2022 యాంగ్‌ట్సే ఘర్షణ

2022 నాటి యాంగ్‌ట్సే ఘర్షణ భారత సైన్యానికి, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కీ మధ్య, 2022 డిసెంబర్ 9 నాటి రాత్రి అరుణాచల్ ప్రదేశ్‌, తవాంగ్‌లోని యాంగ్‌ట్సే ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట పరస్పరం ఎదురుపడినపుడు జరిగింది. బౌద్ధ క్షేత్రం చుమీ గ్యాట్సే జలపాతానికి సమీపంలో ఉన్న సరిహద్దు రిడ్జ్‌లైన్‌లోని స్థానాలకు సమీపంలో రెండు సైన్యాలు మేకులు పొదిగిన బడితెలతో, ఇతర కొట్లాట ఆయుధాలతో ఒకరినొకరు ఎదుర్కొనడంతో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. 2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణ తరువాత, సరిహద్దుల వద్ద రెండు సైన్యాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణగా దీన్ని గుర్తించారు. ఇందులో 20 మంది భారతీయ సైనికులు మరణించగా, చైనా వైపు మరణాల సంఖ్య ఎంత అనేది ఇదమిత్థంగా లెక్క తెలియలేదు.

2022 యాంగ్‌ట్సే ఘర్షణ
భారత చైనా సరిహద్దు వివాదంలో భాగము

తవాంగ్ లో యాంగ్‌ట్సే ప్రాంతం మ్యాపు. ఊదా రంగు లోనిది వాస్తవాధీన రేఖ. సరిహద్దులో శిఖరశ్రేణి వద్ద, 4,700 metres (15,400 ft) ఎత్తున ఘర్షణ జరిగింది.[1]
తేదీ2022 డిసెంబరు 9
ప్రదేశంవాస్తవాధీన రేఖ, తవాంగ్ లోని యాంగ్‌ట్సే ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్
27°46′37″N 92°01′18″E / 27.77694°N 92.02167°E / 27.77694; 92.02167
రాజ్యసంబంధమైన
మార్పులు
None
ప్రత్యర్థులు
India Indiaచైనా China
పాల్గొన్న దళాలు
India Indian Army చైనా People's Liberation Army of China
ప్రాణ నష్టం, నష్టాలు
34 మంది గాయపడ్డారు (కనీసం ఆరుగురు తీవ్రంగా)[2][3]40 మంది గాయపడ్డారు (సుమారు)[2]

ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి స్వతంత్ర పరిశోధకులు ఇచ్చిన నివేదికల ప్రకారం 300 మంది చైనా సైనికులు, కొత్తగా నిర్మించిన సరిహద్దు గ్రామం నుండి సుమారు 4,700 metres (15,400 ft) ఎత్తున ఉన్న రెండు భారత అవుట్‌పోస్టుల వైపు కదులుతున్నట్లు రుజువులను కనిపించాయి. భారత ప్రభుత్వం ప్రకారం, ఇది ఘర్షణకు దారితీసింది. తమ ఫార్వర్డ్ బేస్ నుండి అక్కడికి బలగాలను పంపాల్సిన అవసరం ఏర్పడింది. [1] మేకులు పొదిగిన బడితెలు, ఇతర కొట్లాట ఆయుధాలను ఈ ఘర్షణలో ఉపయోగించారు. దీనివల్ల ఇరువైపులా పెద్ద సంఖ్యలో గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఆరుగురు భారత సైనికులను వైద్య చికిత్స నిమిత్తం గౌహతికి తరలించారు. చైనా వైపున మృతుల సంఖ్య అధికారికంగా వెల్లడి కాలేదు. తమ సైనికులు తమ సరిహద్దులో కస్టమ్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో భారత సైనికులు సరిహద్దును అతిక్రమించారని చైనా PLA పేర్కొంది. దీనిని పరిశోధకులు ధృవీకరించలేదు.[1]

యాంగ్‌ట్సే ప్రాంతం, తాజా సంఘటనతో పాటు అంతకు ముందు జరిగిన అనేక ఘర్షణలకు స్థానంగా ఉంటూ వచ్చింది. వివాదాస్పదమైన పన్నెండు సరిహద్దు ప్రాంతాలలో ఒకటిగా దీన్ని 1995 లో రెండు దేశాలూ గుర్తించాయి. ఈ సరిహద్దు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో భాగంగా ఉంది, ఇది టిబెటన్ బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. అరుణాచల్ ప్రదేశ్‌ తమ దక్షిణ టిబెట్‌లో భాగమని అంటూ చైనా చేసే వాదనలో భాగంగా ఈ ప్రాంతం కూడా తనదేనని చైనా అంటూ ఉంటుంది.

