వికీపీడియాలో చేసే కృషి ఎంతో సాముదాయికమైనది. తోటి వాడుకరులతో ఎలా కలిసిమెలిసి పనిచెయ్యాలో తెలుసుకునేందుకు రెండు మంచి తొలిమెట్లు ఉన్నాయి: వెనకాడకుండా ఉండడం, మర్యాదగా ఉండడం.
దిద్దుబాట్లు చేసేటప్పుడు, వెనకాడకండి! చాలా సవరణలు ఎన్సైక్లోపీడియాను మెరుగుపరుస్తాయి. తప్పులేమైనా దొర్లితే ఎప్పుడైనా సవరించుకోవచ్చు. మెరుగుపరచవలసినది ఏదైనా మీ దృష్టికి వస్తే వదలకండి, దాన్ని మెరుగుపరచండి. ఏదైనా చెడిపోద్దేమోనని భయపడకండి. మీరు చేసే మార్పు మెరుగుదలకు దోహదపడేదే అయితే, ఆ సంగతి ఇతరులకు అర్ధమైతే, అంతా మంచే జరుగుతుంది. మీ మార్పు నిలబడిపోతుంది. అలా కాని సందర్భంలో, ఆ మార్పును ఎవరైనా ఇట్టే తిరగగొట్టవచ్చు.
మర్యాదగా ఉండడమంటే, ఇతరులను గౌరవించడం, వారు సదుద్దేశం తోనే ఉన్నారని భావించడం, వ్యక్తిగత విషయాలపై కాకుండా, దిద్దుబాట్ల పైనే దృష్టి పెట్టడం. పరస్పర గౌరవంతో, ఆదరంతో పాల్గొనడం ముఖ్యం. అవతలివారి అభిప్రాయాలు, నిర్ణయాలను గమనంలో ఉంచుకుని వ్యవహరించాలి. సదుద్దేశంతో వ్యవహరించడం అంటే, అవతలి వారు ప్రాజెక్టును మెరుగుపరచే ఉద్దేశంతోనే ఉన్నారని డిఫాల్టుగా భావించడం. విమర్శ గానీ, సమీక్ష గానీ చెయ్యాలంటే, వాడుకరి చేసిన పనుల గురించి మాట్లాడాలి గానీ, నిరాధారంగా వారికి దురుద్దేశాలను ఆపాదించకూడదు.
దిద్దుబాట్లు చేసే క్రమంలో వాడుకరులు ఏకాభిప్రాయానికి చేరుకుంటారు; ఓ పేజీలో ఎవరైనా మార్పు చేసినపుడు, దాన్ని ఇతరులు చదివి, బాగుందనుకున్నవారు అలాగే వదిలేస్తారు. సరిచెయ్యాలని అనుకున్నవారు దాన్ని మారుస్తారు. మీరు చేసిన మార్పును వెనక్కి తిప్పితే కష్టంగానే ఉంటుంది. కానీ, దాన్ని చిన్నతనంగా భావించకండి. ఎందుకంటే, వికీపీడియాలో ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో అది మామూలే. మీకు అసమ్మతి గానీ, సూచన గానీ ఉంటే, దాన్ని ఆ వ్యాసపు చర్చ పేజీలో రాసి, ఏకాభిప్రాయం వచ్చేవరకూ మర్యాద పూర్వకంగా చర్చించండి. ఇతర వాడుకరులు చేసిన దిద్దుబాట్లను పదేపదే వెనక్కి తిప్పకండి. దీన్ని దిద్దుబాటు యుద్ధం అంటారు. వికీపీడియాలో దీనికి అనుమతి లేదు. చివరి మార్గంగా, వివాద పరిష్కారం కోసం తోటి వాడుకరులను కోరవచ్చు.