వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం విజయనగరం జిల్లా, బలిజిపేట లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు[1].
వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం,బలిజిపేట | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°36′47″N 83°31′46″E / 18.613061°N 83.529475°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం |
దేవనాగరి : | वेंकटेश्वर मंदिर, बलिजिपेट |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | విజయనగరం |
ప్రదేశం: | బలిజిపేట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వేంకటేశ్వరస్వామి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. 1869 |
చరిత్ర
మార్చు- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ రామస్వామి గారి సుపుత్రులు బరిగెడ చిన్న నరసయ్య గారిచే శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్ఠించబడింది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆనాడు చిన్న నరసయ్యగారు ప్రధాన దేవతామూర్తులైన వేంకటేశ్వర స్వామి, ఆండాళ్, జగన్నాధ స్వామి, బలభద్రుడు, సుభద్ర దేవుల విగ్రహాల ప్రతిష్ఠ చేశారు.
- 1927 లో వీరి మనుమడైన బరిగెడ నరసయ్య గారు కాశీయాత్ర చేసి గరుడాళ్వార్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆనాడే ధ్వజ స్తంభాన్ని కూడా రంగూన్ నుండి తెప్పించి స్థాపించారు.
- 1956 లో బరిగెడ నరసయ్య గారి ధర్మపత్ని రావింజమ్మ గారు దేవాలయానికి మొదటిసారిగా విద్యుత్తు కనెక్షన్ ఇప్పించారు. తర్వాత చిన్నవీధిలోని ఒక ముత్తైదువ దానమిచ్చిన ధనసహాయంతో నుయ్యిని తవ్వించి పూలతోటను వేయించారు.
- 1969 లో నరసయ్య గారి ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ కాలంలోనే పన్నిద్దరాళ్వారుల ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహాలను విజయవాడ నుండి తెప్పించారు. శ్రీవారి విమానం చుట్టూ దశావతారాల్ని శిల్పులచే చెక్కించారు.
నిర్మాణాలు
మార్చు- ప్రధాన దేవాలయం
- వేంకటేశ్వరుని సన్నిధి : ఇందులో సాలగ్రామశిలతో చెక్కబడిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారు మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తుండి ఎడమచేయి కటిహస్తంగా, కుడిచేయి అభయహస్తంగా జనులందరి కోరికలు తీరుస్తుంది. ఇరువైపులా శంఖచక్రాలు చెక్కబడి ఉంటాయి. దేవతామూర్తికి అలంకారంగా మకరతోరణం ఏర్పాటుచేశారు. ఉత్సవ విగ్రహాలు శ్రీవారితో బాటు శ్రీదేవి, భూదేవులు పంచలోహాలతో చేయబడి కనువిందుచేస్తాయి. భోగశ్రీనివాసమూర్తి సుదర్శనచక్రంతో పాటు మండపం మీద కొలువుంటారు.
- జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రల సన్నిధి
- ఆండాళ్ సన్నిది
- ఆళ్వారుల సన్నిధి
- గరుడాళ్వారుల సన్నిధి
- ధ్వజస్తంభం
- అలంకార మండపం
- ముఖ మండపం
- వంటశాల
- శ్రీవారి పూలతోట
- తులసివనం
- ఆలయ పూజారుల నివాసగృహాలు
పూజా కార్యక్రమాలు
మార్చుదైనందిన పూజలు
మార్చు- ఆలయం తెరిచే సమయం : 06:00
- ఉదయం: 06:00 - సుప్రభాత సేవ
- ఉదయం: 07:30 - బాలభోగం, మంగళాశాసనం
- ఉదయం: 11:30 - రాజభోగం, మంగళాశాసనం
- ఉదయం 11:30 కు ఆలయం మూసివేయబడును
- సాయంత్రం 05:00 కు ఆలయం తెరువబడును
- రాత్రి 07:30 కు పవళింపు సేవ
భక్తుల పూజలు
మార్చు- అష్టోత్తరనామ పూజ
- సహస్రనామ పూజ
- లక్ష్మీదేవి కుంకుమపూజ
- శ్రీస్వామివారి కళ్యాణం
ఊరేగింపు
మార్చుశ్రీ వేంకటేశ్వర స్వామివారిని కొన్ని పర్వదినాల్లో గ్రామ వీధుల్లో భక్తుల దర్శనం కోసం ఊరేగిస్తారు. మార్గశిర శుద్ధ ఏకాదశి, వైశాఖ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, భోగి పర్వదినాలలో స్వామిని విమానంలో ఊరేగించగా; కనుమ, ఉగాది, తొలి ఏకాదశి, శ్రీరామనవమి, నరక చతుర్దశి, రామానుజ, గోదాదేవి, నమ్మాళ్వార్ల తిరునక్షత్ర దినాల్లో చిన్న పల్లకిలో ఊరేగించి గ్రామవాసులందరికీ కనువిందు చేస్తారు.
