1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు

భారతదేశంలో అల్లర్లు

1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు లేదా 1984 సిక్ఖుల ఊచకోత లేదా 1984 సిక్ఖులపై మారణహోమం అన్నది సిక్ఖు వ్యతిరేక గుంపులు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు, సిక్ఖు అంగరక్షకుల చేతిలో జరిగిన ఇందిరా గాంధీ హత్యకి ప్రతీకారంగా సిక్ఖులకు వ్యతిరేకంగా సాగిన హింసాయుత చర్యల వరస.[1][2][3][4][5][6] లూటీలు, గృహదహనాలు, హత్యలు, ఆలయ విధ్వంసాలు వంటి అనేక చర్యలకు ఈ అల్లర్లలో విద్రోహ మూకలు పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా 2800 మంది సిక్ఖులు అల్లర్లలో మరణించగా, అందులో 2100 మరణాలు ఢిల్లీలోనే జరిగాయి.[3][7] ఈ దాడుల గురించి ఇందిరా గాంధీ మరణం తర్వాత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజీవ్ గాంధీని ఈ దాడుల గురించి ప్రశ్నించగా "పెద్ద చెట్టు కూలిపోతే, చుట్టూ ఉన్న భూమి కంపిస్తుందం"టూ వ్యాఖ్యానించారు.[8] ఆయన వ్యాఖ్య పలు విమర్శలకు గురైంది.

సిక్ఖు వ్యతిరేక అల్లర్లు చిత్రం

నేపథ్యం

మార్చు

ఆనంద్ పూర్ తీర్మానం

మార్చు

1973లో అకాలీ దళ్ వర్కింగ్ కమిటీ ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం భారత ప్రభుత్వాన్ని నిజ సమాఖ్య స్ఫూర్తిపై రాజ్యాంగాన్ని పునర్నిర్మించి రాష్ట్రాల్లో కేంద్ర జోక్యం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, సాధారణ పరిపాలనకు మాత్రమే పరిమితమై, మిగిలిన అంశాలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాంతోపాటుగా హర్యానా, పంజాబ్ల ఉమ్మడి రాజధాని చండీగఢ్ని పూర్తిగా పంజాబ్ కే రాజధానిగా ఇవ్వాలని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిక్ఖులు అధికంగా ఉంటున్న ప్రాంతాలను కూడా పంజాబ్ రాష్ట్రంలో చేర్చాలని అన్నది. వీటన్నిటికీ నేపథ్యంగా సిక్ఖు జాతి ఆశయాలు, ఆశలకు రూపుగా అకాలీదళ్ ను అభివర్ణించుకుని ఖాల్సా శ్రేష్ఠత, సిక్ఖుల ప్రాథమిక హక్కులను సాధించుకోవడం అంటూ తమ లక్ష్యాలను అభివర్ణించుకుంది.[9]

భింద్రన్ వాలే ప్రాదుర్భావం

మార్చు

1977లో అత్యవసర స్థితి ముగిసిపోయాకా, అకాలీ దళ్ పంజాబ్లో అధికారం సాధించడంతో పాటుగా ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చి దానికి నదీ జలాల పంపిణీలో పెద్దవాటా, సిక్ఖుల పవిత్ర స్వర్ణదేవాలయం ఉన్న అమృత్ సర్ కు పవిత్ర నగరం అన్న పేరు పెట్టడం వంటి డిమాండ్లు చేర్చారు. క్రమంగా ఈ రాజకీయ వివాదం భింద్రన్ వాలే ప్రాదుర్భావంతో మరింత వేడెక్కింది. అకాలీ దళ్ ను రాజకీయంగా వెనక్కినెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు తెరపైకి తెచ్చారని కొందరు చరిత్రకారులు భావించే భింద్రన్ వాలే సంవత్సరాల కాలంలో అనూహ్యమైన రాజకీయ వృద్ధి సాధించారు. సిక్ఖుల్లో కొన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించిన భింద్రన్ వాలే ఉద్యమాన్ని తీవ్రవాదం వైపు నడిపారు, సిక్ఖులకు విడిగా ఖలిస్తాన్ అనే దేశం ఏర్పడాలన్న వేర్పాటు ఉద్యమాన్ని లేవదీశారు.[9]

