సి.హెచ్.రాజారెడ్డి

(సిహెచ్.రాజారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

చిలంకూరి రాజారెడ్డి ప్రముఖ హేతువాది, సంపాదకుడు.

ఎం.ఎన్.రాయ్ ప్రభావం

మార్చు

రాజారెడ్డి 1922 సెప్టెంబర్ మాసంలో వెంకటసుబ్బారెడ్డి, వనజాక్షి దంపతులకు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో జన్మించాడు. మధ్యతరగతి కుటుంబీకుడైన రాజారెడ్డి, కేవలం ఉన్నత పాఠశాల వరకే చదవగలిగాడు. జీవిత ప్రారంభంలో చలం, తాపీ ధర్మారావు రచనలు రాజారెడ్డిపై చెరగని ముద్రవేశాయి. చీరాలలోని పి.వి.సుబ్బారావు ఫొటో స్టుడియోలో త్రిపురనేని రామస్వామి వ్రాసిన పాటలను రావిపూడి వెంకటాద్రి పాడగా విని అందులోని భావాలకు రాజారెడ్డి ఆకర్షితుడయ్యాడు. వెంకటాద్రిని స్టుడియోలో కలిసినప్పుడు జవహర్ లాల్ నెహ్రూపై ఎం.ఎన్.రాయ్ వ్రాసిన పుస్తకం అతన్ని ఆకర్షించింది. అరువు తీసుకుని ఆసక్తిగా చదివాడు. జవహర్‌లాల్ వీరాభిమాని అయిన రెడ్డిని ఆ చిన్న, శక్తివంతమైన పుస్తకం మార్చివేసింది. ఆ తరువాత రాజారెడ్డి తనకు అందుబాటులో ఉన్న రాయ్ పుస్తకాలన్నీ చదివి తన అభిప్రాయాలు మార్చుకొన్నాడు. రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్యవాదిగా మారటానికి ఇది దోహదపడింది.

మానవవాద అధ్యయన తరగతులు

మార్చు

భారతదేశంలో పై స్థాయిలో జరిగే అధ్యయన తరగతులలో రెడ్డి పాల్గొనేవాడు. తద్వారా హేమాహేమీలైన ఆవుల గోపాల కృష్ణమూర్తి, ఎం.వి.రామమూర్తి, సుబ్బమ్మ, ఎన్.వి.బ్రహ్మం, కోగంటి సుబ్రమణ్యం, కొల్లి శివరామిరెడ్డి వగైరా ప్రభృతులకు దగ్గరయ్యాడు. ఆచార్య ఏ.బి.షా అభ్యుదయ మానవవాదం గురించి బోధించిన అవనిగడ్డ అధ్యయన తరగతులకు రాజారెడ్డి హాజరయ్యాడు. అభ్యుదయ, మానవవాద అధ్యయన తరగతులలో పాల్గొనేందుకై భారతదేశమంతటా విస్తృతంగా పర్యటించాడు. గోరంట్ల రాఘవయ్య, కొల్లా సుబ్బారావు, కోగంటి రాధాకృష్ణమూర్తి, కొల్లి శివరామిరెడ్డి, ఎం.వి.రమణయ్య ప్రభ్రుతులు రాజారెడ్డి మిత్రులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నివసించే హేతువాది సిద్ధార్థ్ బక్ష్ (లోక్ సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి, సిద్ధార్థ స్కూల్ స్థాపకుడు) రాజారెడ్డి అనుచరుడు.

చీరాలలో లిబర్టీ ముద్రణశాల ప్రారంభించాడు. దరిమిలా ఇదే అభ్యుదయ కేంద్రమైంది. పనివేళల తర్వాత అభ్యుదయవాదులు ప్రింటింగ్ ప్రెస్లో సమావేశమై చర్చలు జరిపేవారు. అఖిల భారత అభ్యుదయ మానవవాద నాయకులు చీరాల వచ్చినప్పుడు అక్కడి అభ్యుదయవాదులతో రెడ్డి సమావేశాలు నిర్వహించేవాడు. చీరాల వద్ద కల సంతరావూరులో నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి ప్రతి సంవత్సరం వేసవి అధ్యయన తరగతులు జరిపేవాడు. ఈ తరగతులకు హాజరయిన వారిలో తోటకూర రామమూర్తి ఇంకా తోటకూర వెంకటేశ్వర్లు ఉన్నారు. కొన్నాళ్ళ తర్వాత, రాజారెడ్డి ప్రోత్సాహంతో, తోటకూర వెంకటేశ్వర్లు (బాబుగా సుపరిచితం) విజయవాడ నుంచి చార్వాక మాసపత్రిక ప్రారంభించాడు. ఇంకొల్లు, అద్దంకి, ఓడరేవు ఇంకా ఒంగోలులో కూడా రాజారెడ్డి అధ్యయన తరగతులు నిర్వహించాడు.

