సంతాల్ తిరుగుబాటు

సంథాల్ తిరుగుబాటు, ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీకి, జమీందారీ వ్యవస్థకూ వ్యతిరేకంగా జరిగిన సాయుధ తిరుగుబాటు. ఇది 1855 జూన్ 30 న ప్రారంభమైంది. 1855 నవంబర్ 10, న, ఈస్ట్ ఇండియా కంపెనీ మార్షల్ లా ప్రకటించింది. ఈ తిరుగుబాటు 1856 జనవరి 3 న ప్రెసిడెన్సీ సైన్యాలు అణచివేసి, మార్షల్ లా ఎత్తివేయడంతో ఈ తిరుగుబాటు ముగిసింది . ఈ తిరుగుబాటుకు సిద్ధు ముర్ము, కన్హు ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము అనే నలుగురు ముర్ము సోదరులు నాయకత్వం వహించారు.

ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ ప్రచురించిన సంతాల్ తిరుగుబాటు సమయంలో జరిగిన యుద్ధపు దృశ్యం

నేపథ్యం

మార్చు

ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రెసిడెన్సీ లోని గిరిజన ప్రాంతంలో అవలంబిస్తున్న రెవెన్యూ వ్యవస్థను, వడ్డీ పద్ధతులు, జమీందారీ వ్యవస్థనూ అంతం చేయడానికి ప్రతిచర్యగా సంతాల్ తిరుగుబాటు మొదలైంది. ఇది లోపభూయిష్టమైన రెవెన్యూ వ్యవస్థ ప్రచారం చేసిన వలస పాలన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు. స్థానిక జమీందార్లు, పోలీసులు, ఈస్టిండియా కంపెనీ వారి న్యాయ వ్యవస్థ నెలకొల్పిన న్యాయస్థానాలు ఈ వ్యవస్థను అమలు చేస్తుండేవి. [1]

సంతాల్‌లు అటవీ వనరులపై ఆధారపడి జీవించేవారు. 1832 లో కంపెనీ ప్రస్తుత జార్ఖండ్‌లోని డామిన్-ఇ-కోహ్ ప్రాంతాన్ని గుర్తించి, ఈ ప్రాంతంలో స్థిరపడటానికి సంతాల్‌లను ఆహ్వానించింది. భూమి ఇస్తామని, ఆర్థిక సౌకర్యాలు కల్పిస్తామనీ కంపెనీ చేసిన వాగ్దానాల కారణంగా కటక్, దల్భుమ్, మంభుమ్, హజారీబాగ్, మిడ్నాపూర్ మొదలైన చోట్ల నుండి పెద్ద సంఖ్యలో సంతాల్‌లు స్థిరపడటానికి వచ్చారు. త్వరలోనే కంపెనీ తరపున పన్ను వసూలు చేసే మధ్యవర్తులుగా మహాజన్‌లు, జమీందార్లు వచ్చారు, ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించారు. చాలా మంది సంతాలులు అవినీతిమయ రుణ విధానాల బారిన పడి వాటికి బలయ్యారు. అన్యాయమైన వడ్డీ రేట్లకు అప్పులు తిసుకోవాల్సి వచ్చింది. అప్పులు తీర్చలేనప్పుడు, వారి భూములను బలవంతంగా లాక్కొని, వారిని కట్టు బానిసలుగా మార్చారు. ఇది తిరుగుబాటు సమయంలో సంతాలులకు నాయకత్వం వహించిన ఇద్దరు సోదరులు సిద్ధు, కన్హు ముర్ములు సంతాల్ తిరుగుబాటు లేవదీసేందుకు దారితీసింది. [2]

తిరుగుబాటు

మార్చు

1855 జూన్ 30 న, సిద్ధు ముర్ము, కన్హు ముర్ము అనే ఇద్దరు సంతాల్ తిరుగుబాటు నాయకులు దాదాపు 60,000 సంతాలులను సమీకరించి, ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు. తిరుగుబాటు సమయంలో సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధు ముర్ము సుమారు పదివేల మంది సంతాలులను కూడగట్టాడు. తన స్వంత చట్టాలను రూపొందించి, వాటిని అమలు చేసి తద్వారా పన్నులు వసూలు చేయడం అతని ప్రాథమిక ఉద్దేశ్యం. 

తిరుగుబాటు ప్రకటన వెలువడిన వెంటనే, సంతాలులు ఆయుధాలను చేపట్టారు. అనేక గ్రామాల్లో, జమీందార్లు, డబ్బు ఇచ్చేవారు, వారి అనుచరులను ఉరితీసారు. ఈ బహిరంగ తిరుగుబాటు కంపెనీని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట్లో, తిరుగుబాటుదారులను అణచివేయడానికి ఒక చిన్న బృందాన్ని పంపారు. కానీ అది విఫలమైంది. అది తిరుగుబాటు స్ఫూర్తిని మరింత పెంచింది. శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పడంతో, కంపెనీ చివరకు ఒక పెద్ద చర్య తలపెట్తింది. తిరుగుబాటును అణిచివేసేందుకు స్థానిక జమీందార్లు, ముర్షిదాబాద్ నవాబుల సహాయంతో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని పంపింది. సిద్ధును, అతని సోదరుడు కన్హునూ అప్పగించినవారికి రూ 10,000 బహుమతిని కంపెనీ ప్రకటించింది.

