భారత చైనా యుద్ధం 1962

భారత్ చైనాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. వివాదాస్పదమైన హిమాలయ ప్రాంత సరిహద్దు యుద్ధానికి మూల కారణంగా చెప్పుకున్నప్పటికీ ఇతర సమస్యలు కూడా దోహదమయ్యాయి. 1959లో టిబెటన్ల తిరుగుబాటు తర్వాత బౌద్ధ గురువు దలైలామాకి భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

భారత్ చైనా యుద్ధం 1962

భారత్ చైనా యుద్ధం 1962.
తేదీఅక్టోబర్ 20[1] - 21 నవంబర్ 1962
ప్రదేశంఅక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్.
ఫలితంచైనా సైన్యం విజయం. చైనా ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించి యుద్ధానికి పూర్వం ఊన్న స్ధానాలకి వెనుదిరిగింది.
రాజ్యసంబంధమైన
మార్పులు
చైనా అక్సాయ్ చిన్ ఆక్రమించిన
ప్రత్యర్థులు
India
India
చైనా
China
సేనాపతులు, నాయకులు
India Brij Mohan Kaul
India Jawaharlal Nehru
India Pran Nath Thapar
చైనా Zhang Guohua[2]
చైనా Mao Zedong
చైనా Liu Bocheng
చైనా Lin Biao
చైనా Zhou Enlai
బలం
10,000-12,00080,000[3][4]
ప్రాణ నష్టం, నష్టాలు
1,383 Killed[5]
1,047 Wounded [5]
1,696 Missing[5]
3,968 Captured[5]
722 Killed.[5]
1,697 Wounded[5][6]

1962 అక్టోబరులో హిందీ-చీనీ భాయి, భాయి అంటూ స్నేహ హస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతంలో భారత్‌కు పెట్టని కోటలుగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. దురాక్రమణను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో భారత్‌ పరాభావాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చింది.

ప్రదేశం

మార్చు

1962 అక్టోబరు 20 పంచశీల సూత్రాలను సమాధి చేసి భారత్‌పై చైనా దండెత్తిన రోజు. ఈశాన్య భారతంలోని 3,225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్‌ కూడా చైనాలో అంతర్భాగమని వాదిస్తోన్న చైనా పాలకులు యుద్ధానికి సిద్దమైన రోజులవి. 1959 నుంచి చైనాకు వ్యతిరేకంగా టిబెట్‌ మొదలైన ఆందోళనలు, దలైలామాకు భారత్‌ ఆశ్రయమివ్వడం వంటి ఘటనలతో భారత్‌పై చైనా అక్కసు పెంచుకుంది. సరిహద్దుల్లో ఘర్షణలు నిత్యకృత్యంగా మారాయి. సరిహద్దు ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అల్లర్లు కాస్తా చొరబాట్లుగా మారాయి. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాలు తీవ్రమయ్యాయి. టిబెట్‌ సరిహద్దులపై స్వాతంత్ర్యానికి ముందు నెలకొన్న వివాదాలపై 1914లోనే బ్రిటన్‌, చైనా, టిబెట్ల మధ్య సిమ్లాలో చర్చలు కూడా జరిగాయి. ఈ ఒప్పందానికి భారత్‌ తరపున బ్రిటన్‌, టిబెట్‌లు అమోదం తెలిపినా చైనా మాత్రం భారత తూర్పు సరిహద్దుగా నిర్ణయించిన ప్రాంతంపై అభ్యంతరాలతో ఒప్పందానికి నిరాకరించింది. అప్పట్నుంచి తూర్పు సరిహద్దుల్లోని 1,35,148 కి.మీ. భూభాగంపై భారత అధికారాల్ని చైనా ప్రశ్నిస్తోంది ఇవి కాస్తా ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలుగా మారడంతో 1962లో వివాదాస్పద మెక్‌మోహన్‌ లైన్‌ను దాటుకుని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సేనలు భారత్‌లో చొరబడ్డాయి.

స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకు దేశ పాలకులు సరిహద్దుల భద్రతపై అనుసరించిన ఉదాసీన వైఖరికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓ వైపు దేశ విభజన మరోవైను స్వదేశీ సంస్థానాల విలీనం, దేశంలో అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల సదుపాయాల కల్పన, పాలనపై పట్టు సాధించడం వంటి అంశాలపైనే దృష్టికేంద్రీకరించడంతో సైన్యంలో అప్రమత్తత కొరవడింది. ఇక స్వతంత్ర భారత ఆవిర్భావంతో లక్ష్యాన్ని సాధించినట్లేననుకున్న పాలకుల భావన తర్వాతి కాలంలో కష్టాలను తెచ్చిపెట్టింది. ఇక బ్రిటిష్‌ కాలం నాటి ఆయుధాలతో ఏర్పడ్డ భారత సైన్యం ఆయుధ సంపత్తిని స్వదేశీ పాలనలో ఆధునీకరించుకోలేకపోవడం సమస్యలకు కారణమైంది. అదే సమయంలో భారత భూభాగాలపై కన్నేసిన చైనా సైన్యాన్ని తరలించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంది. నిఘా వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడం, ఈశాన్య భారతంలో ఏం జరుగుతుందో గుర్తించేలోపే చైనా పనులు చక్కబెట్టేసింది. జమ్మూ కశ్మీర్‌లో భాగమైన అక్సాయ్‌చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించి, భారత నిఘా వ్యవస్థలకు తెలియకుండా ఝింజియాంగ్‌-టిబెట్‌ల మధ్య సైన్యాన్ని తరలించడానికి ఏకంగా హైవేనే నిర్మించేసింది. 1957లో చైనా అధికారికంగా ప్రకటించే వరకు హైవే నిర్మాణ పనుల్ని కూడా గుర్తించలేకపోయారు.