విశేష ఉత్సవాలు
మార్చుజగన్నాథుని రథోత్సవం
మార్చు- జగన్నాథ ఉత్సవాలు : ఈ ఉత్సవాలు ఆషాఢ శుద్ధ విదియ నుండి ఆషాఢ శుద్ధ దశమి వరకు శాస్త్రీయంగా జరుగుతాయి. ముందుగా జేష్ట పౌర్ణమి రోజు జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను భక్తులకు కనిపించకుండా తెరవేసి చిన్న మండపం మీద ఒక కలశాన్ని ఉంచుతారు. ఆకాలంలోనే రథాన్ని తయారుచేయడాన్ని ప్రారంభిస్తారు. రథయాత్రలో మొదటిరోజు విదియ పుణ్యతిథిన స్వామివార్లను రథం మీదకు ఎక్కిస్తారు. కలశాన్ని ఏడుసార్లు రథం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. తర్వాత మొదటగా ధర్మకర్తల హారతి, దర్శనం తర్వాత ప్రజల దర్శనం కోసం విడిచిపెడతారు. అక్కడ రథం మీద స్వామివారిని అలంకార మండపం ముందు ఆ రోజు రాత్రి మరునాడు భక్తులు దర్శించుకోవచ్చును. మూడవరోజు రథం మీద స్వామివారు భక్తుల సహాయంతో గుడిచ దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ ఐదు రోజులు స్వామి విడిది చేస్తారు. ప్రతిరోజు జగన్నాధ స్వామి, బలభద్రులను రోజుకు రెండు చొప్పున ఐదు రోజులూ పది అవతారాలుగా అలంకరిస్తారు. నాలుగవరోజు - మత్స్యావతారం, కూర్మావతారం; ఐదవరోజు - వరాహావతారం, నారసింహావతారం; ఆరవరోజు - వామనావతారం, పరశురామావతారం; ఏడవరోజు - రామావతారం, కృష్ణావతారం; ఎనిమిదవరోజు - బుద్ధావతారం, కల్క్యావతారంగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివార్ల అలంకరణ కోసం వాడే వస్త్రాలను శ్రీ రామచంద్ర పాత్రుడు గారు బాధ్యత వహిస్తారు. కృష్ణావతారం రోజు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయిన జగన్నాథస్వామిని పిలువడానికి వెళ్తుంది. తొమ్మిదవ రోజు స్వామి తిరుగు ప్రయాణంగా ప్రధాన దేవాలయానికి తిరిగివస్తారు. మొదటిరోజు భోగం దేవస్థానం వారు చేపట్టగా, ఐదు రోజుల రాత్రి భోగాన్ని వంశపారంపర్యంగా కొందరు భక్తులు ధనసహాయం చేస్తారు. ప్రతిరోజు భోగంగా 30 కుంచాల కొమ్ము శెనగలు, 20 కుంచాల పులిహోర నైవేద్యం పెట్టి భక్తులకు వినియోగిస్తారు. ఈ ప్రసాదాలు స్వామివారి వంటశాలలోనే తయారుచేస్తారు.
మరికొన్ని ఉత్సవాలు
మార్చు- శ్రీస్వామివారి కళ్యాణోత్సవం : దేవస్థానం వారు ప్రతి సంవత్సరం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ఘనంగా జరిపిస్తారు.
- ధనుర్మాసం పూజలు, గోదా కళ్యాణం నెలరోజులు పవిత్రంగా నిర్వహిస్తారు.
- శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజలు భక్తులందరి సహకారంతో జరుగుతాయి.
గర్భాలయం గోడమీది దశావతారాలు
మార్చుమత్స్యావతారం | త్రికూర్మావతారం | వరాహావతారం | నారసింహావతారం | వామనావతారం |
పరశురామావతారం | రామావతారం | బలరామావతారం | కృష్ణావతారం | కల్క్యావతారం |
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.