖ్యేయః --- లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.
- అప్రమేయాత్మా --- కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.
- విశిష్టః --- అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.
- శిష్టకృత్ --- తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.
- శుచిః --- (157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.
- సిద్ధార్థః --- సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.
- సిద్ధసంకల్పః --- సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.
- సిద్ధిదః --- భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.
- సిద్ధిసాధనః --- సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.
శ్లోకం 28
మార్చు - వృషాహీ --- అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)
- వృషభః --- భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.
- విష్ణుః --- (2, 259, 663 నామములు) అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.
- వృషపర్వా --- తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.
- వృషోదరః --- ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.
- వర్ధనః --- వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.
- వర్ధమానః --- వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.
- వివిక్తః --- విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.
- శ్రుతిసాగరః --- వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.
శ్లోకం 29
మార్చు - సుభుజః --- అందమైన భుజములు గలవాడు; జగద్రక్షకుడు, భక్త వరదుడు. (ఇందరికి నభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి)
- దుర్ధరః --- ఎవరిచేతను ఆపబడజాలని భుజబలము కలవాడు (ఎదురు లేనివాడు) ; తెలిసికొనుటకు అందనివాడు (తెలియరాని వాడు) ; మనసులో నిలుపుకొనుటకు కష్టమైనవాడు (నిలువరాని వాడు) ; మరి దేనిచేతను ధరింపజాలనివాడు (భరింపరానివాడు)
- వాగ్మీ --- మధురమైన, ప్రియమైన, స్తుతింపదగిన వాక్కుగలవాడు; శక్తిపూరితమైన వాక్కు గలవాడు; వేదములు ఆయన వాక్కునుండి ఉద్భవించెను.
- మహేంద్రః --- మహత్తరమగు, అనన్యమగు ఈశ్వర్యము గలవాడు, సిరిగలవాడు; ఇంద్రునకును, దేవతలకును దేవుడు; అన్ని వెలుగులకు మూలము.
- వసుదః --- సంపదల నిచ్చువాడు; భక్తుల అవసరములకు సకాలములో షడ్గుణైశ్వర్య సంపదలనే ధనము నిచ్చువాడు.
- వసుః --- తాను ఇచ్చు ధనము కూడా తానే ఐనవాడు; జ్ఞానులైనవారు కాంక్షించు సంపద వాసుదేవుడే (ముంగిట నల్లదివో మూలనున్న ధనము).
- నైకరూపః --- అనేక రూపములతో వెలయు విశ్వరూపుడు; ఒక రూపము అనికాక అనేక అవతారములు గలవాడు; (అన్ని రూపములు నీ రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు).
- బృహద్రూపః --- మహాద్భుతమైన పెద్ద రూపము గలవాడు; వరాహ, నారసింహ, త్రివిక్రమ వంటి బ్రహ్మాండ స్వరూపములు గలవాడు.
- శిపివిష్టః --- కిరణముల స్వరూపమున అంతటా వ్యాపించియున్నవాడు; యజ్ఞపశువునందు ఆవహించియున్నవాడు.
- ప్రకాశనః --- తన విశ్వ రూపమును దర్శించు భాగ్యము భక్తులకు ప్రసాదించువాడు; సమస్తమును ప్రకాశింప జేయువాడు.
శ్లోకం 30
మార్చు - ఓజస్తేజోద్యుతిధరః --- పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు
- ప్రకాశాత్మా --- ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.
- ప్రతాపనః --- సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.
- ఋద్ధః --- అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.
- స్పష్టాక్షరః --- స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.
- మంత్రః --- తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.
- చంద్రాంశుః --- చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.
- భాస్కరద్యుతిః --- సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.
శ్లోకం 31
మార్చు - అమృతాంశూద్భవః --- అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు.
- భానుః --- ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు.
- శశబిందుః --- దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు.
- సురేశ్వరః --- దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ.
- ఔషధం --- భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!)
- జగతస్సేతుః --- మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు..
- సత్యధర్మపరాక్రమః --- సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు.
శ్లోకం 32
మార్చు - భూతభవ్యభవన్నాథః --- మూడు కాలములకును (గడచినది, జరుగుచున్నది, రాబోవునది) అధిపతి; మూడు కాలములందును అందరికి అన్నింటికి అధిపతి.
- పవనః --- వాయువు, ప్రాణము; సంచరించేవాడు, సర్వత్ర వ్యాపించియుండువాడు.
