వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య

మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించాడు. మొదట అతను గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం బయటకు వచ్చింది.

హత్య గావించబడ్డ వై.ఎస్.వివేకానందరెడ్డి

జీవితం, నేపథ్యం మార్చు

వై.ఎస్.వివేకానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి తమ్ముడు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న. 1989, 1994 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] 1999లో 90వేలు, 2004లో లక్షా పదివేల మెజార్టీలతో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2009లో తాను ఎన్నికవుతూ వచ్చిన కడప లోక్ సభ స్థానాన్ని అన్న కొడుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి విడిచిపెట్టి, ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎంపికయ్యాడు.[2]

2009 సెప్టెంబరు 2న నాటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అధిష్టానం మీద తిరుగుబాటు చేసి క్రమేపీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి స్వంతంగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేశాడు. ఆ సమయంలో వై.ఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రిమండలిలో 2010 నవంబరు 30న వ్యవసాయ శాఖ మంత్రి పదవి స్వీకరించాడు.[2] ఈ పరిణామాలు వివేకానందరెడ్డికీ, వై.ఎస్.జగన్మోహనరెడ్డి కుటుంబానికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టాయి. 2011లో పులివెందుల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన వదిన, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. ఎస్. విజయమ్మపై పోటీచేశాడు. ఆ ఎన్నికల్లో వివేకానందరెడ్డి 80వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

అయితే కొన్నాళ్ళకు ఈ విభేదాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తమవాడని చెప్పుకుంటూనే, విమర్శిస్తోందన్న కారణంతో 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. అప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేకానందరెడ్డి మరణించేదాకా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయనున్నాడని వార్తలు వెలువడ్డాయి. వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాడు.

మరణం మార్చు

వివేకానందరెడ్డి 2019 మార్చి 14 తేదీన చాపాడు మండలంలో ఎన్నికల ప్రచారం పూర్తిచేసుకుని పులివెందులలోని స్వగృహానికి చేరుకున్నాడు. మార్చి 15 తెల్లవారుజాము 5.30కి వివేకానందరెడ్డి ఇంటికి చేరుకున్న అతని పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవకపోవడంతో 6 గంటలకు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాడు. ఉదయం 6.30 గంటలకు వెనుక డోర్ తెరచి ఇంటిలోకి వెళ్ళి చూడగా రక్తపు మడుగులో వివేకానందరెడ్డి మృతదేహం కనిపించింది. ఆపైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కుమార్తె డాక్టర్ సునీత కోరిక మేరకు ఆమె వచ్చేవరకూ ఆగి సాయంత్రం 4 గంటలకు ఆమె పర్యవేక్షణలో స్థానిక ఆసుపత్రుల వైద్యులు, రిమ్స్ వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు.[4] మార్చి 16 తేదీ ఉదయం పులివెందులలో వివేకానందరెడ్డి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి సమాధి పక్కనే ఖననం చేశారు.[5]

దర్యాప్తు మార్చు

వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇది సహజ మరణం కాదనీ, హత్యని పేర్కొన్నారు.[6] 15వ తేదీ సాయంత్రం చేసిన పోస్టుమార్టంలో వివేకానంద రెడ్డి మృతదేహం మీద 7 కత్తిపోట్లు ఉన్నాయనీ, మెడ మీద, వెనుక, చేతి మీద, తొడ మీద బలమైన గాయాలు ఉన్నాయనీ తేలింది. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది.[7] కడప అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ సిట్‌కు నేతృత్వంలో సిట్ కింద ఐదు దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ సీఐడీ ఛీఫ్ అమిత్ గార్గ్ పర్యవేక్షిస్తున్నాడు.[8] దర్యాప్తులో భాగంగా పలువురిని సిట్ బృందం అరెస్టులు చేసింది.[9]

ప్రభావం మార్చు

వై.ఎస్.వివేకానందరెడ్డికీ, అతని కుటుంబానికీ ఉన్న రాజకీయ నేపథ్యం, అతని హత్య జరిగింది 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు కావడం వల్ల ఈ హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం అయింది. తెదేపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అతని కుమారుడు, మంత్రి నారా లోకేష్ ల ప్రణాళిక మేరకు, మంత్రి ఆదినారాయణరెడ్డి చేయించాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.[10] వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యను ఎందుకు గుండెపోటుగా ప్రచారం చేశారని ప్రశ్నిస్తూ, ఇంట్లోని సాక్ష్యాధారాలు తుడిచివేసే ప్రయత్నం జరిగిందని చంద్రబాబు వైసీపీ నేతలు, కుటుంబ సభ్యుల మీద ప్రత్యారోపణలు చేశాడు.[11] ఈ కేసును సిట్ చేతిలోంచి సీబీఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేసి, అందు కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరాడు.[12] వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారనీ, కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉంది కనుకనే సీబీఐ విచారణ కోరుతున్నారని చంద్రబాబు ప్రత్యారోపణ చేశాడు.[13]

మూలాలు మార్చు

  1. "YSR's brother Vivekananda Reddy found dead, case for unnatural death filed". The Economic Times. 15 March 2019. Retrieved 16 March 2019.
  2. 2.0 2.1 "Ex-minister YS Vivekananda Reddy known as people's leader". New Indian Express. 16 March 2019. Retrieved 16 March 2019.
  3. "Jagan Reddy's Uncle Found Dead At Home, Case Of Unnatural Death Filed". NDTV. 15 March 2019. Retrieved 16 March 2019.
  4. "వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఏ నిమిషానికి ఏం జరిగిందంటే." ఆంధ్రజ్యోతి. 16 March 2019. Retrieved 20 March 2019.[permanent dead link]
  5. "తండ్రి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు". 16 March 2019.[permanent dead link]
  6. "వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే అని అనుమానిస్తున్న పోలీసులు, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్". బీబీసీ తెలుగు. 15 March 2019. Retrieved 20 March 2019.
  7. "వివేకాది హత్యే : ఏడు కత్తి పోట్లు గుర్తింపు : పోస్టుమార్టంలో తేల్చిన వైద్యులు..!". 15 March 2019.[permanent dead link]
  8. Lode, Narasimha (15 March 2019). "వివేకా హత్య: పులివెందులకు అమిత్ గార్గ్ టీం". Asianet. Retrieved 20 March 2019.[permanent dead link]
  9. "Vivekananda murder: more persons in SIT net". The Hindu. 20 March 2019. Retrieved 20 March 2019.
  10. నాగరాజు, పెనుమల (15 March 2015). "చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి".[permanent dead link]
  11. "హత్యను దాచిపెట్టేందుకు ఎందుకు యత్నించారో జగన్ చెప్పాలి: సీఎం చంద్రబాబు - ప్రెస్ రివ్యూ". 16 March 2019.
  12. "వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్". telugu.news18.com.[permanent dead link]
  13. "రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు?". ఈనాడు. 16 March 2019. Archived from the original on 20 March 2019. Retrieved 20 March 2019.