సింగరాజు నాగభూషణరావు

ప్రముఖ రంగస్థల నటుడు

సింగరాజు నాగభూషణరావు 1896, నవంబరు 3వ తేదీన బాపట్లలో సింగరాజు మల్లికార్జునుడు, భ్రమరాంబ దంపతులకు జన్మించాడు. ఇతడు బి.ఎ. పట్టాపుచ్చుకున్నాడు. తరువాత ఎల్.టి. పరీక్ష ప్యాసై గుంటూరు జిల్లా బోర్డులో సహాయోపాధ్యాయునిగాను, ప్రధానోపాధ్యాయునిగాను పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరుగడించాడు. ఇతనికి చిన్నతనం నుండి నాటకాలంటే అభిమానం. ఇతని తండ్రి వేణీసంహారము, గయోపాఖ్యానము, పీష్వా నారాయణరావు వధ మొదలైన నాటకాలలో నటించేవాడు. తన తండ్రిలో ఉన్న నాటకాభిమానమే ఇతనికీ అబ్బింది. ఇతడు స్కూలు ఫైనలులో ఉన్నప్పుడు స్కూలు వార్షికోత్సవాలలో మొదటి సారి గయోపాఖ్యానం నాటకంలో నటించాడు. ఇతడు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆస్వాల్డ్ కూల్డ్రే ఇతనిలోని కళాతృష్ణను గుర్తించి ఇతడిని ప్రోత్సాహించాడు[1].

నాటకరంగంసవరించు

ఇతడు ఇంగ్లీషు తెలుగు నాటకాలలో అనేక పాత్రలను ధరించాడు. చారిత్రకము, సాంఘికము, పౌరాణికము అన్ని రకాలైన నాటకాలలో తన నటనానైపుణ్యాన్ని ప్రదర్శించాడు. షేక్స్‌పియర్ నాటకాలు ఒథెల్లో, జూలియస్ సీజర్ మొదలైనవాటిలో ప్రధాన పాత్రలను పోషించాడు. "రసపుత్ర విజయం"లో దుర్గాదాసు, "ప్రసన్న యాదవము"లో నరకాసురుడు, "హరిశ్చంద్ర"లో విశ్వామిత్రుడు, "కృష్ణరాయబారం"లో భీముడు, కర్ణుడు, "ప్రతాప రుద్రీయం"లో యుగంధరుడు, పిచ్చివాడు, "పూర్ణిమ"లో సోమనాథదేవుడు, "తళ్లికోట యుద్ధం"లో పఠాను, "కంఠాభరణం"లో రామశాస్త్రి, "సోహ్రబు రుస్తుం"లో రుస్తుం, "బొబ్బిలి యుద్ధం"లో పాపారాయుడు, "వాల్మీకి"లో వాల్మీకి, "ఉద్యోగవిజయాలు"లో భీముడు, భీష్ముడు, "పద్మవ్యూహం"లో కర్ణుడు, "సునందినీ పరిణయం"లో సుమతి, "చాణక్య"లో వసంతకుడు, "ప్రహ్లాద"లో హిరణ్యకశిపుడు, "విప్లవము"లో వార్డెను, "అపరాధి"లో అపరాధి రామయ్య, "కమల"లో భద్రయ్య, "తెరలో తెర"లో సుందరరామయ్య, "వెంకన్న కాపురం"లో వెంకన్న, "చిన్నయ్య చెరువు"లో కాంతయ్య, "సింహగఢ"లో తానాజీ వంటి అనేక పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలను పొందాడు. ఇతడు నాటక ప్రదర్శనలలోనే కాక ప్రహ్లాద మొదలైన హరికథాగానంలోను, బుద్ధుడు మొదలైన బుర్రకథలు చెప్పడంలోను, ప్రతాపరుద్రుడు, బల్లహుడు వంటి ఏకపాత్రాభినయంలోను ప్రదర్శనలు ఇచ్చాడు. రేడియో నాటకాలలో కూడా పాల్గొన్నాడు[1].

సినిమారంగంసవరించు

ఇతడు నరనారాయణ, వీరాభిమన్యు తదితర సినిమాలలో నటించాడు[1].

పురస్కారాలుసవరించు

ఇతడి సేవలను గుర్తించి అనేక సంస్థలు ఇతడిని సత్కరించాయి. ఎన్నో నాటక పోటీలలో ఇతడు ఉత్తమ నటుడిగా బహుమతులు గైకొన్నాడు. గుంటూరు ఆంధ్ర సంసత్ వారు హరిప్రసాదరాయ్ వర్ధంతి సందర్భంగా ఇతడిని "అభినవ ప్రసాదరాయ" బిరుదుతో సత్కరించారు. బాపట్ల స్త్రీ హితైషి మండలి వారు ఇతడికి "కళాతపస్వి" బిరుదును ప్రదానం చేశారు[1].

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 కనుపర్తి వరలక్ష్మమ్మ (10 November 1957). "ప్రేక్షకుల ఆదరాభిమానాలను అపారంగా చూరగొన్న సాటిలేని మేటినటుడు శ్రీ సింగరాజు నాగభూషణరావు". ఆంధ్ర సచిత్రవారపత్రిక. 13 (52): 28–31. Retrieved 16 November 2018.[permanent dead link]