అంతులేని కథ
అంతులేని కథ 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు. మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. కె.బాలచందర్ దర్శకత్వం, కథన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి.[1]
అంతులేని కథ (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బాలచందర్ |
---|---|
నిర్మాణం | రామ అరణంగళ్ |
రచన | కె.బాలచందర్ |
తారాగణం | జయప్రద సరిత రజనీకాంత్ జి.వి. నారాయణరావు |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నేపథ్య గానం | వాణీ జయరాం ఎస్.జానకి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | ఆచార్య ఆత్రేయ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 27, 1976 |
నిడివి | 150 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
1976 వసంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించారు.
సినిమా కథ
మార్చుసరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్నంతా ఆమే పోషిస్తుంటుంది. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయిఉంటాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న (రజనీకాంత్) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉంటారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.
సరితను ప్రేమిస్తున్న తిలక్ (ప్రసాద్ బాబు) ఆమెను పెళ్ళికి ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ కుటుంబ బాధ్యతల కారణంగా సరిత వివాహానికి సిద్ధం కాలేకపోతుంది. అయితే సరిత వితంతు సోదరి (శ్రీప్రియ) తిలక్ పట్ల ఇష్టం పెంచుకొంటుంది. తిలక్ కూడా ఆమెపట్ల ఆకర్షితుడౌతాడు. సరిత వారిద్దరికీ పెళ్ళి చేస్తుంది.
సరిత ఇంటిపై గదిలో అద్దెకుండే వికటకవి గోపాల్ (జి.వి. నారాయణరావు) తన ఆటపాటలతో అందరినీ అలరిస్తుంటాడు. సరిత స్నేహితురాలు చంద్ర ("ఫటాఫట్" జయలక్ష్మి) జీవితాన్ని తేలికగా తీసుకొనే రకం. సాంఘిక కట్టుబాట్లను లెక్క చేయదు. అయితే ఒక చిక్కు సమస్యలో ఆమె మనసు విరిగిపోయి ఆత్మహత్యకు తలపడుతుంది. సరిత ఆమెను రక్షించి వికటకవి గోపాల్‌తో పెళ్ళి చేస్తుంది.
ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ (కమల్ హాసన్) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకుంటుంది. అందరికీ శుభలేఖలు పంచుతుంది. సరిత పెళ్ళికి అంతా సిద్ధంగా ఉంటుంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడతాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిస్తుంది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్) తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు మళ్ళీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళే సిటీబస్సులో బయలుదేరుతుంది.
తారాగణం
మార్చు- జయప్రద
- సరిత
- రజనీకాంత్ (పరిచయం)
- జి.వి. నారాయణరావు (పరిచయం)
- ఫటాఫట్ జయలక్ష్మి
- శ్రీప్రియ
- కమల్ హాసన్
- ప్రసాద్ బాబు
- ఎం. జయశ్రీ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కైలాసం బాలచందర్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాత:రామ అరణం గళ్
గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, యేసుదాస్
విడుదల:27:02:1976.
సినిమా చిత్రీకరణ
మార్చుఈ సినిమా పూర్తిగా విశాఖపట్నంలో చిత్రీకరింపబడింది. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.
హిట్టయిన పాటలు
మార్చుపాట | సంగీతము | నేపథ్యగానము |
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ | ఎం. ఎస్. విశ్వనాథన్ | యేసుదాసు |
కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు | ఎం. ఎస్. విశ్వనాథన్ | ఎస్.జానకి |
తాళి కట్టు శుభవేళ, మదిలో కల్యాణ మాల | ఎం. ఎస్. విశ్వనాథన్ | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం |
అరె ఏమిటీ లోకం, పలుగాకుల లోకం | ఎం. ఎస్. విశ్వనాథన్ | ఎల్.ఆర్.ఈశ్వరి |
ఊగుతున్నది నీ ఇంటి ఉయ్యాల | ఎం. ఎస్. విశ్వనాథన్ | పి.సుశీల |
విశేషాలు
మార్చు- ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
- "తాళి కట్టు శుభవేళ" - మిమిక్రీ పాట ప్రజాదరణ పొందింది
- రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలను ఆకట్టుకుంది.