స్వర్ణదేవాలయంలో చేరిక

మార్చు

మరోవైపు 1981 ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అకాలీ దళ్ ప్రతిఘటన మార్గాన్ని పట్టుకుని, వారి నాయకుడు సంత్ హర్ చరణ్ సింగ్ లోంగోవాల్ స్వర్ణదేవాలయంలోని ఓ భాగంలో చేరారు. అక్కడి నుంచి వీధుల్లో ఆందోళనలు, నిరసనలు చేయాలన్న పిలుపునిస్తూ వచ్చారు. మరోవైపు భింద్రన్ వాలే అదే ఆలయంలోని మరోభాగం నుంచి పనిచేసేవారు. ఆయన విధానం మిలిటెన్సీ పద్ధతిలో ఉండేది. 1980ల ఏప్రిల్లో సిక్ఖు నిరంకారీ శాఖ నాయకుడు బాబా గురుచరణ్ సింగ్ ఢిల్లీలో హత్యకు గురికావడం, 1981లో సిక్ఖు తీవ్రవాదం పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పత్రికా సంపాదకుడు లాలా జగత్ నారాయణ్ హత్య కావడం వంటివి జరిగాయి. ఈ హత్యల వెనుక ఉన్న భింద్రన్ వాలేపై అరెస్టు వారెంట్ జారీ కాగా అతను మత పాఠశాల రక్షణలోకి వెళ్ళిపోయారు. తాను ఎన్నుకున్న సమయంలో తానే వచ్చి లొంగిపోతానని, ఐతే తనను అరెస్టు చేసేందుకు సంప్రదాయ సిక్ఖు పోలీసు అధికారులే రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ అవమానకరమైన షరతులకు తలవొగ్గి ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. మూడు వారాల అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాకా మరిన్ని హింసాత్మక పరిణామాలు సాగాయి.[9]

హింసాత్మక చర్యలు, రాష్ట్రపతి పాలన

మార్చు

అక్టోబర్ 5, 1983న సిక్ఖు తీవ్రవాదులు బస్సును ఆపి ఆరుగురు హిందువులను వేరుచేసి కాల్చి చంపారు. అప్పటికి ఉద్యమంలో హింసాత్మకంగా చనిపోయినవారి సంఖ్య 175కు చేరుకుంది. తర్వాతి రోజున అక్టోబర్ 6, 1983న పంజాబ్ లో ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించారు. బాంబుదాడులు, ప్రయాణికుల్లో హిందువులను వేరుచేసి కాల్చి చంపడం వంటి ఘటనలు కొనసాగాయి. మధ్యయుగాల నాడు సిక్ఖులను అణచివేసిన, సిక్ఖు మత గురువులు, వీరులు పోరాడిన మొఘల్ పాలకులతో ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని పోలుస్తూ భింద్రన్ వాలే తదితరులు వ్యాఖ్యలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మధ్యయుగాల్లో సిక్ఖు మతగురువులు అధిష్టించి సిక్ఖులు అనుష్టించాల్సిన హుకుంనామాలను జారీచేసి, మొఘలులపై పోరాడిన సిక్ఖు వీరులు ఆశ్వీర్వాదానికి వచ్చిన పవిత్రమైన అకాల్ తఖ్త్ ను భింద్రన్ వాలే తన నివాసంగా చేసుకున్నారు. ప్రమాదకరమైన సంకేతాత్మకత, తీవ్రమైన ఉగ్రవాద కార్యకలాపాలు కలగలిపి ఉగ్రవాద ఉద్యమాన్ని తీవ్రమైన స్థాయికి తీసుకుపోయాయి. మరోపక్క ఈ తీవ్రవాద కార్యకలాపాలను పెద్ద సంఖ్యలో సిక్ఖులు ఖండించారు.[9]

