పరివర్తన (1954 సినిమా)

1954 సినిమా

జనతా ప్రొడక్షన్స్ వారి పరివర్తన చిత్రం సెప్టెంబరు 1, 1954లో విడుదలయ్యింది.

పరివర్తన
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
నిర్మాణం సి.డి. వీరసింహ
రచన పినిశెట్టి శ్రీరామమూర్తి
అక్కా చెల్లెలు నవల ఆధారంగా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
నందమూరి తారక రామారావు,
సావిత్రి,
దొరస్వామి,
రమణారెడ్డి,
చదలవాడ,
మిక్కిలినేని,
సురభి బాలసరస్వతి,
అల్లు రామలింగయ్య,
సూరపనేని పెరుమాళ్ళు,
రామకోటి
సంగీతం తాతినేని చలపతిరావు,
సి. మోహనదాస్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఆర్. బాలసరస్వతిదేవి,
మాధవపెద్ది,
పి.లీల, జిక్కి
నిర్మాణ సంస్థ జనత ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

ఆనందరావు (ఎన్.టి.రామారావు) చంద్రశేఖరం గారి దత్తపుత్రుడు. లక్షాధికారియైన చంద్రశేఖరం గారు చనిపోతూ పసివాడైన ఆనందరావును తన దివాన్ రామయ్య (దొరస్వామి)కు అప్పగించి, ఆస్తిని జాగ్రత్తగా కాపాడే బాధ్యత కూడా అప్పగిస్తాడు. రామయ్య స్వతహాగా మంచివాడవడం చేత, దానధర్మాలు చేస్తూ, విరాళాలిస్తూ, పనివారికి ఏటా బోనసులిస్తూ మంచివాడనిపిచుకోవడమే కాక రెండు లక్షల ఆస్తిని ఎనిమిది లక్షలు చేస్తాడు. ఆనందరావు పెరిగి పెద్దవాడై ఇంటికి తిరిగి వస్తాడు. రామయ్య అతని ఆస్తిని అతనికి అప్పగిస్తాడు. ఆనందరావు స్వతహాగా తొందరపాటు కలవాడు. అందులో ఒక్కసారిగా ఆస్తి చేజిక్కడంతో అధికార గర్వం ఎక్కువౌతుంది. మొదట్లో రామయ్యపై అతనికి సదభిప్రాయం ఉన్నప్పటికీ, ప్రతివాళ్ళూ రామయ్య మంచి తనాన్నే నిరంతరమూ కీర్తిస్తూ ఉండడం సహించలేకపోతాడు. అతనికి చలపతి (రమణారెడ్డి), పిచ్చయ్య (కుటుంబరావు) సలహాదార్లుగా చేరి రామయ్య మీద లేనిపోనివన్నీ చెబుతుంటారు. దీనికి తోడు రామయ్య ఏటా మామూలుగా పనివారికి ఇస్తున్న బోనసులు ఆనందరావుతో చెప్పకుండా ఇస్తాడు. ఆనందరావు ఇక మీద ఇవేవీ సాగవని చెప్పి రామయ్యను అవమానిస్తాడు. రామయ్య దివాన్గిరీకి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాడు.

రామయ్యకు సత్యం (నాగేశ్వరరావు), శివం (జూనియర్ నాగేశ్వరరావు) అనే ఇద్దరు కొడుకులు, సుందరమ్మ (సావిత్రి) అనే కూతురు ఉన్నారు. సత్యం ఇంటర్ ఫస్టుక్లాసులో ప్యాసై పై చదువుకి వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు. తండ్రికి ఉద్యోగం పోయినందున డబ్బులేదు. రామయ్య తానిదివరకు సహాయం చేసిన షావుకార్ల దగ్గరకి వెళ్లి అప్పు అడుగుతాడు. కానీ వారెవ్వరూ సహాయం చేయరు. చివరకు చేసేది లేక సత్యం తన చదువుకు ఇదివరలో ఆనందరావు సహాయం చేస్తానన్నాడు కనుక అతని వద్దకు వెళ్లి అర్థిస్తాడు. ఆనందరావు అవమానించి పంపిస్తాడు. ఈ కష్టాలు భరించలేక రామయ్య మరణిస్తాడు. చెల్లీ తమ్ముల పోషణార్థమై సత్యం బస్సు కండక్టరుగా పనిచేస్తుంటాడు. అతనిమీద కక్షగట్టిన ఆనందరావు ఆ బస్సురూట్ కొనివేసి సత్యాన్ని డిస్మిస్ చేస్తాడు.