చైనా-భారత సరిహద్దు, భౌగోళికం మార్చు

మెక్‌మహాన్ రేఖ మార్చు

సరిహద్దు తూర్పు రంగం లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) అనేది సుమారుగా, 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్‌లు అంగీకరించిన మెక్‌మహాన్ రేఖ. టిబెట్ స్వతంత్ర శక్తి కాదనే కారణంతో చైనా ఈ రేఖను "చట్టవిరుద్ధం" అని పరిగణించినప్పటికీ, దాన్ని వాస్తవాధీన రేఖగా భావించి, దానికి కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తుంది.[4] అయితే, ఈ రేఖను భూమిపై ఎన్నడూ గుర్తించలేదు. 1914 లో చేసిన అరకొర సర్వేయింగులో అనేక ప్రాంతాలు అనిశ్చితంగా ఉండిపోయాయి. ఇది, ఇరుపక్షాల మధ్య వివాదానికి తెరతీసింది. [5] [6] "దక్షిణ టిబెట్" అని తాను చెప్పుకునే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై, చైనా తనకు హక్కు ఉన్నట్లు వాదిస్తుంది. ఈ వాదన 6వ దలైలామా జన్మస్థలం అయిన తవాంగ్ జిల్లాపై మరింత బలంగా ఉంది. నిజానికి ఆ సమయంలో తవాంగ్ ప్రాంతం, కొన్ని రకాలుగా టిబెట్ ఆధిపత్యంలో ఉండేది. కానీ మెక్‌మహాన్ రేఖ ఒప్పందంపై సంతకం చేసే క్రమంలో టిబెట్ దానిని వదులుకుంది.[7]

యాంగ్‌ట్సే పీఠభూమి, పరిసరాలు మార్చు

యాంగ్ట్సే, ఘర్షణ జరిగిన ప్రాంతం, ముఖ్యంగా LACకి ఆనుకుని ఉన్న పీఠభూమి. ఇది తవాంగ్ జిల్లాలో పర్వతాలు, దట్టమైన అడవులు కలిగిన ప్రాంతంలోని మాగో-చునా అనే పెద్ద ప్రాంతంలో భాగం.[8] 14,000 feet (4,300 metres) నుండి 17,000 feet (5,200 metres) వరకు ఎత్తులో ఉన్న ఎత్తైన పర్వత శిఖరాల శ్రేణి యాంగ్‌ట్సే ఉత్తరాన సరిహద్దుగా ఉంది. రిడ్జ్‌లైన్, దాని శిఖరం 17,500 feet (5,300 metres) కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది, దాదాపు నైరుతి-ఈశాన్య దిశలో తులంగ్ లా పర్వత మార్గంలో నడుస్తుంది. ఇక్కడి నుండి, తవాంగ్ ప్రాంతానికి గేట్‌వే లాంటి సెలా పాస్ కు వెళ్లే రహదారులన్నిటితో సహా చుట్టుపక్కల చాలా ప్రాంతాలను పరిశీలించవచ్చు. [1] [9] త్సోనా చు నది దక్షిణ టిబెట్‌లోని త్సోనా కౌంటీ గుండా ప్రవహిస్తుంది. చుమీ గ్యాట్సే జలపాతం సమీపంలోని యాంగ్‌ట్సే రిడ్జ్‌లైన్‌ను కోసుకుంటూ తవాంగ్‌లోకి ప్రవేశిస్తుంది. [8] [9] 2022 డిసెంబరు నాటికి, యాంగ్ట్సే, భారత చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న 25 సరిహద్దు ప్రాంతాలలో ఒకటి. రెండు దేశాలూ ఈ వివాదాన్ని గుర్తించాయి. [10]

