స్టీఫెన్ హాకింగ్

ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, రచయిత

స్టీఫెన్ విలియం హాకింగ్ (1942 జనవరి 8 - 2018 మార్చి 14) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్టు (విశ్వనిర్మాణ శాస్త్రవేత్త). మరణించే సమయానికి ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీకి రీసెర్చ్ సంస్థకి డైరెక్టరుగా ఉన్నాడు.[1] ఈయనకు 21 ఏళ్ళ వయసులో మొదలైన ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు క్రమక్రమంగా విస్తరిస్తూ పోయింది. తర్వాత కొన్ని దశాబ్దాల్లో అతని అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడిపోయాయి.[2] మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితి లోనే కృష్ణబిలాలకు (బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ, దానికి అమర్చిన సంభాషణలు-ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

స్టీఫెన్ హాకింగ్
స్టీఫెన్ హాకింగ్
జననం(1942-01-08)1942 జనవరి 8
ఆక్స్‌ఫర్డ్, ఇంగ్లాండు
మరణం2018 మార్చి 14(2018-03-14) (వయసు 76)
నివాసంఇంగ్లాండు
జాతీయతబ్రిటిష్
రంగములుఅనువర్తిత గణితశాస్త్రవేత్త,
సైద్ధాంతిక భౌతికశాస్త్రవేత్త
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
పెరిమీటర్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్
చదువుకున్న సంస్థలుఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)డెన్నిస్ సియమా
ఇతర విద్యా సలహాదారులురాబర్ట్ బెర్మాన్
డాక్టొరల్ విద్యార్థులుబ్రూస్ అలెన్
ఫే డాకర్
మాల్కమ్ పెర్రీ
బెర్నార్డ్ కార్
గ్యారీ గిబ్బన్స్
రేమండ్ లాఫ్లామ్
ప్రసిద్ధికృష్ణబిలాలపై పరిశోధన
భౌతికశాస్త్ర కాస్మాలజీ
క్వాంటమ్ గ్రావిటీ
ముఖ్యమైన పురస్కారాలుప్రిన్స్ ఆఫ్ ఆస్టురియాస్ అవార్డు (1989)
కాప్లే మెడల్ (2006)
సంతకం

హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు. బిబిసి వారి 100 మంది అత్యంత గొప్ప బ్రిటిషర్ల జాబితాలో 25వ స్థానంలో నిలిచాడు. ఆయన రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ (కాలం సంక్షిప్త కథ) అన్న పుస్తకం ద బ్రిటీష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది. ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాయి.

జీవిత ఘట్టాలు

మార్చు

1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడైనా, భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు.

కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. భోజనం చెయ్యాలన్నా, కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా, శరీరం సహకరించేది కాదు. క్రిస్‌మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. భౌతిక శాస్త్రవేత్త వెర్నర్‌ ఇస్రయిల్‌ ‘మోజట్‌ కంపోజింగ్‌ సింఫనీ’ తెచ్చి స్టీఫెన్‌ తలకు అమర్చాడు. దాని వల్ల ఆయనకు తనను తాను వ్యక్తీకరించుకునే అవకాశం కలిగింది. దాన్ని అభ్యసించడానికి ఆయనకు కొంత సమయం పట్టినా, తర్వాత కాలంలో అది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.

1970 నాటికి మాట పూర్తిగా పడిపోయింది. అతని హావభావాలు కుటుంబ సభ్యులకు, అతి సన్నిహితులకు మాత్రమే అర్థమయ్యేవి. 1985లో ఆయనకు నిమోనియా వచ్చింది , అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమై తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో మాత్రమే దానికి అనుసంధానించి, రూపొందించిన ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందిస్తున్నారు. హాకింగ్‌ చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో రూపొందించి తెరపై ప్రకటిస్తుంది.కంప్యూటర్‌ ఇంజనీర్‌ డేవిడ్‌, ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్‌ హాకింగ్‌ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్‌ విషయాన్ని మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. అందుకోసం తన గొంతునే వాడమన్నాడు స్టీఫెన్‌. మాట పడిపోక ముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నాడు. దాని వల్ల స్టీఫెన్‌ హాకింగ్‌ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు. 2018 మార్చి 14 న బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మరణించాడు. [3]

విశ్వవిద్యాలయం

మార్చు

స్టీఫెన్ తన 17 వ యేట,1959వ సంవత్సరం 10వ నెలలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరినాడు. తర్వాత కేంబ్రిడ్జ్‌లో పీహెచ్‌డీ చేశారు.