సంపాదకుడు -అనువాదకుడు

మార్చు

రాజారెడ్డి తన సంపాదకత్వంలో సమీక్ష అనే మాస పత్రిక వెలువరించాడు. కొంతకాలం నూతన అభ్యుదయ మానవవాది పత్రికకు సంపాదకత్వ బాధ్యత వహించాడు. ఎం.ఎన్.రాయ్ పుస్తకాలు Humanism and Religion, Practice of Radical Humanism లను రెడ్డి తెలుగులోకి అనువదించాడు.

రాజారెడ్డి - ఎన్నికలు

మార్చు

రెడ్డికి కాంగ్రెస్ పై అభిమానం ఎక్కువ. మద్రాసు రాష్ట్రపు 1946 అసెంబ్లీ ఎన్నికలలో, ఎం.ఎన్.రాయ్ స్థాపించిన అభ్యుదయ ప్రజాసామ్య పార్టీ తరఫున బాపట్ల నియోజక వర్గం నుంచి రావిపూడి వెంకటాద్రి పోటీ చేసాడు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను వెంకటాద్రి విమర్శిస్తే, రాజారెడ్డి కోపంతో వెంకటాద్రి ప్రచార కరపత్రాలను చించివేశాడు. పార్టీ రహిత అభ్యర్థిగా 1978 లో ఎం.వి.రామమూర్తి బాపట్ల నియోజక వర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసినప్పుడు, రాజారెడ్డి ఎన్నికల ఏజెంట్గా ఉంటూ ప్రచార బాధ్యతలు నిర్వహించాడు.

వివాహం - కుటుంబం

మార్చు

రాజారెడ్డికి శేషమ్మతో 1940లో వివాహం జరిగింది. ముగ్గురు పుత్రులు కలిగారు. సెక్యులర్ పద్ధతిలో వీరి వివాహాలు జరిగాయి. చీరాలలో, ఆవుల గోపాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, పెద్ద కొడుకు రాజ భాస్కర్ వివాహం, చిలకలూరిపేట అభ్యుదయవాది అన్నం గోవర్ధనరావు కూతురుతో జరిగింది. రెండవ కొడుకు రాము భారతీయ రైల్వేస్లో పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నాడు. రాజ మోహన్ (మూడవ కొడుకు) హిందూ దినపత్రికలో పనిచేసిన తర్వాత ఒక వార్తా సంస్థ కోసం సింగపూర్లో పనిచేసాడు. రాజ మోహన్ ప్రస్తుతం కొత్త ఢిల్లీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయంలో కీలక అంశాల సంపాదకుడిగా ఉన్నాడు. రాజారెడ్డి భార్య శేషమ్మ క్రియాశీలక కార్యక్రమాలలో పాల్గొనపోయినప్పటికీ, రాజారెడ్డి మానవవాద కార్యక్రమాలకు తన సహకారాన్ని అందించింది. ప్రస్తుత నివాసం కర్నూలు.

అభ్యుదయ పధంలో

మార్చు

లౌకిక విధానంలో రాజారెడ్డి కొన్ని వివాహాలు జరిపించాడు. 1965లో, ప్రముఖ హేతువాది ఎన్.ఇన్నయ్య వివాహానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. హేతువాది అంచా బాపారావుకు చీరాలలో విద్యాలయం స్థాపించటానికి సహాయం చేశాడు. బచ్చు వెంకటేశ్వర్లు (ప్రమాదంలో మరణించాడు) తో కలిసి చీరాలలో పునర్వికాస కేంద్రాన్ని నిర్వహించాడు. ఎం.వి.రామమూర్తి సహకారంతో మానవవాద నాటకాలను వేయించేవాడు. యువకులలో హేతువాద దృక్పధాన్ని పెంచటానికై రాజారెడ్డి కృషి చేశాడు. కుటుంబ నియంత్రణను రెడ్డి ప్రోత్సాహించాడు. స్కూళ్లను శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి పరచటానికి యువతకు చేయూతనిచ్చాడు. రెడ్డి, చీరాలలో మానవవాద కేంద్రాన్ని ప్రారంభించాలని చేసిన కృషి ఫలించలేదు. ఆత్మీయులతో సరస సంభాషణలు జరపటానికి ఇష్టపడే మానవవాది, సహృదయుడు రాజారెడ్డి చీరాలలో, 1992లో మరణించాడు.