1962 యుద్ధంలో భారత భూభాగాల్ని ఆక్రమిస్తూ చైనా దురాక్రమణ సాగినా దాని ప్రభావం ఇప్పటికీ భారత్‌పై చూపిస్తూనే ఉంది. భారత్‌కు బుద్ధి చెప్పాలంటూ మావో జెడాంగ్‌ సర్కార్‌ దురహంకారంతో పిఎల్‌ఏ సేనల్ని భారత్‌పైకి దండెత్తించడానికి చాలా కారణాలే ఉన్నాయి. . ఛాంగ్‌కై, జపాన్‌, అమెరికాలతో తలపడ్డ ధైర్యంతో భారత ప్రధాని నెహ్రూ తలపొగరును అణచాలంటూ చైనా సేనలకు మావో నూరిపోశాడు. యుద్ధానికి ముందు నుంచి భారత తూర్పు సెక్టార్‌లోని అక్సాయ్‌చిన్‌ ప్రాంతంలోని 43,128 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని వాదిస్తోంది. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లా సహా 90వేల చదరపు కిలోమీటర్లు, సెంట్రల్‌ సెక్టార్‌లోని 2వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనాదేనని వాదనలు ప్రారంభించింది. అక్సాయ్‌చిన్‌ జమ్మూకశ్మీర్‌లో భాగమని భారత్‌ ఆధారాలు చూపినా అది చైనా ఝింజియాంగ్ ప్రావిన్స్‌లోనిదని వితండవాదన చేస్తోంది. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌లో కీలక ప్రాంతమైన తవాంగ్‌ జిల్లా చైనాదేనని డిమాండ్‌ చేస్తోంది. తూర్పు సరిహద్దుల్లోని బార్హోటి మైదాన ప్రాంతాలు తమవేనంటూ చైనా కలిపేసుకుంది. వివాదాస్పద ప్రాంతంలోని ఉత్తర సరిహద్దును మెక్‌మోహన్‌ లైన్‌గా గుర్తించినా చైనా అభ్యంతరాలు మాత్రం ఆగలేదు. వివాదాస్పద భూభాగాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. 1960లో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల్లో యథాతథ స్థితికి చైనా తరపు చౌఎన్‌లై ప్రతిపాదించినా అవి ఒప్పందాల వరకు వెళ్లలేదు. ఫలితంగా 1962లో చైనా భారత్‌పై దురాక్రమణకు దిగింది.

చైనా దురాక్రమణకు భారత సైన్యం, నాయకత్వ వైఫల్యాలు కూడా కారణాలే......రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌ చైనా నుంచి ఊహించని దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఉపఖండంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భారత్‌ను భావించిన చైనా మొదట్లోనే కట్టడి చేయాలని భావించింది. అందుకు దేశ భద్రతపై దార్శనికత కొరవడిన భారత పాలకుల వైఫల్యం కలిసొచ్చింది. కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునీకరణ కోసం ఎదురుచూస్తోన్న భారత సైన్యం చైనాతో బలవంతపు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. దీనికితోడు చైనా దురాక్రమణ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణ మీనన్‌, సైనిక కమాండర్లు అనుసరించిన వ్యూహాలపై కూడా రకరకాల కథనాలు ప్రచారం ఉన్నాయి. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం భారత్‌కు శాపంగా పరిణమించిందని భారత్‌-చైనా యుధ్ధంపై నివేదిక సమర్పించిన జనరల్‌ హెండర్సన్‌-బ్రూక్స్‌, బ్రిగేడియర్‌ పిఎస్‌ల నివేదికల్లో తప్పుపట్టడం కూడా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది.

