7G బృందావన్ కాలనీ

2004 సినిమా

7G బృందావన్ కాలనీ 2004 లో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళం, తెలుగులో వచ్చిన ఒక ద్విభాషా ప్రేమ కథా చిత్రం.[1] ఇందులో ఈ సినిమా నిర్మాత యైన ఎ. ఎం. రత్నం తనయుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

7G బృందావన్ కాలనీ
దర్శకత్వంశ్రీ రాఘవ
రచనశ్రీ రాఘవ
నిర్మాతఎ. ఎం. రత్నం
తారాగణంరవికృష్ణ
సోనియా అగర్వాల్
సుమన్ శెట్టి
ఛాయాగ్రహణంఅరవింద్ కృష్ణ
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 15, 2004 (2004-10-15)
సినిమా నిడివి
185 నిమిషాలు.
దేశంభారతదేశం
భాషతమిళం

రవి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తన తండ్రి (చంద్రమోహన్), తల్లి (సుధ), చెల్లెలుతో కలిసి నివసిస్తుంటాడు. అతను ఎప్పుడూ తరగతులకు వెళ్ళకుండా, పరీక్షల్లో పాసవకుండా, గొడవల్లో తలదూర్చుతూ ఉంటుంటే తండ్రి అతన్ని పనికిరానివాడివని తిడుతూ ఉంటాడు. రవి కూడా తానంటే తండ్రికి ఇష్టం లేదని అతనితో గొడవపడుతూ ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా పక్కనే ఉన్న ఇంటికి ఒక హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబం రాకతో అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. రవి ఆ కుటుంబంలో ఉండే అందమైన అమ్మాయి అనిత (సోనియా అగర్వాల్) వైపు ఆకర్షితుడవుతాడు. అతను ఆమెతో చనువుగా ఉండాలని ప్రయత్నించినా ఆమె అతన్ని పట్టించుకోదు.

రవి ధైర్యం చేసి ఆ అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అందరూ తనను పురుగును చూసినట్లు చూస్తుంటే తాను కనీసం చూడ్డానికైనా నోచుకున్నానని చెబుతాడు. ఆమె తాను అతనికి సరైంది కాదని చెబుతుంది. దాంతో రవి ఆమెను మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెబుతాడు. కానీ ఆమెను మరిచిపోలేక వెంట పడుతూనే ఉంటాడు. అనిత నెమ్మదిగా గమనించగా రవి తాను అనుకున్నంత పనికిరాని వాడేమీ కాదనీ, మోటార్ సైకిళ్ళు మరమ్మత్తు చేయడంలో అతనికి మంచి నైపుణ్యం ఉందని తెలుస్తుంది. అనిత అతన్ని హీరో హోండా షో రూం కి తీసుకెళ్ళి అతనికి ఉద్యోగం ఇప్పించమంటుంది. వాళ్ళు ఓ బైక్ ను బిగించగలిగితే ఉద్యోగం ఇస్తామంటారు. రవి మొదట్లో అందుకు ఒప్పుకోడు. దాంతో అనిత అతన్ని ప్రేమిస్తున్నాననీ వారిద్దరూ కలిసి ఉండాలంటే అతనికి ఏదో ఒక ఉద్యోగం కావలనీ చెబుతుంది. దాంతో అతను వాళ్ళు చెప్పిన పని చేసి అక్కడే ఉద్యోగం సంపాదిస్తాడు.

రవి తండ్రి కూడా కొడుకు ప్రయోజకుడయ్యాడని సంతోషిస్తాడు. ఎప్పుడూ తిడుతూ ఉండే తాను కొడుకు ఎదురుగా పొగడకుండా చాటుగా అతని తల్లి వద్ద కొడుకు గొప్పతనాన్ని ప్రశంసిస్తాడు. అప్పటి దాకా తండ్రంటే ద్వేషం ఉన్న రవి తన పట్ల తండ్రికున్న ప్రేమను తెలుసుకుంటాడు. కానీ అనిత, రవితో సన్నిహితంగా ఉండటం చూసిన అనిత తల్లి వారిద్దరి పెళ్ళికి ససేమిరా ఒప్పుకోనంటుంది. రవి తండ్రి కూడా ఆమెకు సర్దిచెప్పాలని చూస్తాడు. అనిత తండ్రి వ్యాపారం దెబ్బతిన్నందువల్ల మరో హిందీ కుటుంబం వారికి సహాయం చేసిందనీ వాళ్ళ అబ్బాయికి తమ అమ్మాయినిచ్చి పెళ్ళి చేయాలని చెబుతుంది. అనిత ఇంట్లోంచి తప్పించుకుని రవితో కలిసి ఓ హోటల్ కి వెళుతుంది.

అక్కడ అనిత రవి తనను ప్రేమించినందుకు జీవితాంతం బాధ పడకుండా ఉండాలనీ, తనకు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకునే ముందు రవితో ఒక రాత్రి గడపాలనుందనీ చెబుతుంది. రవి మొదట ఆశ్చర్యపోయినా అందుకు అంగీకరించి ఆ రాత్రి వారిద్దరూ ఒక్కటవుతారు. కానీ ఉదయం లేవగానే రవి అనితతోనే జీవితాంతం కలిసి ఉండాలనుకున్నట్లు చెబుతాడు. దాంతో అనిత తనను కేవలం శారీరక సుఖం కోసమే అలా అడుగుతున్నాడని వాదిస్తుంది. అలా కోపంలో విసురుగా హోటల్ రూములో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా ఓ లారీ కిందపడి మరణిస్తుంది. రవి కూడా ఆత్మహత్య చేసుకోవాలని వాహనాలకు అడ్డంగా పరిగెడతాడు కానీ అందరూ అతన్ని తిడుతూ వెళ్ళిపోతారు. అప్పట్నుంచి అతను ఆమె ఊహల్లోనే బతుకుతుండటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్నందించాడు. పాటలు మంచి ప్రేక్షకాదరణ పొంది సినిమా విజయానికి దోహదపడ్డాయి.

  • మేం వయసుకు వచ్చాం (ఈ పాటలో తమిళ నటి మయూరీ స్పెషల్ అప్పీయరెన్స్ గా వచ్చింది)
  • కలలు కనే కాలాలు
  • తలచి తలచి చూసా

మూలాలు

మార్చు
  1. "ఐడిల్ బ్రెయిన్ లో 7జి బృందావన్ కాలనీ సమీక్ష". idlebrain.com. జీవీ. Retrieved 18 November 2016.