వేయిపడగలు

విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం

వేయిపడగలు నవలను విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది విశ్వనాధ నవలలలో అత్యంత ప్రసిద్దమైన నవలగా ప్రజాదరణ పొంది పలుమార్లు పునర్ముద్రితమైనది.

వేయిపడగలు.
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: రసతరంగిణీ గ్రంథ మాల, మచిలీపట్టణం.
విడుదల: 1934, 1989

రచన, నేపథ్యం సవరించు

 
విశ్వనాథ సత్యనారాయణ

ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.[1]

ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం, దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను విశ్వనాధ పావనిశాస్త్రి కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్‌లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు [2]-

సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు;వేణుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర ధర్మారావు - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు; కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;

గుంటూరు ఏ.సి. కాలేజిలో మత సంబంధమైన ఒక వ్యాఖ్యకు సంబంధించిన వివాదంలో విశ్వనాధ తన ఉద్యోగాన్ని వదులుకోవలసివచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొక ఉద్యోగంలో చేరని దశలో ఈ నవల వ్రాయబడింది. నవలలో చెప్పబడిన ధార్మిక సాహిత్య వాద ప్రతివాదాలు విశ్వనాధ జీవితంలో ఇతరులతో జరిగిన విభేదాలను చాలావరకు ప్రతిబింబిస్తాయి.[2]

కథ సవరించు

 
విశ్వనాధ వారి వేయిపడగలు మొదటి భాగపు చిత్రము
 • నవల ప్రారంభం వినూత్నంగా ఉంటుంది, కాని అసలు కథకు ఈ ప్రారంభ కథకు సంభంధం ఉండదు.
 • ఈ నవలను విశ్వనాధ వారు అంకితమిస్తూ ఇలా రాసుకొన్నారు-

నీవొక పెద్ద వెల్గువయి నీ వెలుగారిన నాదు జీవిత
వ్యావృతి యీ కవిత్వ మనునట్టీ విచిత్రపు నీడ పారె
దేవీ'అరుంధతీ ప్రముఖ దివ్యమహా పరిలీన మూర్తి ఆ
నీ వెలుగుల్ పరోక్షమయి నేటికి నీడలు పారజొచ్చెడున్

కథా విశేషాలలోకెళితే ఒక గొల్లవాడి దగ్గరుండే ఒక ఆవు ఇచ్చే అపారమైన పాల వలన అతడు ఏ చీకూ చింతా లేక జీవిస్తుంటాడు. అయితే కొద్ది రోజులుగా ఆవు సాయంకాలం పాలివ్వడం మానేయ్యడంతో ఒక రోజు కాపరి దానిని అనుసరించి వెళతాడు. సాయంకాల సమయానికి గోవు మందకు దూరంగా పోతుంతే దానిని అనుసరించి వెళ్ళిన అతడు గోవు ఒక పుట్టవద్దకు నడచి దానిపై ఆగటం అందునుండి ఒక తెల్లని సర్పం వచ్చి గోవు పొదుగునుండి పాలు త్రాగటం చూస్తాడు. అయితే అతడు చూస్తున్నది నిజమో కాదో తెలియనట్టుగా ఆసర్పమునకు అనేక శిరసులు కనిపిస్తాయి. ఆ రాత్రి అతడి కలలో కనబడిన ఆసర్పము తనకు అక్కడ దేవాలయం నిర్మించవలసినదిగా చెప్పి మాయమవుతుంది. తదనంతరం అక్కడ ఒక గ్రామం వెలసి విలసిల్లి తధనంతరం ఎలా శిథిలమయిందనే దానిని కథకు మూలంగా చెపుతూ కొన్ని ముఖ్యపాత్రల ద్వారా కథను కొంచెం మెల్లగా అప్పటి స్థితి గతులను తెలియ జేస్తూ సాగించారు.

 • కథలో ముఖ్య పాత్రధారులు
 1. దేవదాసి
 2. ధర్మారావు
 3. రంగారావు
 4. గణాచారి

కథనం-విశేషాలు సవరించు

 

కథనంలో సామాన్య పాఠకుడు ఆశించే తొందరను విశ్వనాధ ఖాతరు చేయడు. సందర్భానుసారంగా అనేక శాస్త్ర, సాహిత్య, ధార్మిక విశేషాలను తన పాత్రల ద్వారా చెప్పిస్తాడు. కనుక ఈ నవల శ్రద్ధగా చదివితే పాఠకునికి చెప్పుకోదగిన పాండిత్య పరిచయం లభిస్తుంది. అలాగే అప్పటిలో దేశంలో చర్చలో ఉన్న వివిధ ధ్యాన పద్ధతుల గురించి విస్తారమైన వ్యాఖ్యలున్నాయి. ఆంగ్ల సాహిత్యాన్ని పోలిన విపుల సాహితీ పరంపర తెలుగులో లేదన్న ఒక వాదనకు ధర్మారావు ద్వారా రచయిత ఇలా జవాబు చెప్పించాడు -