యుద్ధం మిగిల్చిన విషాదం జవహర్‌లాల్‌ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. చైనాతో సోదరభావం నినాదంతో సాగిన విధానాలు విఫలమవడం నెహ్రూకు అంతులేని విషాదాన్ని తెచ్చిపెట్టింది. సైన్యం, ప్రభుత్వ విభాగాల నుంచి పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధంలో అంతులేని సైనిక నష్టానికి దేశం మొత్తం నెహ్రూ, కృష్ణమీనన్‌లను వేలెత్తి చూపించాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఒకటిన్నర దశాబ్దాల తర్వాత కూడా సైనిక ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకోని వైఫల్యాన్ని ఎండగట్టాయి. హిందీ ఛీనీ భాయి భాయి అంటూ సాగిన భారత విధానాలు ఎందుకు పనికి రావని తేలిపోయాయి. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కూడా యుద్ధానికి సన్నద్దమవడంలో నెహ్రూ నిర్లక్ష్యం వహించారంటూ విమర్శించడం ప్రధానికి మింగుడు పడలేదు. అందుబాటులో ఉన్న వనరుల్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయిందని భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సరైన ఎయిర్‌బేస్‌లు లేని చైనాను గగనతలం నుంచి కట్టడి చేసే అవకాశాలను భారత్‌ వినియోగించుకోలేకపోయింది. భారీ సంఖ్యలో ఉన్న చైనా మిలటరీ బలగాలను చూసి భారత్ సైన్యం మనోధైర్యాన్ని కోల్పోయిందని నివేదికలు తేల్చి చెప్పాయి. యుద్ధం మిగిల్చిన ఓటమితో నాటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రక్షణ శాఖ ఆధునీకరణకు జరగకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మీనన్‌ రాజీనామా చేశారు. అదే సమయంలో చైనా యుద్ధం స్ఫూర్తితో జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ చొరబాట్లు ప్రారంభించింది. చివరకు అది కాస్త 1965 రెండో కశ్మీర్‌ యుద్ధానికి దారి తీసింది. ఆ తర్వాత ఇండో-పాక్‌ యుద్ధానికి పాక్‌ తెగించడానికి కూడా చైనా చొరబాట్లే ప్రేరకమయ్యాయి. యుద్ధం మిగిశాక కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం నియమించిన హెండర్సన్‌ బ్రూక్స్‌-భగత్‌ రిపోర్టులో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టడం నెహ్రూను తీవ్రంగా కుంగదీసింది. అదే సమయంలో అంతర్జాతీయంగా కూడా భారత్‌ తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ మాత్రం సన్నద్ధత లేని సైన్యంతో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో యుద్ధానికి దిగడం ఆత్మహత్యా సాదృశ్యమని తెలిసి భారత్‌ మొండిగా యుద్ధానికి దిగిందని బ్రిటిష్‌ పత్రికలు విమర్శించాయి. నిజానికి యుద్ధ సమయంలో భారత్‌ అమెరికా వైమానిక సాయాన్ని కోరినా కెన్నడీ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. చైనా చేసిన నమ్మకద్రోహం, నెహ్రూ విదేశాంగ విధానాల విఫలమవడంపై పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కుంగుబాటుతోనే యుద్ధం జరిగిన రెండేళ్లకు 1964లో నెహ్రూ కన్నుమూశారు.

ఇండో చైనా యుద్ధం భారత్‌‌ చాలా గుణపాఠాలే నేర్పింది. దేశ పాలకులు, సైన్యం సన్నద్ధత సంగతి పక్కనపెడితే ఆర్థిక భారంతో అస్థిరంగా ఉన్న దేశానికి యుద్ధం కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. పరువు కోల్పోయే పరిస్థితిలో నాటి ప్రధాని నెహ్రూ అమెరికా వైమానిక సాయం కోసం ఆర్ధించినా ఫలితం లేకపోయింది. చైనాతో యుద్ధానికి నెహ్రూ నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్‌ ప్రయత్నాలు సత్ఫలితానివ్వలేదు. 1962 యుద్ధ సమయంలో భారత్‌తో మిశ్రమ సంబంధాలను కొనసాగించిన పాకిస్తాన్‌ తర్వాతి కాలంలో చైనాకు ఆప్త దేశంగా మారిపోయింది. సోవియట్‌ యూనియన్‌తో రాసుకుపూసుకు సాగిన భారత్‌-రష్యా సంబంధాలపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అలీనోద్యమానికి కృషి చేసిన నెహ్రూ ఓ దశలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధ సమయంలో భారత్‌ సాయం కోసం అర్ధించినా అమెరికా సహజబుద్ధిని ప్రదర్శించింది. యుద్ధ సమయంలో వైమానిక దళాలను వినియోగించడానికి అవసరమైన ఇంధనం, ఎయిర్‌బేస్‌లు లేకపోయినా చైనా గెలవడానికి ఇలాంటి సమాచార లోపం కూడా కారణమైంది. చైనా బలగాల ముప్పెట దాడితో ఉక్కిరిబిక్కిరైన భారత్‌ వైమానిక దళాల సాయం కోసం అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీకి లేఖలు కూడా రాశారు. 12స్క్వాడ్రన్ల ఫైటర్‌ జెట్లను, ఆధునిక రాడార్‌ వ్యవస్థను పంపాలని అర్దించారు. చైనా బలగాలను అడ్డుకోడానికి ఫైటర్‌ జెట్లతో పాటు భారత పైలెట్లు శిక్షన పొందే వరకు అమెరికా పైలట్లను కూడా పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే కెనడీ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది. యుద్ధ సమయంలో క్యూబన్‌ మిస్సైల్‌ చిక్కుల్లో ఉన్న అమెరికా భారత్‌కు సాయం చేయడానికి నిరాకరించింది. ఫలితంగా అమెరికాతో సంబంధాలు కూడా దెబ్బతినడం మొదలైంది. అయితే చైనాతో యుద్ధ సమయంలో భారత్‌ విజ్ఞప్తి అమెరికా నుంచి 50లక్షల డాలర్ల విలువైన ఆటోమెటిక్‌ ఆయుధాలను పంపినట్లు 1962లో టైం వంటి పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. వీటిల్లో హెవీ మోర్టార్లు, లాండ్‌మైన్స్‌, సి-130 హెర్క్యులెస్‌ ట్రాన్స్‌పోర్టర్లతో పాటు సాంకేతిక సిబ్బందిని కూడా అమెరికా పంపిందని వార్తలు వచ్చాయి. ఇక బ్రిటన్‌ బ్రెన్‌, స్టెన్‌ గన్లతో పాటు 150టన్నుల ఆయుధాల భారత్‌కు పంపిందని, ఆరు సరకు రవాణా విమానాలను కెనడా పంపించిందని, ఆస్ట్రేలియా కూడా భారీగా సహకరించిందని చెబుతారు. వీటి సంగతెలా ఉన్నా చైనా సైన్యాన్ని తిప్పికొట్టడానికి భారత్‌కు అవసరమైన ఫైటర్‌ జెట్లను పంపకపోవడం యుద్ధంలో ఓటమికి కారణమైంది.