ఘర్షణ మార్చు

యాంగ్ట్సేలోని LAC వెంట ఘర్షణ చైనా PLA చేపట్టిన చొరబాటుతో మొదలైంది. సంఘటనకు దారితీసిన సమయంలో దాని పదాతి దళ సైనికుల బృందాన్ని కొత్తగా నిర్మించిన సరిహద్దు గ్రామమైన టాంగ్వు నుండి తులుంగ్ లా శిఖరం వద్ద ఉన్న శిబిరం వైపు దారితీసే రహదారి పైకి తరలించింది.[1][11] అక్కడికి చేరుకున్న తర్వాత, సుమారు 300 మంది సైనికులు మేకులు పొదిగిన బడితెలు, ముడి వేసిన తాళ్ళు, టేజర్ గన్‌ల వంటి ఆయుధాలు పట్టిన చైనీయులు, దాదాపు 4,700 metres (15,400 ft) ఎత్తున ఉన్న భారతదేశపు రెండు ఫార్వర్డ్ అవుట్‌పోస్ట్‌లకు ఒక కిలోమీటరు దూరంలోకి చేరుకున్నారు. [1] కాన్‌బెర్రా -ఆధారిత థింక్ ట్యాంక్ ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్వతంత్ర పరిశోధకులు, ఈ సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత రూపొందించిన ఈ ప్రాంతపు ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో రెండు భారతీయ అవుట్‌పోస్టుల వైపు చైనీయులు ముందుకు సాగినట్లు రుజువులను కనుగొన్నారు.[1]

2022 డిసెంబర్ 9 నాటి తెల్లవారుజామున భారతీయ స్థానాల వైపు చైనీయుల చొరబాటు, సరిహద్దు రిడ్జ్‌లైన్‌లో తమ అవుట్‌పోస్ట్ లైన్‌ను నిర్వహిస్తున్న భారతీయులతో ఘర్షణకు దారితీసింది. చివరికి ఇరుపక్షాలు కొట్లాట ఆయుధాలతో పరస్పరం చేయి చేసుకున్న సంఘటన జరిగింది.[12] ఘటన మొదలైన అరగంటలో ప్రక్కనే ఉన్న ఫార్వర్డ్ స్థావరం నుండి భారత బలగాలు వచ్చాయి. పోరాటం ఒక గంట పాటు సాగి ఆ తరువాత ఇరి ఉదళాలూ వనక్కి తగ్గడంతో ఆగింది.[12] సంఘటన తర్వాత వివాదాన్ని పరిష్కరించడానికి 2022 డిసెంబరు 11 న ఇరుపక్షాల స్థానిక ఆర్మీ కమాండర్లు తమ సరిహద్దు ప్రతినిధుల మధ్య బుమ్ లా పాస్ వద్ద జండా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.[13][11]

పోరాట పర్యవసానంగా రెండు వైపులా అనేక మందికి గాయాలయ్యాయి. 2020 జూన్‌లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత, సరిహద్దులో భారత చైనా సైన్యాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణగా ఈ సరిహద్దు సంఘటనను గుర్తించారు. [1]

