1908నాటి హైదరాబాదు వరదలు

హైదరాబాదులోని మూసి నదికి 1908, సెప్టెంబర్ 26 నుండి 28వరకు వరదలు వచ్చాయి. 36 గంటల్లో 16 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతంలో దాదాపు 15వేలమంది ప్రాణాలు కోల్పోయారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.[1] నగరంలో ఉన్న మూడు వంతెనలు (అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌) తెగిపోవడంతో, పూరానాపుల్ వంతెన మాత్రమే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య అనుసంధానమైవుంది.[2]

హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది

సెప్టెంబర్ 26

మార్చు

సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆకాశంలో నల్లటి మబ్బులు ఏర్పడ్డాయి. గంట తరువాత చినుకులు ప్రాంభమై, మధ్యాహ్నం 2 గంటలకు జడివానలా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై, సాయంత్రం 6 గంటలకు మూసీ నది పూర్తిగా నిండిపోవడంతోపాటూ శివారు ప్రాంతాల చెరువులకు, కుంటలకు గండి పడి మూసీనదిలో కలిసాయి. అనేక సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి.

సెప్టెంబర్ 27

మార్చు
 
బ్రిటీషు రెసిడెన్సీ యొక్క అర్చి వీధి ద్వారం 1908 మూసీ వరదల్లో సగందాకా నీటిలో మునిగి ఉన్న దృశ్యం

మరుసటి రోజూ అదే పరిస్థితి నెలకొంది.

సెప్టెంబర్ 28

మార్చు

మూడోరోజు అనగా సెప్టెంబర్‌ 28న మూసీ నది 60 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో, ఆఫ్జల్‌ గంజ్‌ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై, వర్షంనీరు చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బురుజు వరకు, అటు చార్మినారు దాటి శాలిబండ వరకు ప్రవహించాయి. వందల సంఖ్యలో జనం పేట్లబురుజుపైకి ఎక్కారు. కానీ, రెండు గంటల్లోనే పేట్లబురుజు నీటి ప్రవాహానికి కొట్టుకపోవడంతో వందలమంది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. ఆ రోజు సాయంత్రానికి గానీ వరద ఉధృతి తగ్గలేదు.

నష్టం - సహాయకచర్యలు

మార్చు

దాదాపు 15వేల మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటూ, 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. అప్పటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ నిరాశ్రయుల కోసం అనేక సహాయక చర్యలు ప్రారంభించి, తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించాడు. అనేక ప్రాంతాల్లో వైద్య, అన్నదాన శిబిరాలు ప్రారంభించాడు.

చింతచెట్టు

మార్చు

ఆఫ్జల్‌ దవాఖాన (ఉస్మానియా జనరల్ హాస్పిటల్) భవనం కూలిపోవడంతో అఫ్జల్‌గంజ్ భవనం పైన ఎక్కిన జనం, దానిపక్కనేవున్న చింత చెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు.[3] వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ ఉంది.

ఇతర వివరాలు

మార్చు

1908లో వచ్చిన ఈ వరదల తర్వాత జంటనగరాల అభివృద్ధి ప్రారంభమైంది. సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచేసి, వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో ఇతర మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబరు 1న తన నివేదిక సమర్పించాడు. 1912లో ఏడవ నిజాం ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించి, వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను ఏర్పరచడంలో భాగంగా, 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించాడు. ఇవి రెండు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతోపాటు హైదరాబాదు నగరానికి త్రాగునీటిని అందిస్తున్నాయి.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి (25 September 2018). "కన్నీటి ఉప్పెన!". Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018.
  2. http://www.thehindu.com/news/cities/Hyderabad/musing-over-the-musi/article4902673.ece
  3. http://www.thehindu.com/news/cities/Hyderabad/remembering-the-deluge-of-1908/article3944923.ece

వెలుపలి లంకెలు

మార్చు