యుద్ధానికి దారి తీసిన సంఘటనలు

మార్చు

పర్యవసానాలు

మార్చు

1962 యుద్ధం దేశంపై పెనుప్రభావాన్నే చూపించింది. యుద్ధం చేసిన గాయం నుంచి కోలుకోడానికి భారత జాతికి చాలా కాలమే పట్టింది. విధానపరమైన వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన నేతలపై పడింది. సోవియట్‌ యూనియన్‌తో స్నేహం, అపత్కాలంలో అమెరికా వైఖరితో కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డారని చెబుతారు. ద్వైపాక్షిక సంబంధాలన మెరుగుపరుచుకునేందుకు చైనాతో హిందీ చీనీ భాయి భాయి అంటూ స్నేహ హస్తం చాచినా అది చేసిన నమ్మకద్రోహం నెహ్రూను కలిచివేసింది. యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్‌, చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారు. నిజానికి దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి, గాంధీ-నెహ్రూల రాజకీయ వారసత్వానికి ఎదురులేకుండా చూడాలనుకున్న నెహ్రూ కలలు కూడా చైనా యుద్ధంతో కల్లలయ్యాయి. తన వారసురాలిగా ఇందిరాగాంధీకి సుస్థిర స్థానాన్ని ఏర్పరచాలనుకున్న నెహ్రూ ఆశలు నెరవేరకుండానే కన్నుమూయాల్సి వచ్చింది.ఆ తర్వాతి కాలంలో అది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు సైతం దారి తీసింది. నెహ్రూ చివరి దశలో లాల్‌ బహదూర్‌ శాస్త్రితో విభేదాలకు కూడా కారణమైంది. ఇందిరను రాజకీయ వారసురాలిగా చేయాలనుకున్న నెహ్రూ వైఖరితో మనస్తాపం చెందిన శాస్త్రి సొంత బలం పెంచుకునే వరకు వెళ్లింది. నిజానికి 1962 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతూ వచ్చింది. అప్పటికే దేశంలో కుంభకోణాలు వెలుగుచూడటం, కమ్యూనిస్టు పోరాటాలు ఉధృతమవ్వడం, సోషలిస్టు ఉద్యమాలు, భారతీయ జన సంఘ్‌ ఆవిర్భావంతో కాంగ్రెస్‌ వన్నె తగ్గూ వచ్చింది. చివరకు నెహ్రూ మరణం తర్వాత వారసుల సమస్య తలెత్తినపుడు ప్రధాని పదవిని త్యాగం చేసేంత సాధువును కాదంటూ లాల్‌ బహదూర్‌ శాస్త్రి ధిక్కార స్వరం వినిపించే వరకు వెళ్లడానికి 1962 పరిణామాలు కూడా కారణం కావొచ్చు. ఓ వైపు యుద్ధం వల్ల కలిగిన అవమానం మరోవైపు సొంతపార్టీ నేతల ధిక్కారం, కుటుంబానికి వారసత్వం దక్కదనే ఆందోళన నెహ్రూను తీవ్రంగా కలిచివేసిందని కొందరు చరిత్ర కారుల అభిప్రాయం. అదే సమయంలో పార్లమెంటరీ సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించిన ఇందరి వైఖరి కూడా నెహ్రూ మనస్తాపానికి కారణమని చెబుతారు.