మనకును లక్ష రకముల ప్రబంధములున్నవి. ఇతిహాసములు, కావ్యములు, కావ్యాలలో ఎన్నో రకాలు, నాటకాళు పది రకాలు, పదాలు, క్షేత్రయ్య పదముల వంటివి, యక్ష గానములు, జంగము కథలు, బొబ్బిలి పాటలు, శతకములు, ఉదాహరణములు, చాటువులు, స్తోత్రములు, - ఇవన్నీ కాక వారికి లేని లక్షణ గ్రంథములు - ఇంత విలక్షణమైన సృష్టి ఇతర దేశములలో చూపుడు.

శైలి, ఉదాహరణలు సవరించు

పాఠకుల స్థాయి రచయిత దిగిపోవడం కంటే కొంత వరకైనా పాఠకులను ఉన్నత స్థితికి లాగాలని విశ్వనాధ తాపత్రయం [2]. ఈ నవలలో ప్రౌఢమైన భాష, శైలి కనిపిస్తుంది.

క్రింది వాక్యాలు బహుశా సాక్షి వ్యాసాల గురించి కావచ్చును.

రాసినాయన ఆంధ్రా డికెన్స్ అట. నిజమే కాబోలునని తీసితిని. ఆంగ్లేయములో పిక్‌విక్ పేపర్స్ అని యున్నవి. అవి చాలా రమ్యముగా ఉండును. ఈ యుపన్యాసములు వానిననుసరించి రాయబడెనని చెప్పిరి. తీసి చూచితిని కదా… దానికి దీనికి ఏమియూ సంబంధం లేదు. చెప్పినదే చెప్పి, చెప్పినదేచెప్పి ప్రాణములు తీయుచున్నాడు. పలుకుబడిలో నొదుగు ఒక చిన్న వాక్యమును చెప్పి పెద్ద అర్థమును స్ఫురింపజేయుట మొదలైన మహారచయిత లక్షణములు లేవు. ఒక శయ్య లేదు. వాచ్యత ఎక్కువగా ఉన్నది. శబ్దప్రయోగమునందు కూడా సొగసు కనిపించుటలేదు. (ధర్మారావు అరుంధతి తో)

పాశ్చాత్య భారతీయ రచనా శిల్పాల పోలిక:

పాశ్చాత్యుల శిల్పము సహారా ఎడారి లోని సికతామయోన్మత్త ప్రళయవాయువుల వలె విరుచుకుని, మానుష ప్రకృతినున్మూలించునకు ప్రయత్నించును. భారతీయ శిల్పము భారత జాతిమతధర్మముల వలెనే ఇంద్రియముల నదుపులో పెట్టి సంఘమర్యాదల ననుసరించి నడువవలెనన్నట్లు - భావోద్రేకమలినం నిర్మూలించి తదంతర్గాఢదృఢత్వమును ప్రకటించును.

మరోచోట "శిల్పం" పై:

 
శిల్పం నిప్పులు తొక్కిన కోత వంటిది కాదు. మదించిన ఏనుగు వంటిది. ఉన్మాదమెక్కువ కలది. ఠీవి ఎక్కువ. నిదానమెక్కువ. శక్తి ఎక్కువ.

మరొక "ఆశ్చర్యం కలిగంచే" వ్యాఖ్య -

భోగముదానికిచ్చిన డబ్బు మోటారు కొన్నదానికన్నా చెడిపోయిందా? ఇది ఏదో ఒక పేదజీవి బ్రతుకుటకుపయోగపడినది. మోటారు కొన్న డబ్బు అమెరికాలోని కోటీశ్వరులైన ఫోర్డు, రాక్‌ఫెల్లర్ లను బాగు చేయుచున్నది. ఏమి న్యాయము?