వైవాహిక జీవితం

మార్చు

స్టీఫెన్‌కు ఇద్దరు భార్యలు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్న రోజుల్లో జానే విల్డే అనే అమ్మాయితో స్టీఫెన్‌కు పరిచయం ఏర్పడింది. అప్పటికి స్టీఫెన్‌ వ్యాధి బయటపడలేదు. విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. అయితే వ్యాధి గురించి తెలిశాక కూడా జానే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకొన్నారు, 1965లో వీరిద్దరూ పెళ్ళి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అయితే 1995లో వీరు విడిపోయారు. ఆ తర్వాత అదే సంవత్సరం స్టీఫెన్‌, ఎలైన్‌ మాసన్‌ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. 1980లో స్టీఫెన్‌ అనారోగ్యంలో ఉన్న సమయంలో మాసన్‌ ఆయనకు నర్స్‌గా పనిచేసింది. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2006లో మాసన్‌ నుండి కూడా విడిపోయాడు.

పరిశోధనలు, ఆవిష్కరణలు, అభిప్రాయాలు

మార్చు

ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్‌కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. 1966లో ఆయన సమర్పించిన ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఎక్స్‌పాండింగ్‌ యూనివర్సెస్‌ థీసిస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దానిని చదివేందుకు ఆసక్తి చూపారు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు. క్వాంటం థియరి, జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. దీనికే హాకింగ్ రేడియేషన్ అనే పేరు వచ్చింది. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఎ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది.[4] తెలుగులోనూ కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.2014: హాకింగ్ జీవిత విశేషాలతో ది థియరీ ఆప్ ఎవ్వరిథింగ్ అనే సినిమా తీశారు. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సోషల్‌ మీడియాలో చేరిన క్షణాల్లోనే ఆయన మిలియన్‌ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇక స్టీఫెన్ హాకింగ్ చేసిన తొలి పోస్ట్‌కు క్షణాల్లో ఏకంగా ఐదులక్షల లైక్లు వచ్చాయి.

  • "మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువు కు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి".

పుస్తకాలు

మార్చు

హాకింగ్ రాసిన కొన్ని ప్రజాదరణ పొందిన పుస్తకాలు

  • ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్
  • ద యూనివర్స్ ఇన్ ఎ నట్‌షెల్
  • జార్జెస్ సీక్రెట్ కీ టు ది యూనివర్స్ (పిల్లలకోసం) (2007)
  • జార్జ్ అండ్ ద కాస్మిక్ ట్రెజర్ హంట్ (పిల్లల కోసం) (2009)

ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం సినిమా గా కూడా వచ్చింది. హొరైజాన్: ద హాకింగ్ పారడాక్స్ అనే బిబిసి టీవీ ధారావాహిక విడుదలైంది.[5]

డిగ్రీలు - పదవులు - పురస్కారాలు

మార్చు
  • 1975 ఎడిటంగ్ మెడల్
  • 1976 రాయల్ సొసైటి హ్యుగ్స్ మెడల్
  • 1979 అల్బర్ట్ ఐన్ స్టీన్ మెడల్
  • 1982 ఆర్డర్ ఆఫ్ బ్రీటీష్ ఎఒపైర్ (కమాండర్)
  • 1985 రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ బంగారు పతకం
  • 1986 పొంటిఫిషియల్ అకాడమి ఆఫ్ సైన్స్ లో సభ్యత్వం
  • 1988 భౌతిక శాస్త్రంలో అంతర్జాతీయ బహుమతి
  • 1989 కన్ కర్డ్ లో ఆస్ట్రియా ప్రిన్స్ అవార్డ్
  • 1989 కంపానియన్ ఆఫ్ ఆనర్
  • 1999 అమెరికా భౌతిక శాస్త్ర సమితి వారి జూలియస్ ఎడ్గర్ లిలెన్ ఫెల్ద్ ప్రైజ్
  • 2003 కేస్ వెస్ట్రెన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం వారి మైకెల్ సన్ మోర్లీ అవార్డ్
  • 2006 రాయల్ సొసైటీ కాప్లి మెడల్

మూలాలు

మార్చు
  1. Carr, Bernard J.; Ellis, George F. R.; Gibbons, Gary W.; Hartle, James B.; Hertog, Thomas; Penrose, Roger; Perry, Malcolm J.; Thorne, Kip S. (2019). "Stephen William Hawking CH CBE. 8 January 1942—14 March 2018". Biographical Memoirs of Fellows of the Royal Society. 66: 267–308. doi:10.1098/rsbm.2019.0001. ISSN 0080-4606. S2CID 131986323.
  2. "విశ్వ విజ్ఞాని". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2021-03-13. Retrieved 2021-03-13.
  3. https://www.bbc.com/telugu/international-43395763
  4. "కదల్లేకపోతేనేం... కదిలే కాలం కథ చెప్పాడు!". www.eenadu.net. Archived from the original on 2021-03-13. Retrieved 2021-03-13.
  5. The Hawking Paradox, Internet Movie Database, 2005, retrieved 2008-08-29

బాహ్య లింకులు

మార్చు