2013 డెప్సాంగ్ ప్రతిష్టంభన
2013 దౌలత్ బేగ్ ఓల్డీ సెక్టరు సంఘటన | |||||||
---|---|---|---|---|---|---|---|
భారత చైనా సంబంధాలులో భాగము | |||||||
1988 CIA map of the Line of Actual Control (LAC) | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
India
Indian Army | China
People's Liberation Army Ground Force | ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
జనరల్ బిక్రం సింగ్, భారత సైన్యం | జనరల్ చెన్ బింగ్‌డే, చైనా సైన్యం | ||||||
పాల్గొన్న దళాలు | |||||||
నార్దర్న్ కమాండ్ | లాంఝౌ ఎమ్‌ఆర్ | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
లేవు | లేవు |
2013 ఏప్రిల్ 15 న, ప్లాటూన్ పరిమాణంలో ఉన్న చైనా సైనిక దళం ఒకటి, అక్సాయ్ చిన్ - లడఖ్ వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్ఐసి) సమీపంలో, దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 30 కి.మీ. దూరం లోని రాకీ నాలా వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ వివాదాస్పద ప్రాంతంలో భారత చైనా దళాలు గస్తీ తిరగడం సాధారణం. కానీ భారత చైనా సైనిక దళాలు రెండూ ఈ ప్రాంతంలో శాశ్వత స్థావరాలను, కోటలనూ ఏర్పాటు చేయకుండా ఎవరికివారు నియంత్రించుకున్నారు. చైనా చేపట్టిన ఈ చర్యకు స్పందనగా, భారత దళాలు వారికి 300 మీటర్ల దూరంలో తమ సొంత సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. భారత చైనాల మధ్య చర్చలు దాదాపు మూడు వారాల పాటు కొనసాగాయి. ఈ సమయంలో చైనా తమ స్థావరాన్ని ట్రక్కులు, హెలికాప్టర్లతో బలోపేతం చేసుకుంది. మే 5 న ఈ వివాదం పరిష్కారమైంది. ఆ తరువాత ఇరువర్గాలూ తమతమ స్థానాల నుండి ఉపసంహరించుకున్నాయి. పరిష్కారంలో భాగంగా, అక్కడికి దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న వివాదాస్పద చుమార్ రంగంలో నిర్మించిన కొన్ని సైనిక నిర్మాణాలను కూల్చివేయడానికి భారత సైన్యం అంగీకరించింది. చైనీయులు వీటిని తమకు ముప్పుగా భావించారు. [1] లడఖ్ ప్రాంతంలోని డెప్సాంగ్ లోయ లోకి తాము చొరబడినట్లు 2014 జూలైలో చైనా సైన్యం అంగీకరించింది. వాస్తవాధీన రేఖ పట్ల ఉన్న భిన్నమైన అవగాహనల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగాయని చెప్పింది. [2]
నేపథ్యం
మార్చుభారత చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ యొక్క 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఈ సంఘటన జరిగింది. లడఖ్‌లో భాగమైన ఈ ప్రాంతాన్ని జిన్జియాంగ్‌లో భాగమని చైనా చెప్పుకుంటుంది. ఈ ప్రాంతంలో తలెత్తే వివాదాలను పరిష్కరించుకోడానికి గాను, ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేసుకునేందుకు భారత చైనాలు 1993, 1996 లో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ప్రోటోకాల్‌లలో "వాస్తవాధీన రేఖ" (ఎల్‌ఎసి) ను పరస్పరం గుర్తించుకున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఎల్‌ఎసి వెంట సుమారు 20 కి.మీ. ప్రాంతంపై రెండు ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాను భావించే ఎల్‌ఎసి నుండి తమ భూభాగంలో 10 కి.మీ. లోపల చైనా శిబిరం ఏర్పాటు చేసుకుంది అని మొదట పేర్కొన్న భారతదేశం, తరువాత దానిని 19 కి.మీ.అని చెప్పింది. ఈ వివాదాస్పద ప్రాంతం "నిర్జనమైన బంజరు భూమి" అయినప్పటికీ, పాకిస్తాన్‌ను టిబెట్, జిన్జియాంగ్లతో కలిపే రహదారి కారణంగా ఇది చైనాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. 1980 ల చివరి నుండి, భారత చైనాలు తమ మధ్య తలెత్తిన సరిహద్దు వివాదాలను దౌత్యం ద్వారా విజయవంతంగా పరిష్కరించుకున్నాయి.
ఈ ప్రాంతానికి ఆనుకొని తన వైపున ఉన్న భూభాగంలో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకుంది. ఆ తరువాత 2000 వ దశకంలో భారత సైన్యం కూడా,తమ వైపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దీనిని తమకు ముప్పుగా చైనా సైన్యం భావించింది. చైనా దళాలు ప్రతి సంవత్సరం వందల సార్లు చట్టవిరుద్ధంగా ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది. వీటిలో ఎక్కువ భాగం ఏ సంఘటనా లేకుండానే ముగిసాయి. కాని 2011 లో చైనా సైనిక దళాలు 18 కి.మీ. దూరం వరకూ చొచ్చుకొచ్చాయి.