మీడియా నివేదికలు మార్చు

యాంగ్ట్సేలోని ఎత్తైన ప్రదేశం పట్ల ఇఉన్న ఆకర్షణ కారణంగా చైనా, ఈ చొరబాటుకు పాల్పడిందని ఈ సంఘటనపై భారతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.[14][15][13] చైనీయులు చీకటి, దట్టమైన పొగమంచు మాటున అనేక వందల మంది సైనికులను సమీకరించి, సరిహద్దు వద్ద శిఖరాల వరుసపై, ఎత్తున ఉన్న తమ స్థావరాలలో ఉన్న దాదాపు 50 మంది భారత సైనికులను ఎదుర్కోవడానికి చైనీయులు ముందుకు కదిలారు.[11] థర్మల్ ఇమేజింగ్ పరికరాలతో చైనీయుల కదలికలను పసిగట్టిన భారతీయులు, చైనీయుల పురోగతిని కట్టడి చేయడానికి మానవ గొలుసును ఏర్పాటు చేసి సహజంగా స్పందించారు. [11] చైనీయులు ఈ ప్రాంతంపై తమకు హక్కునట్లు వాదిస్తూ, దాని నుండి భారతీయులు వైదొలగాలని డిమాండు చేయడంతో త్వరలోనే ఆ ప్రాంతంపై పెట్రోలింగ్ హక్కులపై పరస్పర మౌఖిక నిందారోపణలు మొదలయ్యాయి. అయినప్పటికీ, భారతీయులు తమ వాదనకు కట్టుబడి, ఆ స్థానం నుండి కదల్లేదు.[13] వారి మధ్య రాళ్లు రువ్వడం, ఒకరినొకరు తోసుకోవడం వంటివి జరిగి హింసకు దారితీసింది. ఈ తోపులాట జరుగుతూండగా, మొదటి పంక్తుల వెనుక నక్కి ఉన్న చైనీస్ దళం, కొట్లాట ఆయుధాలు, టేజర్ గన్‌ల వంటి ఆయుధాలతో ముందుకు తోసుకు వచ్చింది. [11] వారిని ఎదుర్కొంటున్న భారత ఫ్రంట్‌లైన్ దళాలను బలోపేతం చేయడానికి తమ కమాండ్ పోస్ట్ నుండి మరిన్ని బలగాలు వెంటనే చేరుకున్నాయి. ఇరుపక్షాలు ముష్టి యుద్ధంలో చిక్కుకోవడంతో ఘర్షణ జరిగింది. భారత సైనికులు అరగంటలో చైనా దళాన్ని భౌతికంగా తిప్పికొట్టారు. చివరికి తమ శిబిరానికి తిరిగి వెళ్ళారు. భారతీయ సైనిక వర్గాలను ఉటంకిస్తూ ప్రింట్, భారతీయుల వద్ద టేజర్ గన్‌లు లేకపోయినా, యుద్ధం కోసం "చైనీయుల వద్ద ఉన్నదంతా వారి వద్దా ఉంది, అంతకంటే ఎక్కువే" ఉందని నివేదించింది.[12]

ఒక గంట పాటు జరిగిన ఈ ఘర్షణలో ఇరువర్గాలకు అనేక గాయాలయ్యాయి, ఒక అంచనా ప్రకారం భారత్ వైపు 34 మంది గాయపడగా, దాదాపు 40 మంది చైనీయులు గాయపడ్డారు. [2] కనీసం 6 గురు భారతీయ సైనికులు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం గౌహతిలోని భారత సైన్యం యొక్క 151 బేస్ ఆసుపత్రికి తరలించారు.[3] [16] దాడి చేసిన చైనా బలగాల సంఖ్య, భారతీయ అంచనాల ప్రకారం కనిష్టంగా 200 నుండి 600 మంది వరకు ఉంది. [12] [17] ఈ సరిహద్దు ఘర్షణలో భారత సైన్యానికి చెందిన జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్, జాట్ రెజిమెంట్, సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ లు పాల్గొన్నాయి. ఈ యూనిట్లలో ఒకటి తమ డ్యూటీ కాలం పూఎర్తై వెనక్కి వెళ్ళే ప్రక్రియలో ఉంది. ఈ ఘర్షణ జరగక పోయి ఉంటే దాని స్థానంలో మరొక యూనిట్ వచ్చి ఉండేది. [18]

భారతదేశం ఆలస్యంగా ఒప్పుకుంది మార్చు

యాంగ్ట్సేలోని LAC వెంబడి 2022 డిసెంబరు 9 న భారత చైనా సైనిక దళాల మధ్య రాత్రిపూట జరిగిన ఘర్షణ వార్తను భారత అధికారులు, 2022 డిసెంబరు 12 సాయంత్రం, ఘర్షణ జరిగిన మూడు రోజుల తర్వాత, అధికారికంగా వెల్లడించారు.[16] అంతకు కొద్ది రోజుల ముందే ముగిసిన 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ సాధించిన విజయంపై ప్రధాన స్రవంతి మీడియాకు ఉన్న ఆసక్తిని తగ్గించేస్తుందనే భయంతో ఈ సరిహద్దు సంక్షోభంపై వార్తలను భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలుపుదల చేసిందని భారత భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చైనాతో సరిహద్దు ఘర్షణల నివేదికలను ప్రజలు రాజకీయ బలహీనతగా భావిస్తారనో, లేదా ప్రజలు దాన్ని అతిగా భావిస్తారనే భయంతోనో దాన్ని బయటికి రానీకుండా తొక్కి ఉంచారని మరికొందరు అన్నారు. [16]