- పావనః --- అంతటినీ పవిత్రము చేయువాడు.
- అనలః --- తృప్తిలేని (తరగని) దయ గలిగినవాడు (దాశరథీ! కరుణా పయోనిధీ!) ; అగ్ని; పాప వినాశకుడు.
- కామహా --- కోరికలను (భక్తులకు తగని కామములను) నాశనము చేయవాడు.
- కామకృత్ --- భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు; కోర దగినవానిని సృష్టించువాడు; భక్తులకు తగిన మోక్షమును ప్రసాదించువాడు.
- కాంతః --- అతి మనోహరుడు, సమ్మోహన రూపుడు, ఆత్మ బంధువు (నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, సుధా రసమ్ము పై జల్లువాడు - నీదు పలుకె పలుకురా! నీదు కులుకె కులుకురా! నీదు తళుకె తళుకురా! నిజమైన త్యాగరాజనుత! ఎందు కౌగిలింతురా? నిన్నెంతని వర్ణింతురా!)
- కామః --- ప్రేమ స్వరూపుడు, కోరుకొన దగినవాడు, మన్మధుడు; ధర్మార్ధకామమోక్షములను అభిలషించువారిచే కోరబడువాడు.
- కామప్రదః --- కోరినవి ఇచ్చేవాడు (కొండలంత వరములు గూపెడు కోనేటిరాయడు).
- ప్రభుః --- (35, 300 నామములు) అందరికంటె అధికుడు; అందరిని అధిగమించువాడు; అందరి మనస్సులను తనవైపు లాగుకొను అధిష్ఠాత; ఘటనాఘటన సమర్ధుడు; దేవాధిదేవుడు.
శ్లోకం 33
మార్చు - యుగాదికృత్ --- యుగమును ఆరంభించువాడు; యుగములను సృష్టించి యుగారంభమున సృష్టికార్యము చేయువాడు; వటపత్రశాయి.
- యుగావర్తః --- యుగములను ప్రవర్తింపజేయువాడు, కాల చక్రమును నడుపువాడు; కాల స్వరూపుడు.
- నైకమాయః --- అనేకములైన అద్భుతములకు ఆలవాలమైనవాడు; ఎన్నోవిధములైన మాయా స్వరూపములను ధరించువాడు.
- మహాశనః --- విపరీతమైన ఆకలి గలవాడు, కల్పాంతమున సమస్తమును భక్షించువాడు; ప్రళయకాలమున అంతటిని తనయందు లయమొనర్చుకొనువాడు; గొప్పగా వ్యాపించినవాడు.
- అదృశ్యః --- కానరానివాడు; ఇంద్రియ, మనోబుద్ధులకు కనరాని, ఊహింప శక్యము గాని చరిత్ర గలవాడు (ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా? ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా?).
- వ్యక్తరూపః--- స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; యోగముచే కనుపించు రూపము కలవాడు.
అవ్యక్తరూపః --- తెలియరానివాడు. - సహస్రజిత్ --- వేలాది యుగములను జయించువాడు; వేలాది రాక్షసులను జయించువాడు (రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః)
- అనంతజిత్ --- అంతులేని విజయములు కలిగినవాడు; అవధులు లేకుండా ప్రకాశించేవాడు; తన అనంత మహిమలను ఇతరులెరుగజాల నట్టివాడు.
వనరులు
మార్చు- కృష్ణమాచారి విపుల వ్యాస పరంపర. ఒక్కొక్క నామమునకూ అనేక వ్యాఖ్యలనుండి తీసుకొన్న విషయాన్ని రచయిత ఇక్కడ సమర్పించారు.
- "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము" సంగ్రహ తాత్పర్య వివరణ - గీతా సాహిత్య శిరోమణి పండిత పెమ్మరాజు రాజారావు రచన - గొల్లపూడి వీరాస్వామి సన్స్ ప్రచురణ.
- "శ్రీ కైవల్య సారధి" - విష్ణు సహస్రనామ భాష్యము -శ్రీ విద్యా విశారద డా.క్రోవి పార్ధసారథి రచన.
- డా. ఎస్.టి.వి.ఎస్. రాజ గోపాలాచార్యులు, ఎస్.వి.రంగాచార్యులు, తట్టా శ్రీ రంగమన్నారు రచించిన "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము - లఘు వివరణ" - సముద్రాల శ్రీనివాస్ ప్రచురణ https://web.archive.org/web/20091027084259/http://geocities.com/havishsam/vishnu.htm