నెహ్రూ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి అలీనోద్యమానికి కట్టుబడి ఉంటూనే దేశ భద్రతకు పెద్దపీట వేశారు సోవియట్‌ యూనియన్‌ సహకారంతో దేశ రక్షణ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభించారు. చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌, పాకిస్తాన్‌ల మైత్రీ నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెరంచారు. 1962 యుద్ధంలో భారత ఓటమి, చైనాతో స్నేహం ఇచ్చిన ధైర్యం దాయాదీ దేశం పాకిస్తాన్‌ భారత్‌ చొరబాట్లకు తెగించింది. దేశ విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలను కాలరాసి భారత భూభాగాల్లో చొరబాట్లను ప్రారంభించింది. కశ్మీర్‌ ఆక్రమణే ధ్యేయంగా గిరిజన తెగల్ని ఊసిగొల్పడం ప్రారంభించింది. జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ చొరబాట్లు పెరగడంతో వాటిని తిప్పి కొట్టాలని లాల్‌బహదూర్‌ శాస్త్రి సైన్యాన్ని ఆదేశించాల్సి వచ్చింది. 1965 సెప్టెంబరు 20లో పాక్‌ సైన్యం దుందుడుకు వైఖరితో కశ్మీర్‌లో ఘర్షణల్ని ప్రేరేపించింది. దీంతో ఎల్‌ఓసి వెంబడి భారత్‌ సైన్యాన్ని మోహరించింది. పంజాబ్‌ సరిహద్దుల్లో ఇరువైపులా భీకర కాల్పులుజరిగాయి. సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో పాక్‌ పైచేయి సాధించిన కశ్మీర్‌‌లో కీలకమైన హాజీపూర్‌ పోస్టును భారత్‌ సైన్యం స్వాధీనం చేసుకుందిి. పాక్‌తో యుద్ధం కొనసాగుతుండగానే భారత్‌పై దాడికి చైనా మరోమారు సిద్ధమైంది. చైనా సరిహద్దుల్లో భారత్ ఆయుధాలను, ట్యాంకర్లను మోహరించిందని, వాటిని తొలగించకపోతే దాడికి దిగాల్సి ఉంటుందని లేఖరాసింది. అయితే శాస్త్రి సర్కారు వాటిని లెక్కచేయలేదు. చైనాకు గట్టి బుద్ధి చెప్పాలనే నిర్ణయంతో ఆరోపణల్ని తిప్పికొట్టింది. చైనా దురాక్రమణకు సిద్ధమైతే త్యాగాలకు సిద్ధపడాలని శాస్త్రి సైన్యానికి పిలుపునిచ్చారు. సరిహద్దుల్లోకి చొరబడితే చైనా సైన్యంతో తాడేపేడో తేల్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత చైనా వెనక్కు తగ్గింది. అయితే ఈ యుద్ధంలో భారత్‌-పాక్‌లకు చెందిన 8వేల మమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు 1965 సెప్టెంబరు 23న ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరుదేవాలు కాల్పుల విరమణను ప్రకటించాయి. పాక్‌, చైనాలతో అనుసరించాల్సిన వైఖరిపై కఠినంగా వ్యవహరించిన లాల్‌ బహదూర్‌శాస్త్రి దేశ రక్షణ విషయంలో ఏనాడు రాజీ వైఖరిని ప్రదర్శించలేదు.

ఇండో-చైనా యుద్ధం జరిగి యాభై ఏళ్లు పూర్తైనా సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదు. తూర్పు, పశ్చిమ సెక్టార్‌లతో పాటు, హిమాలయ పర్వత శ్రేణుల్లో 3వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దు సమస్యల్ని ఇరుదేశాలు పరిష్కరించుకోలేకపోయాయి. టిబెట్‌ సమస్యను కొలిక్కి తీసుకురాలేకపోయాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సహా వేల కిలోమీటర్ల భూభాగం విషయంలో తలెత్తిన వివాదాలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. భారత్‌-చైనాల యుద్ధానికి యాభై ఏళ్లు పూర్తైన తర్వాత కూడా ఈ పరిస్థితికి చాలా కారణాలే ఉన్నాయి. భారత్‌-చైనాలు పరస్పర అపనమ్మకంతోనే బంధాన్ని కొనసాగిస్తున్నాయి. లడఖ్‌, ఆక్సాయ్‌చిన్‌లలో చైనా భూభాగాలుగా గుర్తించడానికి నాటి ప్రధాని నెహ్రూ 1960లోనే అంగీకరించారని చైనా ఇప్పటికీ వాదిస్తోంది. చౌ ఎన్‌లై, నెహ్రూల మధ్య జరిగిన చర్చల్లో సెక్టార్ల వారీగా సమస్యను పరిష్కరించుకోడానికి అంగీకరించిన భారత్‌ అందుకు కట్టుబడలేదని ఆరోపిస్తోంది. 1962 యుద్ధం తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. 1980లో చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ విషయంలో ఇరుదేశాలు పట్టువీడకపోవడంతో అవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి. చివరకు సెక్టార్ల వారీగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకునేందుకు 1993లో భారత్‌ అంగీకరించినా అవి కూడా ముందుకు కదల్లేదు. 2005లో చైనా వైఖరి మళ్లీ మొదటికి రావడంతో ఈ ప్రయత్నాలు కాస్త నిలిచిపోయాయి.