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న భారత అధికారులు సరిహద్దు ఘటనపై క్లుప్తంగా ప్రకటన చేసారు. గాయపడిన సైనికులలో ఒకరి పరిచయస్థుడు ఘర్షణ వార్తలను ట్విట్టర్‌లో ప్రకటించి, తన ట్వీట్‌లో రాహుల్ గాంధీని, ఇతర ప్రముఖ ప్రతిపక్ష నాయకులనూ ట్యాగ్ చేశారు. ఆ ట్వీటులో మీడియా మౌనాన్ని కూడా ప్రశ్నించారు. ఆ తరువాత వెంటనే ది ట్రిబ్యూన్‌ ఈ ఘటనపై కథనాన్ని ప్రచురించింది. దానికి ఒక రోజు ముందు ఈ ఘటన గురించి మీడియా ప్రశ్నలు అడగ్గా భారత ప్రభుత్వం ఈ ఘటన జరగలేదని ఖండించింది. [16]

అధికారిక భోగట్టాలు మార్చు

తవాంగ్‌లో చైనా సైనికులు "LACని చేరుకున్నారు" అని భారత్ తన ప్రకటనలో పేర్కొంది. భారత దళాలు "దృఢమైన, ఖచ్చితమైన" ప్రతిస్పందనను చూపాయని చెప్పింది. ఫలితంగా జరిగిన ముఖాముఖి ఘర్షణ వలన రెండు వైపులా కొన్ని "కొద్దిపాటి" ప్రాణనష్టం జరిగింది. దళాలు వెనక్కి తగ్గడంతో చివరికి ఉద్రిక్త పరిస్థితి తగ్గింది. ఆ తర్వాత ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. [16]

ఈ విషయంపై ఒక రోజు తర్వాత పార్లమెంటులో చట్టసభ సభ్యులను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, యాంగ్ట్సేలోని వివాదాస్పద సరిహద్దు వద్ద భారత భూభాగాన్ని ఆక్రమించడం ద్వారా చైనా సైనికులు వివాదాస్పద సరిహద్దు యొక్క యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడంతో ఘర్షణ చెలరేగిందనీ, దాన్ని భారత సైన్యం ఎదుర్కొందనీ అన్నాడు. [19] సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించకుండా, భౌతిక ఘర్షణ వల్ల ఏ భారతీయ సైనికుడికి ప్రాణాంతకం లేదా ఘోరమైన గాయం జరగలేదని, తమ ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యపై చైనా అధికారులను సంప్రదించిందని సింగ్ తెలిపాడు. [16] [19] [20]

PLA వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి, కల్నల్ లాంగ్ షావోహువా, డోంగ్‌జాంగ్ ప్రాంతంలో, [a] LAC వద్ద తమ వైపున సాధారణ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారని చెబుతూ జరిగిన సంఘటనలపై భిన్నమైన నివేదిక ఇచ్చాడు. [b] సరిహద్దు దాటుతున్న భారత సైనికులను వారు అడ్డగించారు. "మా ప్రతిస్పందన వృత్తిపరమైనది, ప్రామాణికమైనది, శక్తివంతమైనది. మేము మైదానంలో పరిస్థితిని చక్కబెట్టాము," ఆ తరువాత దళాల ఉపసంహరణ జరిగింది అని అతను చెప్పాడు. [19] [20]