సంఘటన
మార్చుసైనిక మోహరింపులు
మార్చు2013 ఏప్రిల్ 15 న, 50 మంది సైనికుల చైనా ప్లాటూన్, దౌలత్ బేగ్ ఓల్డి కి ఆగ్నేయంగా 30 కి.మీ. దూరంలో ఉన్న రాకీ నాలా లోయలో 16,300 అడుగుల ఎత్తున నాలుగు గుడారాల శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ శిబిరాన్ని మరుసటి రోజు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు గమనించారు. వారు చైనీయుల శిబిరం నుండి 300 మీటర్ల దూరంలో ఎనిమిది గుడారాలతో తమ సొంత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చైనా దళానికి మద్దతుగా ట్రక్కులు, హెలికాప్టర్లు వచ్చాయి. అనేక సంవత్సరాలలో ఇది అత్యంత తీవ్రమైన సరిహద్దు సంఘటనగా భారత ప్రభుత్వం భావించింది.
దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వానికి అవకాశం కల్పించడానికి గాను భారత సైన్యం, సంయమనాన్ని పాటించింది. సమస్యను "స్థానికంగానే" ఉంచేందుకూ "ఎత్తుగడకే" పరిమితం చేసేందుకూ ప్రయత్నించింది. ఈ సంఘటనలో ఎక్కడా తుపాకులు మోగలేదు. భారత సైన్యం చైనీయులను అధిగమించడానికి ప్రయత్నించలేదు. ప్రారంభ మోహరింపు తర్వాత తన స్థానాన్ని బలోపేతం చేయడానికి భారత సైన్యం కనీస స్థాయిలో మాత్రమే ప్రయత్నించింది. అయితే ఇరుపక్షాలు ఒకరినొకరు ఉపసంహరించుకోవాలని చెబుతూ బ్యానర్లు మాత్రం ప్రదర్శించాయి. రెండు శిబిరాల్లో ఉన్న అధికారుల మధ్య చాలా చర్చలు జరిగాయి. పాశ్చాత్య మీడియా చాలావరకు, చైనా చర్యలను చైనా మిలిటరీ బలప్రయోగం అని వ్యాఖ్యానించింది, కాని కొంతమంది జర్నలిస్టులు మాత్రం, వివాదాస్పద ప్రాంతంలో భారత సైన్యం నిర్మించిన "శాశ్వత స్థావరం" పట్ల నిరసనగా చైనా సైన్యం ఈ ఘటనను చేసిందని ఊహించారు. తరువాతి కాలంలో చైనా సైన్యపు థింక్ ట్యాంక్, ఈ సంఘటన "ప్రమాదవశాత్తు" జరిగిందని, "ఉద్దేశపూర్వకంగా చేసినది కాద"నీ సూచించడానికి ప్రయత్నించింది.
పరిష్కారం
మార్చుభారత ప్రభుత్వం దౌత్యపరంగా నిరసన వ్యక్తం చేసింది. చైనీయులు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని, సంఘటనకు ముందు ఉన్న స్థితిని గుర్తించాలనీ కోరింది. చైనా స్పందిస్తూ, సరిహద్దు సమస్య లేనే లేదని బహిరంగంగా ఖండించింది. ఎల్‌ఎసి అని తాము భావిస్తున్న రేఖను తమ దళాలు దాటనే లేదని పేర్కొంది. భారతదేశం సైనిక చర్య తీసుకోకూడదని నిర్ణయించుకుంది. భారత పార్లమెంటులో, ఈ సంఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి [1] వారు దీనిని 1962 భారత చైనా యుద్ధంలో భారత ఓటమితో పోల్చారు. మే 3 న, వివాదం పరిష్కరించడానికి రెండు రోజుల ముందు, ప్రతిపక్ష సభ్యులు విఘాతం కలిగించడంతో భారత పార్లమెంటు వాయిదా పడింది. "చైనాను బయటకు తోలండి, దేశాన్ని రక్షించండి" అని వారు నినదించారు.
చర్చలు దాదాపు ఇరవై రోజులు కొనసాగాయి. ఈ సమయంలో చైనా సైన్యం ఈ ప్రాంతంలో తమ ఉనికిని పెంచుకుంది. సమస్యను పరిష్కరించడానికి, అక్కడికి దక్షిణాన 250 కి.మీ. దూరంలో ఉన్న చుమర్ సెక్టార్ లో అనేక "లివ్-ఇన్ బంకర్లను" పడగొట్టాలన్న చైనా డిమాండుకు భారత్ అంగీకరించింది. ఇతర చైనా డిమాండ్లలో సరిహద్దులో నిర్మించిన భారతీయ శ్రవణ, పరిశీలన పోస్టులను కూల్చివేయడం, సంచార గొర్రెల కాపరులను చైనా వైపుకు వెళ్ళడాన్ని ఆపడం వంటివి ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లకు భారతదేశం ఎంతవరకు అంగీకరించిందో స్పష్టంగా తెలియలేదు. [1] వివాదం పరిష్కారమయ్యాక, చైనా సైన్యం అక్కడి నుండి ఉపసంహరించుకుంది. మే 5 న ప్రతిష్ఠంభన ముగిసింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Defence News. "India Destroyed Bunkers in Chumar to Resolve Ladakh Row". Defence News. 8 May 2013. Retrieved 11 May 2013.
- ↑ "Chinese army admits 2013 incursion at Depsang Valley for 1st time". India Today. 31 July 2014. Archived from the original on 7 September 2017.