సాహిత్య పరిశోధనలు సవరించు

వేయిపడగలు నవలపై పలు సాహిత్య పరిశోధనలు చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో వేయిపడగలు నవల గురించి పరిశోధించి పలువురు విద్యార్థులు 2 పీహెచ్.డీలు, 8 ఎం.ఫిల్స్ సాధించారు. వాటిలో కొన్ని:

పి.హెచ్.డి. పరిశోధనలు సవరించు

2007లో నాదెళ్ళ రామకృష్ణ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విశ్వనాథ వేయిపడగలు - అడవి బాపిరాజు నారాయణరావు నవలల్లో వర్ణనలు:తులనాత్మక పరిశీలన అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.[3]

ఎం.ఫిల్. పరిశోధనలు సవరించు

 • 1984లో బి.రుక్మిణి వేయిపడగలులో స్త్రీ అంశంపై చేసిన పరిశోధనకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్ పొందారు.
 • 1991లో వేయిపడగలు-బ్రిటీష్ సాంస్కృతిక సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన అంశంపై చేసిన పరిశోధనకు సిహెచ్.పద్మజ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. సాధించారు.
 • 1993లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేయిపడగలులో ధర్మదృష్టి అంశంపై ఎన్.విద్యుల్లత చేసిన పరిశోధనకు ఎం.ఫిల్ లభించింది.
 • 1992లో ఎం.గంగిరెడ్డి వేయిపడగలులో ప్రతీకాత్మకత అంశంపై పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయలు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పొందారు.
 • 1986లో కాకతీయ విశ్వవిద్యాలయంలో వేయిపడగలు-సమకాలీనత-సార్వకాలీనత అనే అంశంపై కె.వి.ఎన్.రాఘవన్ పరిశోధన సమర్పించి ఎం.ఫిల్. పొందారు.
 • 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేయిపడగలు, నారాయణరావు నవలల్లో నాయకపాత్రలు - తులనాత్మక పరిశీలన అంశంపై పరిశోధించి వి.సుజాత ఎం.ఫిల్ పొందారు.
 • 2016లో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ‘‘వేయిపడగలు-చిలకమర్తి’ నవలలు - రేడియో నాటకీకరణ’’ అనే అంశంపై ఎస్.రాజేందర్ పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టాను పొందారు.[3]

ప్రముఖ వ్యాఖ్యలు సవరించు

 • వేయి పడగలతోనేల దాల్చిన వాడు రెండు పడగలతో దంపతుల పాలించువాడు. ఒక్కపడగ విప్పి పైరు పచ్చకు గొడుగుపట్టినవాడు. త్రిమూర్త్యాకృతి, శూలము నాలుకయందు, శంఖ చక్రములు ఫణాగ్రముల యందు దాల్చిన దేవుడు, ధర్మమయ తనువు, కరుణాతరంగితాంతరంగుడై తన్ను గూడ తన పితరులవలెనే సంప్రదాయమునకు దూరము గాకుండ కాపాడువాడు నాకు ప్రసన్నుడగునుగాక! నన్ను సర్వదా రక్షించుగాక[4]

అనువాదాలు సవరించు

దీనిని మాజీ భారత ప్రధాని పి.వి.నరసింహారావు "సహస్రఫణ్ "గా హిందీ లోకి 1968 కాలంలో అనువదించాడు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1995 తరువాత దూరదర్శన్ ద్వారా హిందీలోను, మరికొన్ని భాషలలోను ధారావాహికగా ప్రసారమైంది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ.మహేంద్ర ధవె దీనిని గుజరాతీ భాషలోకి అనువదించారు. ఆర్.వి.ఎస్.సుందరం ఇదే నవలను కన్నడ భాషలోకి అనువదించాడు. 1998 కాలంలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.[1] డా. శ్యామల కల్లూరి గారి అంగ్లానువాదం ఆవకాయ.కామ్ లో Thousand Hoods అన్న పేరుతో సాప్తాహిక ధారావాహికగా 2014లో కొన్నాళ్ళపాటు ప్రచురితమైంది.

ఇతరుల వ్యాఖ్యలు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు, వనరులు సవరించు

 1. 1.0 1.1 "వేయి పడగలు" పుస్తకానికి విశ్వనాధ పావనిశాస్త్రి పీఠిక
 2. 2.0 2.1 2.2 శత వసంత సాహితీ మంజీరాలు - ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురణ - ఇందులో వేయిపడగలు గురించిన ఉపన్యాసం కూర్చినవారు ప్రసాదరాయ కులపతి
 3. 3.0 3.1 విశ్వనాథ వేయిపడగలు - అడవి బాపిరాజు నారాయణరావు నవలల్లో వర్ణనలు:తులనాత్మక అధ్యయనం:నాదెళ్ళ రామకృష్ణ
 4. పేరాల, భరతశర్మ. "విశ్వనాథలోని నేను". పుస్తకం.నెట్. Archived from the original on 6 జనవరి 2016. Retrieved 11 January 2016.

బయటి లింకులు సవరించు