ఈ సంఘటనపై రోజువారీ విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానిస్తూ, "చైనా-భారత సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి మొత్తం శాంతియుతంగా, స్థిరంగా ఉంది". ఇరుపక్షాలు "సరిహద్దు సమస్యపై దౌత్య సైనిక మార్గాల్లో అడ్డంకులు లేని సంభాషణను కొనసాగించాయి.". "ఇరు వైపుల ఉన్న నాయకుల మధ్య కుదిరిన ముఖ్యమైన ఏకాభిప్రాయాన్ని గట్టిగా అమలు చేయాలని, ఇరు పక్షాలు సంతకం చేసిన ఒప్పందాల స్ఫూర్తికి కట్టుబడి ఉండాలనీ, చైనా-భారత్‌ల శాంతిని, ప్రశాంతతను సంయుక్తంగా కాపాడాలని" పిలుపు నిచ్చారు. [21]

ఇవి కూడా చూడండి మార్చు

గమనికలు మార్చు

  1. The Chinese refer to Yangtse as the Dongzhang area (Domtsang in the Tibetan language).
  2. The Chinese refer to Yangtse as the Dongzhang area (Domtsang in the Tibetan language).

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Ruser, Nathan; Grewal, Baani (December 2022), Zooming into the Tawang border skirmishes, Australian Strategic Policy Institute, Sec. "The Recent Skirmish"
  2. 2.0 2.1 2.2 Banerjee, Ajay (13 December 2022). "34 Indian, 40 Chinese soldiers injured; Tawang clash was building up since October". The Tribune.
  3. 3.0 3.1 Wallen, Joe; Lateef, Samaan (12 December 2022). "Six Indian soldiers severely injured in border skirmish with Chinese troops". The Daily Telegraph.
  4. Liegl, Markus B. (2017). China's Use of Military Force in Foreign Affairs The Dragon Strikes. Taylor & Francis. p. 147. ISBN 9781315529318.
  5. Eekelen, Willem van (2015). Indian Foreign Policy and the Border Dispute with China A New Look at Asian Relationships. Brill. p. 128. ISBN 9789004304314.
  6. Kingsbury, Robert C. (1974). South Asia in Maps. Denoyer-Geppert. p. 26.
  7. . "The McMahon Line 1911–45: The British Legacy". The China Quarterly, Cambridge University Press.
  8. 8.0 8.1 Banerjee, Ajay (31 October 2021). "Key Indian post at 17K ft that China wants to occupy". The Tribune.
  9. 9.0 9.1 Desai, Nature (21 October 2022). "China isn't done yet in Arunachal Pradesh". The Times of India, TOI+.
  10. "Why Chinese PLA troops target Yangtse, one of 25 contested areas". The Indian Express. 15 December 2022.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 Sagar, Pradip R. (16 December 2022). "The Tawang tangle on India-China border". India Today.
  12. 12.0 12.1 12.2 12.3 Philip, Snehesh Alex (12 December 2022). "Arunachal clash: Over 200 PLA troops came with spiked clubs, taser guns, Indian soldiers hit back". The Print.
  13. 13.0 13.1 13.2 Sharma, Ankur (13 December 2022). "What Triggered The Clashes at LAC? News18 Brings You The Inside Story". CNN-News18.
  14. Baruah, Sanjib Kr. (1 January 2023). "China's latest Arunachal provocation has serious implications". The Week.
  15. Dutta, Amrita Nayak (14 December 2022). "India-China Border Clash: 20 Years On, Why Tawang's Yangtse is Still a Raw Nerve for Neighbour". CNN-News18.
  16. 16.0 16.1 16.2 16.3 16.4 16.5 Bedi, Rahul (13 December 2022). "Timing of Official Disclosure of India-China Clash at Tawang Raises Questions". The Wire.
  17. Krishnan, Ananth (13 December 2022). "As India pushes China back on LAC, PLA's growing transgressions risk 'strategic miscalculation'". The Hindu.
  18. Dhar, Aniruddha (13 December 2022). "Jat regiment, Indian Army's 2 other units took on China troops in Arunachal – 10 points". The Hindustan Times.
  19. 19.0 19.1 19.2 Schmall, Emily; Yasir, Sameer (13 December 2022). "Indian and Chinese Soldiers Again Trade Blows at Disputed Border". The New York Times.
  20. 20.0 20.1 Saaliq, Shiekh (13 December 2022). "Indian, Chinese troops clash at border in fresh faceoff". The Washington Post. Associated Press.
  21. Adlakha, Hemant (17 December 2022). "The Tawang Clash: The View From China". The Diplomat.