ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ

బ్రిటిషు భారతదేశంలో ఒక పరిపాలనా విభాగం
(NEFA నుండి దారిమార్పు చెందింది)

ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ - NEFA), బ్రిటిషు భారతదేశం లోని రాజకీయ విభాగాలలో ఒకటి. తరువాత 1972 జనవరి 20 వరకు స్వతంత్ర భారతదేశంలో ఇది, అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. 1974 వరకు దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం షిల్లాంగ్‌లో ఉండేది. ఆ తరువాత ఇటానగర్‌కు బదిలీ చేసారు. 1987 ఫిబ్రవరి 20 న దీనికి రాష్ట్ర హోదా ఇచ్చారు.

1946లో నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రాక్ట్స్

చరిత్ర

మార్చు

ట్రాక్ట్‌లు (1914–1954)

మార్చు
 
North-East Frontier Agency in 1963
 
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి రాజకీయ పటం, 1947లో ఈశాన్య సరిహద్దు

1914 లో, బ్రిటీష్ ఇండియాలోని అస్సాం ప్రావిన్స్‌లోని పూర్వపు దర్రాంగ్, లఖింపూర్ జిల్లాల నుండి కొన్ని గిరిజన-మెజారిటీ ప్రాంతాలను విడదీసి, ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్ (NEFT) ఏర్పాటు చేసారు. NEFT ప్రారంభంలో రెండు విభాగాలుగా విభజించబడింది: (i) సెంట్రల్, ఈస్టర్న్ విభాగం(పూర్వ దిబ్రూఘర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్,.దక్షిణాన మరికొన్ని ప్రాంతాలు), (ii) పశ్చిమ విభాగం. ఒక్కో విభాగాన్ని రాజకీయ అధికారి కింద ఉంచారు. 1919 లో సెంట్రల్, ఈస్టర్న్ సెక్షన్‌ను సాదియా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌గా, పశ్చిమ విభాగాన్ని బలిపారా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌గా పేరు మార్చారు. 1937 లో, భారత ప్రభుత్వ చట్టం, 1935 నిబంధనల ప్రకారం అస్సాం ప్రావిన్స్‌లోని లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్ (1919లో సృష్టించారు)తో పాటు సాదియా, బలిపారా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లను కలిపి సమిష్టిగా 'అస్సాం ప్రావిన్స్ నుండి మినహాయించబడిన ప్రాంతాలు'గా పిలిచారు. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ట్రాక్ట్స్ (ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్) రెగ్యులేషన్స్, 1943 లోని రెగ్యులేషన్ 1 ప్రకారం, సాదియా, లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లలోని కొన్ని ప్రాంతాలను కలిపి తిరప్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌ను సృష్టించారు. దీని తరువాత, అస్సాం గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఒక కొత్త నియంత్రణను - అస్సాం ఫ్రాంటియర్ (న్యాయ నిర్వహణ) రెగ్యులేషన్, 1945 - రూపొందించారు. తర్వాతి కాలంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించిన NEFA చరిత్రలో ఇది ఒక మైలురాయి దశ. 1946లో, బలిపారా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌ను రెండు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌లుగా విభజించారు: సెలా సబ్-ఏజెన్సీ, సుబన్‌సిరి ప్రాంతం.[1]

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, NEFT అస్సాం రాష్ట్రంలో భాగమైంది. 1948 లో, సాదియా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌ను అబోర్ హిల్స్ జిల్లా, మిష్మి హిల్స్ జిల్లా అనే రెండు జిల్లాలుగా విభజించారు. 1950 లో, ఈ ప్రాంతాలలోని మైదాన ప్రాంతాలను (బలిపరా ఫ్రాంటియర్ ట్రాక్ట్, తిరప్ ఫ్రాంటియర్ ట్రాక్ట్, అబోర్ హిల్స్ జిల్లా, మిష్మి హిల్స్ జిల్లా) అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసారు. మిగిలినవి అస్సాం రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో కలిపారు (భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లోని 20వ పేరాకు అనుబంధంగా ఉన్న టేబుల్‌ బి). 1951లో, బలిపారా ఫ్రాంటియర్ ట్రాక్ట్, తిరప్ ఫ్రాంటియర్ ట్రాక్ట్, అబోర్ హిల్స్ జిల్లా, మిష్మి హిల్స్ జిల్లా, నాగా గిరిజన ప్రాంతాలను కలిపి ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (NEFA)గా మార్చారు. [2]

ఏజెన్సీ (1954–1972)

మార్చు
 
1954లో నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ యొక్క విభాగాలు

1954లో, బలిపారా ఫ్రాంటియర్ ట్రాక్ట్‌ను (1) కమెంగ్ ఫ్రాంటియర్ డివిజన్ (2) సుబన్‌సిరి ఫ్రాంటియర్ డివిజన్‌గా విభజించారు; (3) తిరప్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌ను టిరాప్ ఫ్రాంటియర్ డివిజన్‌గా పేరు మార్చారు. (4) అబోర్ హిల్స్ జిల్లా సియాంగ్ ఫ్రాంటియర్ డివిజన్‌గా,(5) మిష్మి హిల్స్ జిల్లాను లోహిత్ ఫ్రాంటియర్ డివిజన్‌గా మార్చారు. నాగా గిరిజన ప్రాంతాన్ని ట్యూన్‌సాంగ్ ఫ్రాంటియర్ డివిజన్‌గా ఏర్పరచారు. ఇదే 1957 లో నాగా హిల్స్ జిల్లాతో కలిసి నాగా హిల్స్ టుయెన్‌సాంగ్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది. మిగిలిన భూభాగాన్ని సమిష్టిగా నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (NEFA) అని పిలుస్తారు.

1965 ఆగస్టు 1 న ఏజెన్సీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేసారు. 1965 డిసెంబరు 1 న, ఐదు సరిహద్దు విభాగాలు (కామెంగ్, సుబన్‌సిరి, సియాంగ్, లోహిత్, తిరప్) దాని ఐదు జిల్లాలుగా మారాయి. ప్రతి జిల్లాకు ఒక రాజకీయ అధికారి స్థానంలో ఒక డిప్యూటీ కమిషనర్‌ను పరిపాలనా అధిపతిగా నియమించారు. మెరుగైన పరిపాలన కోసం 1967 లో ఏజెన్సీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 1972 వరకు, ఇది రాజ్యాంగబద్ధంగా అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉంది. భారత రాష్ట్రపతికి ప్రతినిధిగా అస్సాం గవర్నరు నేరుగా దీన్ని పరిపాలించారు. 1972 జనవరి 21 న, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీని అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి, ఛీఫ్ కమీషనర్ పాలన కింద ఉంచారు. 1987 ఫిబ్రవరి 20 న అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇచ్చారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "East Kameng - at a glance". East Kameng district website. Archived from the original on 2003-12-10.
  2. "Inception of administration". Government of Arunachal Pradesh website. Archived from the original on 2009-04-10.