హెచ్.సి.హెడా

(హరీష్ చంద్ర హెడా నుండి దారిమార్పు చెందింది)

హరీష్ చంద్ర హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మారాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు, మూడు పర్యాయాలు నిజామాబాదు నియోజకవర్గం నుండి లోక్‍సభకు ఎన్నికై 1952 నుండి 1967 వరకు లోక్‍సభలో నిజామాబాదుకు ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

హరీశ్చంద్ర హెడా
పార్లమెంటు సభ్యుడు
In office
1952–1967
అంతకు ముందు వారు నియోజకవర్గం స్థాపమ
తరువాత వారుఎం. నారాయణ రెడ్డి
నియోజకవర్గంనిజామాబాద్ (లోక్ సభ నియోజకవర్గం)
వ్యక్తిగత వివరాలు
జననం(1912-10-14)1912 అక్టోబరు 14
శిరధోన్, ఉస్మానాబాద్, హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత మహారాష్ట్ర, భారతదేశం)
మరణం2002 ఆగస్టు 28(2002-08-28) (వయసు 89)
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిజ్ఞాన్ కుమారీ హెడా
సంతానం1
వృత్తిరాజకీయనాయకుడు

హరీష్ చంద్ర 1912, అక్టోబరు 14న అప్పటి హైదరాబాదు రాజ్యంలోని ఉస్మానాబాదు జిల్లాలోని శిరాఢోన్ గ్రామంలో ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బాల్ ముకుంద్ హెడా. ఈయన విద్యాభ్యాసం ఉస్మానాబాద్, గుల్బర్గా, హైదరాబాదులలో సాగింది. 1936లో స్వాతంత్ర్య సమరయోధురాలు గ్యాన్ కుమారీ హెడాను వివాహమాడాడు. న్యాయవాద పట్టా పొంది 1939 నుండి 1942 వరకు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశాడు.

1930లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తత్త్వశాస్త్రం, న్యాయశాస్త్రాలలో పట్టభద్రుడైన హెడా 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు, ఆర్య సమాజం ఏర్పాటు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు.[3] క్విట్ ఇండియా ఉద్యమకాలంలోనూ హైదరాబాదు విమోచనోద్యమంలోనూ పాల్గొని జైలుకెళ్ళాడు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయి పటేల్ ల సన్నిహిత సహచరుడైన హెడా, 1949లో ప్రొవిన్షియల్ పార్లమెంటుకు, ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఏర్పడిన రాజ్యాంగసభకు ఎన్నికయ్యాడు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో నిజామాబాదు లోక్‍సభ నియోజకవర్గం నుండి సోషలిస్టు అభ్యర్థి కాశీనాథరావు ముకాల్పర్ను ఓడించి పార్లమెంటు సభ్యుడయ్యాడు. ఆ తరువాత 1957లోనూ, 1962లోనూ స్థానిక అభ్యుర్ధులైన జి.రాజారాం, ఎం.నారాయణ రెడ్డిలను ఓడించి తిరిగి లోక్‍సభకు ఎన్నికయ్యాడు. అయితే 1967 ఎన్నికలలో ఎం.నారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[4]

హెడా మార్క్సిజం, గాంధేయ వాదంపై అనేక వ్యాసాలు వ్రాశాడు. గాంధీజీస్ నౌఖాలీ పద్ యాత్ర (1946), ఆన్ ద హైసీస్ (1958), ఎన్నికలు ఇన్ బ్రిటన్ (1960) అనే మూడు పుస్తకాలను ప్రచురించాడు.[5]

ఇతను 2002, ఆగస్టు 28న తొంభై ఏళ్ల వయసులో హైదరాబాదులో అస్వస్థతతో మరణించాడు. ఇతని సతీమణి జ్ఞాన్ కుమారీ హెడా [2] స్వాతంత్ర్య సమరయోధురాలు, సర్వోదయ ఉద్యమ నాయకురాలు, గాంధీ స్మృతి అధ్యక్షురాలు. వీరికి ఒక కుమారుడు శరద్ హెడా న్యూజెర్సీలో స్థిరపడ్డాడు.

మూలాలు

మార్చు
  1. EENADU (19 April 2024). "హ్యాట్రిక్‌ వీరులు ఇద్దరు". Archived from the original on 19 April 2024. Retrieved 19 April 2024.
  2. 2.0 2.1 "Gyan Kumari Heda passes away". news.webindia123.com. Archived from the original on 2021-09-28. Retrieved 2021-09-28.
  3. Locating Home: India's Hyderabadis Abroad By Karen Isaksen Leonard
  4. "Nizamabad proves lucky for `outsider' again". Archived from the original on 2013-09-25. Retrieved 2013-03-02.
  5. "Lok sabha - Synopsis Of Debates". Archived from the original on 2016-03-04. Retrieved 2013-03-02.

వెలుపలి లంకెలు

మార్చు