ఇక భారత్‌-చైనా సంబంధాల్లో మరో ప్రధాన సమస్య టిబెట్‌, టిబెట్‌ శరణార్ధులకు భారత్‌ ఆశ్రయమివ్వడాన్ని మొదట్నుంచి తప్పుపడుతున్న చైనా, భారత్‌ను శత్రుదేశంగా భావించే వరకు వెళ్లింది. 1958లో టిబెట్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం, దలైలామాకు భారత్‌ ఆశ్రయమివ్వడంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరకు భారత్‌లో టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోడానికి అంగీకరించడం చైనాకు మింగుడుపడలేదు. దీనికితోడు టిబెట్‌ వేర్పాటు వాదులకు సిఐఏ సహకారంతో భారత్‌ ఆయుధాలు, ఆర్థిక సహకారం అందిస్తోందనే అపోహ చైనాలో బలపడింది. 1962లో భారత్‌పై చైైనా దాడి చేయడానికి ఇది కూడా ఓ కారణమని చరిత్రకారుల అభిప్రాయం. భారత్‌లో ఏర్పాటైన టిబెట్‌ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకపోయినా, దానిని భారత ప్రభుత్వం గుర్తించకపోయినా చైనా అనుమానాలు మాత్రం తీరలేదు. ఇక చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు 1950లోనే మొదలయ్యాయి. మొదట్లో చైనా నుంచి కోల్‌కత్తా మీదుగా మీదుగా టిబెట్‌కు ఆహార పదార్దాలను దిగుమతి చేసుకోడానికి భారత్‌ అనుమతించింది. 1954లో చేసుకున్న పంచశీల సూత్రాల్లో ప్రధానంగా చైనాకు చెందిన టిబెట్‌ రీజియన్‌-భారత్‌ల మధ్య వాణిజ్యం, సహకారం కూడా ఉంది. వాణిజ్య లావాదేవీల విలువతో సంబంధం లేకుండా పరస్పర సహకారం కోసమే ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే 1961 నాటికి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భారత్‌ నిరాకరించింది. దీనికి కారణం టిబెట్‌ ప్రాంతంలో తలెత్తిన ఉద్రిక్తతలతో పాటు పట్టు కోసం చైనా చేస్తోన్న ప్రయత్నాలు భారత్‌కు ముప్పుగా పరిణమిస్తాయనే ఆందోళనతో ఒప్పందాలను కొనసాగించడానికి నిరాకరించింది. అయితే చైనా మాత్రం టిబెట్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేస్తోన్న అభివృద్ధి పనులపై వ్యతిరేకతతోనే భారత్‌ వాణిజ్యానికి నిరాకరించిందని ఆరోపించింది. ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య 60బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. 2015నాటికి వంద బిలియన్‌ డాలర్లకు చేరొచ్చని అంచనా.అయితే ఇందులో ఎక్కువగా చైనా దిగుమతులు ఉండటం ఆ దేశానికి లబ్ధి చేకూరుస్తోంది. భారత్‌ మాత్రం ఐటి, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికే పరిమితమవుతోంది.

1962 యుద్ధంతో భారత్‌కు కొంత మేలు కూడా జరిగింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సమయంలో సోవియట్‌ యూనియన్‌తో భారత్‌ బంధం బలపడింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తులుగా ఎదిగేందుకు భారత్‌, చైనాలు పోటీ పడటం కూడా అప్పుడే మొదలైంది. అంతులేని మానవ వనరులున్న రెండు దేశాలు పాశ్చాత్య దేశాలకు దీటుగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 1960 తర్వాత సోవియట్‌-చైనా సంబంధాలు బలహీనమవడం, ఆ తర్వాత భారత్‌తో చైనా యుద్ధం ఆ దేశ విస్తరణ కాంక్షను బయటపెట్టింది అదేసమయంలో మాస్కో-ఢిల్లీల మధ్య మైత్రి బలపడింది. అదే సమయంలో చైనా-అమెరికాలు విభేదాలను పక్కనపెట్టి సహకరించుకోవడం మొదలైంది. సోవియట్‌ యూనియన్‌ పతనాననంతరం సమీకరణల్లో గణనీయమైన మార్పు వచ్చింది. అమెరికా పోటీదారుగా చైనా అవతరించే ప్రమాదం ఉందని గ్రహించి ఆ దేశం భారత్‌తో మైత్రిని కోరుకుంది. యుద్ధం తర్వాత విదేశీ సంబంధాల్లో భారత్‌కు ఎన్నో అవకాశాలు కలిసొచ్చినా అన్ని దేశాలతో మైత్రిని కొనసాగించాలనే విధానానికి కట్టుబడింది. 50ఏళ్ల కిందటి యుద్ధం తర్వాత ఎన్నో సమీకరణలు మారిపోయినా ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం మాత్రం కుదరలేదు.

