సర్దార్ వల్లభభాయి పటేల్

స్వాతంత్ర్య సమర యోధుడు, స్వరాజ్య ఏకీకరణ చేసినవారు

భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ భాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించారు.[1] ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, భారత ఉప ప్రధాన మంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది.

సర్దార్ వల్లభాయి పటేల్
సర్దార్ వల్లభభాయి పటేల్


భారతదేశపు మొదటి భారత ఉప ప్రధాన మంత్రి
పదవిలో
1947 ఆగస్టు 15 – 1950 మే 27
రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ , సర్వేపల్లి రాధాకృష్ణన్
మునుపు (ఎవరూ లేరు)
తరువాత మురార్జీ దేశాయ్

పదవిలో
1947 ఆగస్టు 15 – 1950 డిసెంబరు 15
మునుపు (ఎవరూ లేరు)
తరువాత చక్రవర్తి రాజగోపాలాచారి

జననం (1875-10-31)1875 అక్టోబరు 31
నాడియర్, గుజరాత్,
India ఇండియా
మరణం 1950 డిసెంబరు 15(1950-12-15) (వయసు 75)
ముంబయి, భారతదేశం
సంబంధీకులు చంద్రలేఖ (మేనకోడలు)
సంతానం మణిబెన్ పటేల్, దాహ్యాబాయి పటేల్
Profession న్యాయవాది
మతం హిందూ

బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబంసవరించు

1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియాడ్లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. జవేరీభాయి వృత్తి రీత్యా వ్యవసాయదారుడు. జవేరీ భాయి పేట్ లావ్ తాలూకాలోని కరంసాద్ గ్రామంలో జన్మించాడు. సామాన్య గృహస్థుడైనా 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి దళంలో పోరాడాడు.[2] భారతీయ శాసనసభ సభ్యుడు, రాజకీయ నాయకుడు, స్వరాజ్ పార్టీ సహ వ్యవస్థాపకుడు విఠల్ భాయ్ పటేల్ సోదరుడవుతాడు

వల్లభాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం తన ఊరిలో సాగించారు. స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని,ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.

జాతీయ నేతగాసవరించు

 
1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.

బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928లో బార్డోలీలో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.

1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు.

రాజ్యాంగ సభ సభ్యుడిగాసవరించు

భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు.

కేంద్ర మంత్రిగాసవరించు

 
వల్లభాయి పటేల్ జాతీయ స్మారకమందిరం ప్రధాన హాలు.

దేశ స్వాతంత్ర్యం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను, ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

నెహ్రూతో విబేధాలుసవరించు

భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ను గెలిపించారు.

భారత అత్యుత్తమ వ్యక్తిగా ఎంపికసవరించు

2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మూడవ స్థానంలో ఎంపికైయ్యాడు.[3]

మరణంసవరించు

 
ఏకత్వ చిహ్నం

1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.

ఐక్యతా ప్రతిమసవరించు

భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబరు 31న ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.

ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారు, 2018 అక్టోబరు 31 న అత్యంత ఘనంగా ఆవిష్కరించారు.[4]

బిరుదులుసవరించు

1991లో భారత ప్రభుత్వం వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

సంస్థలు, స్మారకాలుసవరించు

 
పటేల్ విగ్రహం, పటేల్ చౌక్, కాత్రా గులాబ్ సింగ్, ప్రతాప్ గఢ్, ఉత్తరప్రదేశ్.

ఇవి కూడా చూడండిసవరించు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలుసవరించు

  1. http://www.liveindia.com/freedomfighters/9.html
  2.   వల్లభాయి పటేల్. వికీసోర్స్. 
  3. "A Measure Of The Man | Outlook India Magazine". web.archive.org. 2021-07-24. Archived from the original on 2021-07-24. Retrieved 2021-10-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "bbc.com/telugu/india-46030782". బిబిసి. 31 Oct 2018.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-29. Retrieved 2013-10-31.
  6. http://www.du.ac.in/index.php?id=463

వెలుపలి లంకెలుసవరించు