సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు

సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు ప్రముఖ రంగస్థల, సినిమా నటులు.

సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు
సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు
జననంఉంగుటూరు, కృష్ణా జిల్లా
మరణం1972
ప్రసిద్ధిరంగస్థల, సినిమా నటులు

వీరు కృష్ణా జిల్లా లోని ఉంగుటూరు లో జన్మించారు.

జీవిత విశేషాలు

మార్చు

చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా సుంకర వాసిరెడ్డి రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.

కృష్ణా జిల్లా ప్రజా నాట్యమండలి లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు "మా భూమి" నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.

తర్వాత మద్రాసు చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు బడుగు రైతు, రైతు కూలీ, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడుతున్న సగటు మనిషి తరహా పాత్రలు ధరించడానికి పెట్టింది పేరు. వీరు ధరించిన పాత్రలలో రోజులు మారాయి (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, వరకట్నం (1968) లో కథానాయకురాలి తండ్రి పాత్ర, ప్రజానాయకుడు (1972) చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.

వీరు 1972 సంవత్సరంలో పరమపదించారు.

చిత్ర సమాహారం

మార్చు
  1. పుట్టిల్లు (1953)
  2. అంతా మనవాళ్ళే (1954)
  3. పరివర్తన (1954)
  4. రోజులు మారాయి (1955) - కోటయ్య
  5. ముద్దుబిడ్డ (1956)
  6. ఎం.ఎల్.ఏ. (1957)
  7. ఈడు జోడు (1964)
  8. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
  9. వరకట్నం (1968)
  10. ప్రేమ్ నగర్ (1971) - కళ్యాణ్ సేవకుడు మల్లు
  11. ప్రజా నాయకుడు (1972) - కోటీసు
  12. చిట్టి తల్లి (1972)
  13. అత్తలూ కోడళ్లూ

మూలాలు

మార్చు
  • లక్ష్మీపెరుమాళ్లు, సూరపనేని, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 614.