స్వర్ణ దేవాలయాన్ని దుర్గంగా మలచడం

మార్చు

1984 సంవత్సరం నాటికి ఉగ్రవాదులను హడలెత్తించిన సీనియర్ సిక్ఖు పోలీసు అధికారి, సంపాదకుడు జగత్ నారాయణ్ కుమారుడు, ఆయన తర్వాతి సంపాదకుడు రమేశ్ చందర్ హత్యకు గురయ్యారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో బంగ్లాదేశ్ ముక్తిబాహినికి శిక్షణనిచ్చిన మాజీ మేజర్ జనరల్ షూబేగ్ సింగ్ భింద్రన్ వాలే పక్షాన చేరి స్వర్ణదేవాలయాన్ని యుద్ధానికి సిద్ధమైన కోటగా మలచనారంభించారు. అకాలీలతో పరిష్కారానికి వచ్చేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు, స్వర్ణ దేవాలయంలోని రక్షణ ఏర్పాట్లు తొలగించుకుని వెళ్ళిపొమ్మని భింద్రన్ వాలేకు నచ్చచెప్పడంలో అకాలీల ప్రయత్నాలు విఫలమయ్యాయి. భింద్రన్ వాలే పక్షం మరింత యుద్ధ సుముఖులయ్యారు. మరోవైపు సంత్ లోంగోవాల్ భారతదేశపు ధాన్యాగారమని పిలిచే పంజాబ్ నుంచి ధాన్యం గింజ కూడా బయటకు వెళ్ళకుండా తానొక ఉద్యమాన్ని ప్రారంభిస్తానంటూ ప్రకటన చేశారు.

ఆపరేషన్ బ్లూస్టార్

మార్చు

ప్రధాన వ్యాసం: ఆపరేషన్ బ్లూస్టార్
పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశాలు, ఇతర ప్రమాదకర పరిణామాలను అనుమానిస్తూనే ప్రధానమంత్రి ఇందిరా గాంధీ స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల నుంచి విడిపించే ఆపరేషన్కు ఆదేశమిచ్చారు. సిక్ఖు మతస్తుడు, జనరల్ షూబేగ్ నుంచి కెరీర్ ప్రారంభంలో శిక్షణ పొంది, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో సహచరునిగా పనిచేసిన జనరల్ బ్రార్ ను దీనికై నియమించారు. జూన్ 5వ తారీఖున ప్రారంభమైన దాడి భారత సైన్యం అంచనాలను కొంతవరకూ తలకిందులు చేస్తూ దీర్ఘంగా సాగింది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రార్ కేంద్రాన్ని అనుమతి కోరి ట్యాంకులను వినియోగించారు. దీంతో జూన్ 6వ తేదీన 5-13 ట్యాంకులు ఆలయద్వారాలను, రక్షణ ఏర్పాట్లను విరగగొట్టి స్థానాలను గ్రహించి అకాలీ తఖ్త్ పై కాల్పులు సాగిస్తూనే వచ్చారు. అప్పటికల్లా భింద్రన్ వాలే, అమ్రిక్ సింగ్, షూబేగ్ సింగ్ వంటి ప్రముఖులు సహా, యుద్ధంలో పాల్గొన్నవారంతా మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సైన్యం పక్షాన 79మంది, ఉగ్రవాదుల వైపున 492 మంది మరణించారు. ఐతే ఇతరుల కథనాల ప్రకారం సైనికులు 500 కన్నా ఎక్కువ సంఖ్యలోనూ, ఇతరులు 3వేల మంది, వీరిలో అధిక సంఖ్యాకులు సైనికచర్యలో చిక్కుకుపోయిన సాధారణ భక్తులు, చనిపోయారు.[9]

