శ్రీముష్ణం వి.రాజారావు

శ్రీముష్ణం వి.రాజారావు ఒక మృదంగ వాద్య కళాకారుడు, కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు.[1]

శ్రీముష్ణం వి.రాజారావు
వ్యక్తిగత సమాచారం
జననం1955
పాలయం కొటై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుమృదంగం

విశేషాలు

మార్చు

ఇతడు 1955లో తమిళనాడు రాష్ట్రంలోని పాలయం కొట్టై అనే గ్రామంలో జన్మించాడు[2]. ఇతని ముత్తాత సేతుమాధవరావు మైసూరు సంస్థానంలో ఆస్థాన మృదంగ విద్వాంసుడు.[3] రాజారావు తన తండ్రి ఎస్.వెంకటరమణారావు వద్ద మృదంగ విద్య ప్రాథమికంగా నేర్చుకున్నాడు. తరువాత కుంభకోణం ఎం.రాజప్ప అయ్యర్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని పాపనాశం శివన్, కలకత్తా కృష్ణమూర్తి, మయూరం వైద్యనాథ అయ్యర్‌ల వద్ద అభ్యసించాడు. ఇతనికి మృదంగంతో పాటు కంజీర, మోర్సింగ్ వాద్యాలలో కూడా ప్రవేశం ఉంది.

ఇతడు తన 7వ యేట మొదటి ప్రదర్శన ఇచ్చాడు. ఇతడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, టి.ఆర్.మహాలింగం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టి.ఎన్.శేషగోపాలన్, టి.ఎన్.కృష్ణన్, లాల్గుడి జయరామన్, ఆర్.కె.శ్రీకంఠన్, టి.వి.శంకరనారాయణన్, ఉప్పలపు శ్రీనివాస్, ఎస్.వి.రమణి, హైదరాబాద్ బ్రదర్స్, రుద్రపట్నం బ్రదర్స్ మొదలైన కర్ణాటక విద్వాంసులకు మృదంగ సహకారం అందించాడు.

ఇతడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళి మృదంగ పాఠాలు చెప్పాడు. ఇతని శిష్యులలో హెచ్.ఎస్.సుధీంద్ర, నైవేలి రామ్‌కుమార్, పూంగులం సుబ్రహ్మణ్యం మొదలైన వారున్నారు. ఇతని కుమారుడు శ్రీముష్ణం రాఘవేంద్రరావు కర్ణాటక గాత్ర సంగీత కళాకారుడు[3].

అవార్డులు

మార్చు
  • 1999లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ చే కళైమామణి పురస్కారం.
  • 2010లో కంచి మహాస్వామి వారిచే పురస్కారం.
  • 2011లో శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే "సంగీత చూడామణి"
  • 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డు

వివాదాలు

మార్చు

#మీటూ ఉద్యమంలో భాగంగా తన శిష్యురాళ్ళతో, తోటి కళాకారిణులతో ఇతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల పర్యవసానంగా మద్రాసు సంగీత అకాడమీ 2018 డిసెంబరులో జరిగిన సంగీతోత్సవాలలో ఆరోపణలు ఎదుర్కొన్న 6గురు కళాకారులతో పాటు ఇతడి సంగీత కచేరీలను కూడా రద్దు చేసింది.[4][5][6]

మూలాలు

మార్చు
  1. https://www.youtube.com/watch?v=QHbzeyZQsjw
  2. web master. "Srimushnam V. Rajarao". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 17 March 2021.[permanent dead link]
  3. 3.0 3.1 RANJANI GOVIND (22 July 2011). "Strokes of success". The Hindu. Retrieved 17 March 2021.
  4. "'Me Too' allegations: Madras Music Academy drops 7 artistes from Margazhi season". The News Minute. 2018-10-25. Retrieved 2018-12-01.
  5. "#MeToo in Carnatic music: Madras Music Academy's N Murali on addressing sexual harassment allegations against artists - Firstpost". www.firstpost.com. Retrieved 2018-12-01.
  6. Kolappan, B. (2018-10-25). "Music Academy debars seven musicians this season, post #MeToo". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-01.

బయటి లింకులు

మార్చు

Citation on the Sangeet Natak Academy website