సంక్రాంతి వంటలు

సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు.. వీటితో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయక వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్యనిపుణుల అభిప్రాయము.

సంక్రాంతి పండగ శీతాకాలంలో వచ్చే అతి పెద్దపండగ. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి పురులు కట్టుకుని రైతులు నిల్వ చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారమే అత్యధిక శక్తిని అందిస్తూ మనిషికి ఏడాదిపాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుంది. అందుకే కొత్త బియ్యంతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండగలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తిని ఇవ్వడంతో ఉష్ణం పెంపొందించుకోవడానికి దోహదపడతాయి. సంక్రాంతి సంప్రదాయ పిండివంటల ప్రాశస్త్యం అది. ఏయే వంటకాల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయన్న వివరాలు చూస్తే ....

అరిసెలు మార్చు

సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. అరిసెలు లేని సంక్రాంతిని ­ఊహించుకోవడం కష్టం అంటే దాని ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్ఠం. వీటి తయారీలో కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులు వాడతారు. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. వీటిలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బెల్లం రక్తశుద్ధికి దోహదపడుతుంది.

కొబ్బరి బూరెలు మార్చు

అరిసెల తరవాత అంతటి మధురమైన రుచిని అందించే వంటకం కొబ్బరి బూరెలు. దీంట్లో కొత్త బియ్యపుపిండి, కొబ్బరి, నువ్వుల పిండి, బెల్లం వాడతారు. పాకం పట్టేందుకు కొంతమంది పంచదార వాడతారు. పంచదార అయితే శక్తిని అందించి వెంటనే వదిలేస్తుంది. అదే బెల్లం అయితే మనిషికి దీర్ఘకాలంపాటు శక్తిని ఇచ్చేందుకు దోహదపడుతుంది. అందువల్ల బెల్లాన్ని వినియోగించడమే మంచిది. అరిసెలలో ఉన్న పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఈ కొబ్బరి బూరెల్లో లభిస్తాయి.

నువ్వుల ఉండలు మార్చు

అతి బలవర్థకమైన ఆహారం ఈ నువ్వుల ఉండలు. శీతాకాలంలో శరీరం పొడిబారిపోతూ ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు ఆహారంగా తీసుకోవడం ద్వారా దానిలో ఉండే నూనె శరీరాన్ని కాంతిమంతంగా ఉండేలా దోహదం చేస్తుంది. కిశోర బాలికల్లో రక్తహీనత నివారించడానికి ఉపకరిస్తుంది. అందుకే బాలికలు పుష్పవతి అయినప్పుడు నవ్వుల ఉండలు అనవాయితీగా అందిస్తారు. శరీరంలో వేడి పుట్టించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విటమిన్‌ ఎ, డి, ఇ, కెలు మనిషికి లభిస్తాయి. హార్మోన్ల స్థాయిని పెంపుదల చేసి దేహదారుఢ్యానికి దోహదపడుతుంది.

కజ్జికాయలు మార్చు

పండగకు ఎన్ని వంటకాలు వండుకున్నా తప్పనిసరిగా కజ్జికాయలూ వండుతారు. ఎందుకంటే దీర్ఘకాలం నిల్వ ఉండటంతోపాటు పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. అందుకే ‘పండగకు ఏం పప్పలు వండుతున్నారక్కా అంటే అరిసెలు, కజ్జికాయలు, కాసిని జంతికలు వండా’ అంటూ పల్లెల్లో మహిళలు చెప్పుకుంటుంటారు. దీనిలో కొబ్బరి, రవ్వ, పంచదారతో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, జీడిపప్పు వంటివి వినియోగిస్తారు. మనిషికి కావాల్సిన ప్రోటీన్స్‌, ఐరన్‌, ఖనిజ లవణాలు అందుతాయి.

గారెలు మార్చు

వేడివేడి గారెల్లో నాటు కోడిమాంసం వేసుకుని తింటే ఆ రుచే వేరు. కేవలం రుచిలోనే కాదు పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో పుష్కలంగా మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులతోపాటు అనేక రకాల ప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.

జంతికలు మార్చు

తియ్యటి పదార్థాలు తిన్న తరువాత కారంగా ఉండే పదార్థాలు కోరుకుంటారు. అలాంటి సమయంలో గుర్తుకొచ్చేవి జంతికలు. పండుగల సందర్భంలో సామాన్యుని ఇంటిలో సైతం ఉండే వంటకమిది. బియ్యపు పిండి, శనగపిండి, నువ్వులు ఇందులో వాడతారు. శనగపిండి, బియ్యపు పిండి కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లను అందిస్తే నువ్వులు చర్మాన్ని కాంతివంతం చేసేందుకు సహకరిస్తుంది. చిన్నపిల్లలు వీటిని ఎక్కువ తింటారు. వీటిలో వాడే వాము సుఖ విరోచనానికి తోడ్పడి.. జీర్ణప్రక్రియ చురుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది.

సున్నుండలు మార్చు

బలవర్థకమైన ఆహారంలో సున్ని ఉండలు మొదటిస్థానంలో ఉంటాయి. మినపపిండి, నెయ్యి, బెల్లం వాడతారు. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తే, సున్ను, నెయ్యి ద్వారా ప్రోటీన్లు, పలు రకాల పోషకాలను, శక్తిని అందిస్తాయి. కొత్త అల్లుళ్లకు ప్రత్యేకంగా సున్ని ఉండలు అడిగి అడిగి మరీ పెడతారు. సుఖ విరోచనమై శరీరం తేలికగా ఉంటుంది. హోర్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. శృంగారశక్తిని పెంపొందించడంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ఎంత దోహదం చేస్తాయి.