దీని తర్వాత అనేక ఘర్షణలు జరిగాయి. వీటిలో సంతాల్ దళాలకు పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం వాడిన గన్‌పౌడర్ ఆయుధాలను ఎదుర్కొనేందుకు సంతాలుల ఆదిమ ఆయుధాలు సరిపోవని ఋజువైంది. 7 వ స్థానిక పదాతిదళ రెజిమెంట్, 40 వ స్థానిక పదాతిదళం తదితరులను రంగం లోకి దించారు. 1855 జూలై నుండి 1856 జనవరి వరకు, కహల్‌గావ్, సూరి, రఘునాథ్‌పూర్, ముంకతోరా వంటి ప్రదేశాలలో ప్రధాన ఘర్షణలు జరిగాయి. [3]

ఈ పోరాటాల్లో సిద్ధూ, కన్హూలు మరణించడంతో తిరుగుబాటు చివరికి అణచివేయబడింది. తిరుగుబాటు సమయంలో, ముర్షిదాబాద్ నవాబు సరఫరా చేసిన యుద్ధ ఏనుగులతో సంతాల్ గుడిసెలను పడతొక్కించారు. తిరుగుబాటు సమయంలో సమీకరించిన సుమారు 60,000 మంది గిరిజనులలో (వీరిలో చాలామంది పాలు అమ్ముకునేవారు, కమ్మరివారు), 15,000 మంది మరణించారు. పదుల గ్రామాలు నాశనమయ్యాయి. [4]

బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ జెర్విస్ ఈ తిరుగుబాటుని అణచివేసిన విధానంపై ఇలా వ్యాఖ్యానించాడు:

అది యుద్ధం కాదు; పర్యవసానాలను వారు అర్థం చేసుకోలేదు. వారి జాతీయ దుందుభులు మోగీ మోగగానే, వాళ్ళంత లేచి నిలబడతారు, తమపై జరిగే కాల్పులకు తమ దేహాలను అప్పగిస్తారు. వాళ్ల బాణాలు మా మనుషులను చంపుతాయి కాబట్టి, వారు నిలబడి ఉన్నంత వరకు మేము వారిపై కాల్పులు జరపాల్సే ఉంటుంది. వారి దుందుభులు మోగడం ఆగగానే, వారు పావు మైలు వెనక్కి వెళ్తారు; అప్పుడు వారి దుందుభులు మళ్లీ మోగుతాయి, మళ్ళీ వారు ప్రశాంతంగా నిలబడతారు, మళ్ళీ మేము వాళ్ళపై గుళ్ళవర్షం కురిపిస్తాం. ఈ యుద్ధంలో మేం చేసిన పని పట్ల సిగ్గుతో తలవంచుకోని సిపాయే లేడు." [5]

వారసత్వం

మార్చు

ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్, హౌస్‌హోల్డ్ వర్డ్స్‌లో, తిరుగుబాటుపై కింది విధంగా రాసాడు:

వారిలో ఆత్మగౌరవ భావన కూడా ఉన్నట్లు అనిపిస్తుంది; ఎందుకంటే, వారు వేటలో విషపూరిత బాణాలను ఉపయోగిస్తారని చెబుతారు, కానీ వారి శత్రువులపై ఎప్పుడూ వాటిని వెయ్యలేదు. ఇదే జరిగి ఉంటే, అలాగే ఇటీవలి సంఘర్షణలలో కూడా విషపూరిత బాణాల గురించి ఎక్కడా వినబడకపోతే.., వారు మన నాగరిక శత్రువైన రష్యన్ల కంటే ఎంతో ఎక్కువ గౌరవనీయమైన వారు. రష్యన్లు అలాంటి సహనాన్ని మూర్ఖంగా భావించి, అది యుద్ధమే కాదని ప్రకటించేవారు. " [6]

మృణాల్ సేన్ చిత్రం మృగయా (1976) కథ, సంతాల్ తిరుగుబాటు కాలానికి చెందినది.

మూలాలు

మార్చు
  1. India's Struggle for Independence - Bipan Chandra, Pg41
  2. Jha, Amar Nath (2009). "Locating the Ancient History of Santal Parganas". Proceedings of the Indian History Congress. 70: 185–196. ISSN 2249-1937. JSTOR 44147668.
  3. India's Struggle for Independence - Bipan Chandra, Pg42-43
  4. India's Struggle for Independence - Bipan Chandra, Pg42-43
  5. L.S.S O Malley, Bengal District Gazetteers Santal Parganas.
  6. Dickens, Charles (1850–1859). Household Words Vol 12. University of Buckingham. London : Bradbury & Evans. p. 349.