1962 అక్టోబరు 20 సరిహద్దుల్లో కంచె వేస్తున్న భారత బలగాలపై చైనా మెరుపు దాడి చేసింది. 80వేల మంది సైన్యంతో తూర్పు, పశ్చిమ సెక్టార్లపై విరుచుకుపడింది. ఇంతకీ కయ్యానికి కాలు దువ్వడానికి కారణమేంటో తెలుసా.......సరైన ఆయుధాలు, సన్నద్దత లేని సైన్యం నిస్సహాయ స్థితిలో పోరాడటానికి కారణం చైనా విస్తరణ వాదమే ప్రధాన కారణం. దీనికి తోడు చైనా అధ‌్యక్షుడిగా అంతులేని అధికారాన్ని అనుభవించిన మావోజెడాంగ్‌ ప్రాబల్యం క్రమేణా తగ్గుముఖం పట్టడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు యుద్ధాన్ని తెరపైకి తెచ్చారని చెబుతారు. అప్పటికే కమ్యూనిస్టుల అరాచకాలు, నిర్బంధాలతో విసిగిపోయిన ప్రజలు మావోకు వ్యతిరేకంగా ఏకమవడం ప్రారంభించారు. కమ్యూనిస్టు దేశంలో ఆ పార్టీ రెండో స్థానానికి పడిపోవడంతో మావోకు అధికారం కోల్పోతాననే భయం పట్టుకుంది. పార్టీపై, ప్రజల్లో పట్టు నిలబెట్టుకోవా లనుకున్నారు. ఈ విషయాలు సాక్షాత్తూ నాటి చైనా యుద్ధంలో వ్యూహకర్తగా ఉన్న వాంగ్ జిసి బయటపెట్టారు. విదేశీ విధాన సలహా కమిటీలో సభ్యుడైన వాంగ్‌ జిసి భారత్‌-చైనాల యుద్ధానికి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి చేదు జ్ఞాపకాన్ని బయటపెట్టారు. ఇండో-చైనా యుద్ధం విషాదంతో కూడిన నాటకమని అసలు సంగతి చెప్పేశారు. వ్యవసాయాధారిత దేశంగా ఉన్న కమ్యూనిస్టు చైనాను పారిశ్రామీకరణ, ఆధునికతల వైపు పరుగులెత్తించాలని గ్రేట్‌ లీఫ్ ఫార్వార్డ్‌ ఉద్యమాన్ని చేపట్టి మావో జెడాంగ్‌ చేతులు కాల్చుకోవడంతో దేశం దృష్టిని మరల్చేందుకు భారత్‌తో యుద్ధానికి దిగినట్లు ప్రకటించారు. యుద్ధంలో చైనా సాధించిన విజయంతో సరిహద్దుల మీద భారత్‌కున్న హక్కులకు తెరపడిందని.. దీర్ఘకాల శాంతికి దారి తీసిందంటూ.. చైనాకు చెందిన రాజకీయ, వ్యూహ, విశ్లేషకుల అభిప్రాయాలతో వాంగ్‌జిసి విభేదించారు. తన స్థానంపై తలెత్తిన భయంతోనే మోవోజెడాంగ్ భారత్‌తో యుద్ధానికి ఆదేశించారని అని వాంగ్ ప్రకటించారు. గ్రేట్ లీఫ్ ఫార్వార్డ్ విఫలం చెందిన మూడు సంవత్సరాల తర్వాత 1962లో మావోజెడాంగ్ అధికారం, ఆధిక్యత కోల్పోయి ద్వితీయ స్థానానికి పడిపోయారు. ఆ సమయంలో తిరుగుబాటు పట్ల మావో ఆసక్తితో ఉన్నారని వాంగ్ గుర్తు చేశారు. గ్రేట్ లీఫ్ ఫార్వార్డ్ ఉద్యమంలో భారీగా ప్రజలు మృతి చెందడంతో జెడాంగ్ స్థానం బలహీన పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉన్నత స్థానం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినా.. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీపై అధికారాన్ని కలిగి ఉండటం జెడాంగ్‌కు కలిసొచ్చిందన్నారు. నాటి టిబెట్ కమాండర్‌ను పిలిపించి యుద్ధంలో గెలవగలమనే నమ్మకం ఉందాని వాకబు చేయడం., దానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ రెజిమెంట్‌కు కమాండర్‌గా ఉన్న జాంగ్ సునాయాసంగా గెలవగలమని సమాధానమివ్వడం మావోకు ఉత్సాహానిచ్చిందని అని వాంగ్ జిసి అసలు రహస్యాన్ని బయటపెట్టారు.