ఆ తరువాత ఆనందరావు దగ్గర చేరిన దుష్టగ్రహాల్లో ఒకడైన చలపతి సుందరమ్మతో వెకిలి చేష్టలు చేస్తాడు. దీన్ని సహించలేక సత్యం చలపతిని బజార్లో పట్టుకుని తంతాడు. ఆనందరావు పోలీసులకు రిపోర్టు చేసి సత్యాన్ని జైల్లో పెట్టిస్తాడు. ఆ తరువాత సుందరమ్మను, శివంను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. వీధులు పట్టిన సుందరమ్మ, శివం చెరొకదారీ అయిపోతారు. సుందరమ్మను అన్నదాన సమాజం నడిపే సంజీవయ్య (మిక్కిలినేని) చేరదీసి ఆదరిస్తాడు. అక్కను కనుక్కోలేకపోయిన శివాన్ని బజార్లో బొమ్మలు అమ్ముకుంటూ తిరిగే తాత (రామకోటి) చేరదీస్తాడు.

ఈ లోగా, ఆనందరావు ఆస్తిపై కన్నువేసిన సాంబయ్య (కోడూరి) అనే వారసుడు చలపతినీ, పిచ్చయ్యను వశపరచుకుని, వారికి డబ్బిస్తానని ఆశచూపి, వారి సహాయంతో చంద్రశేఖరం గారు ఆనందరావును పెంచుకున్నప్పుడు వ్రాసిన దత్తత డాక్యుమెంటును అపహరించి కోర్టులో ఆనందరావు ఆస్తికి వారసుడు కాదనీ, తానే వారసుణ్ణనీ కేసుపెట్టి గెలుస్తాడు. ఆనందరావు బికారిగా మారి, రౌడీల చేత తన్నులు తిని, జ్వరంతో బాధపడుతూ అన్నదాన సమాజానికి చేరుకుంటాడు. సమాజం నడిపే సంజీవయ్య తనకిదివరలో విరాళమిమ్మని అడిగినప్పుడు ఆనందరావు నిరాకరించినప్పటికీ అతన్ని ఆదరిస్తాడు. అక్కడే ఉన్న సుందరమ్మ ఆనందరావుకు పరిచర్యలు చేస్తుంది.

ఈలోగా సత్యం జైలునుండి విడుదలై సమాజంలో తన చెల్లెలుందని విని అక్కడికి వస్తాడు. మొదట తమ విరోధి అయిన ఆనందరావుకు చెల్లెలు పరిచర్య చేయడం చూసి ఆగ్రహించినప్పటికీ, అతనికి పశ్చాత్తాపం కలిగిందని గ్రహించి, క్షమిస్తాడు. తరువాత పోయిన డాక్యుమెంటును సంపాదించడానికి ఆనందరావూ, సత్యం ఆ రాత్రి పిచ్చయ్య ఇంటికి రహస్యంగా వస్తారు. అక్కడ తన తరఫున కొంతమంది రౌడీలతో సాంబయ్య, మరికొంత మంది రౌడీలతో చలపతి, పిచ్చయ్యా ఉంటారు. వారిదగ్గర నుండి డాక్యుమెంటు తస్కరించి ఆనందరావూ, సత్యం పారిపోతూవుండగా రౌడీలు వెంటబది పట్టుకుంటారు. గలభా జరుగుతుండగా పోలీసులు వచ్చి సాంబయ్య, చలపతి, పిచ్చయ్య, ఇతర రౌడీలను అరెస్టు చేస్తారు. డాక్యుమెంటు ఆనందరావుకే దక్కుతుంది. పోయిన ఆస్తి తిరిగి వస్తుంది. దాన్ని అనుభవించే అర్హత తనకు లేదని ఆస్తిని తనకు ఆశ్రయమిచ్చిన అన్నదాన సమాజానికి రాసిస్తాడు. చనిపోయిన చంద్రశేఖరం, రామయ్యల పరస్పర వాగ్దానాలను చెల్లించడానికి సుందరమ్మను ఆనందరావు వివాహం చేసుకుంటాడు. కథ సుఖాంతమవుతుంది.

పాటలు

మార్చు

01. అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు - ఆర్. బాలసరస్వతిదేవి

02. అమ్మా అమ్మా అవనీమాతా అనంతచరితా అమృతమూర్తి - మాధవపెద్ది,పి.లీల బృందం

03. ఆవేదనే బ్రతుకును ఆవరించేనా.. వెలుగు నీడల బాటరా ఇది - ఘంటసాల కోరస్ - రచన: అనిసెట్టి

04. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన - ( బృందం వివరాలు లేవు)

05. ఇంత చల్లని వేళ వింత తలపులివేలా ఝల్లని తనువే పులకరించే - జిక్కి

06. కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ఆకలి - ఘంటసాల బృందం - రచన: అనిసెట్టి

07. నందారే లోకమెంతో చిత్రమురా భళి నందారే చిత్రమురా - మాధవపెద్ది బృందం

08. రాజు వెడలె చూడరే సభకు ( వీధి భాగవతం ) - ఘంటసాల, మాధవపెద్ది,స్వర్ణలత - రచన: అనిసెట్టి

09. రండోయి రండి పిల్లలు చూడండోయి తమ్ములు రంగు రంగుల బొమ్మలు - పిఠాపురం

మూలాలు

మార్చు