ఇందిరా గాంధీ హత్య

మార్చు

ప్రధాన వ్యాసం: ఇందిరా గాంధీ హత్య
ఆపరేషన్ బ్లూస్టార్ ముగిశాకా అప్పటివరకూ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల వ్యతిరేకతతోనూ, ప్రభుత్వానికి అనుకూలురుగానూ ఉన్న సిక్ఖు జన సమూహంలో భారత ప్రభుత్వ వ్యతిరేక భావనలు రేగాయి. పవిత్ర స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జరపడం ఓ సిక్ఖు పెద్దమనిషి రిపోర్టర్ కు చెప్పినదాని ప్రకారం - మా మత ఆధారంపై దాడి, మా సంప్రదాయాన్నే కూల్చడం -గా కనిపించింది. ఆపరేషన్ బ్లూస్టార్ అనంతరం సిక్ఖు వర్గాల నుంచి ప్రధాన మంత్రి ఇందిర గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆమె వ్యక్తిగత అంగరక్షకుల్లోని సిక్ఖులను ఆ బాధ్యతల నుంచి తొలగించి, బదిలీ చేయాల్సిందిగా సూచించారు. ఐతే ఇందిరా గాంధీ ఈ సూచనలు తిరస్కరిస్తూ "మనం లౌకికవాదులం" అని ప్రతిస్పందించారు. ఐతే ఇటీవలే పంజాబ్ లోని తమ ఇంటికి వెళ్ళి వచ్చి, అక్కడి ఆగ్రహావేశాలను, గాయభావనను పంచుకున్న ఆమె సిక్ఖు అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా అక్టోబర్ 31, 1984న ఇందిరా గాంధీని కాల్చి చంపారు. ఇంటి నుండి ఇందిర కార్యాలయానికి నడుస్తున్న సమయంలో అతి దగ్గరి రేంజ్ నుంచి ఆమెను అంగరక్షకులు ఇద్దరూ కాల్చారు, ఆసుపత్రికి తీసుకువెళ్ళే సరికే ఆమె మరణించారు.[8]

మూలాలు

మార్చు
  1. State pogroms glossed over Archived 2011-08-11 at the Wayback Machine. The Times of India. 31 December 2005.
  2. "Anti-Sikh riots a pogrom: Khushwant". Rediff.com. Retrieved 23 September 2009.
  3. 3.0 3.1 Bedi, Rahul (1 November 2009). "Indira Gandhi's death remembered". BBC. Archived from the original on 2009-11-02. Retrieved 2 November 2009. The 25th anniversary of Indira Gandhi's assassination revives stark memories of some 3,000 Sikhs killed brutally in the orderly pogrom that followed her killing
  4. Nugus, Phillip (Spring 2007). "The Assassinations of Indira & Rajiv Gandhi". BBC Active. Retrieved 23 July 2010.[permanent dead link]
  5. "California assembly describes 1984 riots as 'genocide'". The Times of India. 22 April 2015. Retrieved 28 April 2015.
  6. Grewal, Jyoti. Betrayed by the State: The Anti-Sikh Pogrom of 1984. Penguin Books. ISBN 978-0-14-306303-2.
  7. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-11-27. Retrieved 2016-05-02.
  8. 8.0 8.1 రామచంద్ర, గుహ. "గతి తప్పిన ప్రజాస్వామ్యం". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు అనువాదం). హైదరాబాద్: ఎమెస్కో పబ్లికేషన్స్. pp. 589–591.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  9. 9.0 9.1 9.2 9.3 9.4 రామచంద్ర, గుహ. "గతి తప్పిన ప్రజాస్వామ్యం". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు అనువాదం). హైదరాబాద్: ఎమెస్కో పబ్లికేషన్స్. pp. 576–588.{{cite book}}: CS1 maint: unrecognized language (link)