ఓ వైపు చైనా ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్‌ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని భారత పాలకులు పసిగట్టలేకపోయారు. టిబెట్‌ వ్యవహారంలో 1958 నుంచే విభేదాలు మొదలైనా వాటిని పరిష్కరించడంలో భారత్‌ విఫలమైంది. ఇక సైన్యాన్ని తరలించడానికి వీలుగా టిబెట్‌లో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరిగిన నిఘా వర్గాలు గుర్తించలేకపోయాయి. వీటన్నంటికంటే చైనా యుద్ధానికి సన్నద్దమవుతున్న సమయంలో దేశ పాలకులు విదేశాల్లో చక్కర్లు కొట్టారు. ఇదేదో రాజకీయ నేతలు చేసిన విమర్శ కాదు నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి ఆర్‌కె.కల్హా వెల్లడించిన చేదు వాస్తవం. యుద్ధ మేఘాలు ముంచుకొచ్చిన సమయంలో రక్షణ మంత్రి వికె.కృష్ణమీనన్‌ 1962 సెప్టెంబరు 17 నుంచి 30వరకు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభల్లో పాల్గొనడానికి వెళ్లిపోయారు. ఇక ప్రధాని నెహ్రూ 1962 సెప్టెంబరు 8న కామన్‌వెల్త్‌ దేశాల ప్రధానుల సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిపోయారు. అట్నుంచి అటే పారిస్‌, లాగోస్‌, అక్రాలలో పర్యటించి అక్టోబరు2న స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి అక్టోబరు 12న కొలొంబో పర్యటనకు వెళ్ళి 16న తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఇక చీఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ కౌల్‌ వ్యక్తిగత సెలవుపై కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిపోయారు. ఇక డైరెక్టర్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియన్‌ విక్రాంత్‌ వ్యవహారాల్లో మునిగిపోయారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన జాప్యానికి భారత్‌ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. పాలనా నేతలు, ఆర్మీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్టోబరు20న చైనా దండెత్తినపుడు భారత సైన్యం నిస్సహాయంగా లొంగిపోవాల్సి వచ్చింది.

భారత్‌పై చైనా దాడికి కారణాలేమైనా చైనా వైఖరిని మాత్రం సందు దొరికినపుడల్లా బయటపెడుతూనే ఉంది. టిబెట్‌ విషయంలో భారత్ వైఖరిపై ఉన్న అక్కసుతో నెహ్రూకు బుద్ధి చెప్పాలని మావో భావించాడని నాటి చైనా ప్రధాని లీ షావో వెల్లడించారు. 1962యుద్ధం భారత్‌కు బుద్ధి చెప్పడానికేనని స్వీడన్‌ రాయబారితో కూడా లీ వ్యాఖ్యనించడం ఇందుకు ఉదాహరణ. భారత్‌ చైనాల మధ్య ప్రధాన సమస్య మెక్‌మోహన్‌ లైన్‌కు సంబంధించింది కాదని టిబెట్‌ విషయంలోనే తమ అభ్యంతరాలని 1964లో నేపాలీ రాయబార బృందంతో మావో జెడాంగ్‌ స్పష్టం చేశారు. హిమాలయాల విషయంలో తమకెలాంటి సందే‍హం లేదని, సరిహద్దుల సమస్యను పరిష్కరించాలన్నదే తమ అభిమతమని మావో రష్యాతో కూడా స్పష్టం చేసినట్లు రక్షణ శాఖ నివేదికలు వెల్లడించాయి. చైనాకు వ్యతిరేకంగా భారత్‌‌ను ముందుంచి రష్యా, అమెరికాలు దాగుడుమూతలాడుతున్నాయనే అనుమానం కూడా 1962 యుద్ధానికి దారితీసిందని రక్షణ రంగ నిపుణుల అంచనా.కెన్నడీ, కృశ్చేవ్‌లను కట్టడి చేయాలంటే భారత్‌కు బుద్ధి చెప్పడమే మార్గమని మావో భావించినట్లు చెబుతారు.

సాంస్కృతిక జీవనంలో ఈ యుద్ధం

మార్చు

ఈ యుద్ధం గురించి బ్రిగేడియర్ జాన్ డాల్వి రాసిన అత్యంత వివాదాస్పదమైన యుద్ధ స్మారక పుస్తకం, హిమాలయన్ బ్లండర్. యుద్ధ కారణాలు, పర్యవసానాలు, పరిణామాలను ఈ పుస్తకం వివరిస్తుంది. బ్రిగేడియర్ డాల్వి భారత సైన్యంలో పనిచేశాడు. యుద్ధం గురించి ప్రత్యక్ష సాక్షి కథనం, ఈ పుస్తకం. ప్రచురించిన తర్వాత, భారత ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది.[7]

ఇవి కూడా చూడండి

మార్చు

నాథూ లా, చో లా ఘర్షణలు

మూలాలు

మార్చు
  1. Webster's Encyclopedic Unabridged Dictionary of the English language: Chronology of Major Dates in History, page 1686. Dilithium Press Ltd., 1989
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Garver అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. H.A.S.C. by United States. Congress. House Committee on Armed Services — 1999, p. 62
  4. War at the Top of the World: The Struggle for Afghanistan, Kashmir, and Tibet by Eric S. Margolis, p. 234.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 The US Army [1] Archived 2012-02-05 at the Wayback Machine says Indian wounded were 1,047 and attributes it to Indian Defence Ministry's 1965 report, but this report also included a lower estimate of killed.
  6. http://books.google.com/books?id=PsoDGLNmU30C&pg=PA188&lpg=PA188&dq=sino+indian+war+wounded&source=web&ots=goq1pcQc50&sig=FOQDKdciOn6VAd3fOCInHKhOu3U&hl=en&sa=X&oi=book_result&resnum=6&ct=result
  7. Dutta, Sujan (6 October 2012). "Himalayan Blunder (Part II) - Air chief revives China war and Kargil debates". The Telegraph. Calcutta. Retrieved 10 June 2013.