ప్రస్తుతం చలామణీలో ఉన్న అణువు సిద్ధాంత పరమైన నమూనా. ఇందులో మధ్యలో దట్టంగా ఉండే కేంద్రకం, దాని చుట్టూ ఎలక్ట్రాన్ల మేఘం (సంభావ్యతా మేఘం/probabilistic cloud )ఉంటాయి.

భౌతిక రసాయనిక శాస్త్రాల్లో అణు సిద్ధాంతం అంటే పదార్థం లక్షణాల్ని వివరించే ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పదార్థాలన్నీ విభజించడానికి వీలు లేని అణువులు (Atoms) లేదా పరమాణువులతో కూడుకొని ఉంటాయి. ఇది పురాతన గ్రీసు దేశంలో తత్వ శాస్త్ర భావనగా మొదలై 19 వ శతాబ్దం మొదట్లో శాస్త్రీయ పరిశోధనా పరిధిలోకి వచ్చింది.[1]

అణువుకు సమానార్థమైన ఆంగ్లపదం ఆటం (Atom) ప్రాచీన గ్రీకు పదం అటామస్ అనే పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం విభజించడానికి వీలు లేనిది అని అర్థం.[2] 19వ శతాబ్దానికి చెందిన రసాయనిక శాస్త్రవేత్తలు కొన్ని పదార్థాలు ఇక విడగొట్టలేనంత సూక్ష్మంగా ఉన్నవాటిని ఈ పేరుతో పిలవడం ప్రారంభించారు. 20 వ శతాబ్దం మొదలయ్యే నాటికి విద్యుదయస్కాంతత్వం, రేడియో ధార్మికత మొదలైన వాటిమీద పరిశోధనలు చేస్తూ అసలు విభజించడానికి వీలులేని అణువులు ఉంటాయని కనుగొన్నారు. కానీ వీటిలో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రానులు, ప్రోటానులు అనే కణాలు కలగలిసిపోయి ఉంటాయని కూడా నిరూపించారు. ఇంకా చెప్పాలంటే అత్యధిక ఉష్టోగ్రత మరియు అత్యధిక పీడనం ఉన్న కొన్ని విపరీత పరిస్థితుల్లో (న్యూట్రాన్ స్టార్స్) అసలు అణువులుగా ఉండే అవకాశమే లేదని కూడా కనుగొన్నారు.

అణువులను కూడా విభజించగలమని తేలడంతో భౌతిక శాస్త్రవేత్తలు అణువులో ఉన్న విడగొట్టడానికి వీలుకాని కణాలను ప్రాథమిక కణాలు (elementary particles) అని పిలిచారు. ఈ కణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణ భౌతికశాస్త్రం అని వ్యవహరిస్తారు. ఈ విభాగంలో భాగంగా శాస్త్రజ్ఞులు అసలు పదార్థం యొక్క తత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.

చరిత్రసవరించు

తత్వ శాస్త్రంలో అణువుసవరించు

పదార్థాలన్నీ ఏదో కొన్ని విడి భాగాల కలయికతో ఏర్పడిందనేది చాలా ప్రాచీనమైన భావన. ఇది పురాతన గ్రీసు, భారతీయ సంస్కృతుల్లో కనిపిస్తుంది. ఆటం అనే ప్రాచీన గ్రీకు పదానికి విడగొట్టడానికి వీలు లేనిది అని అర్థం. ఈ పదం సోక్రటీసు కంటే ముందే ల్యూసిపస్ (Leucippus), అతని శిష్యుడైన డెమోక్రిటస్ (Democritus ) సా.పూ 460- 370 మధ్యలోనే ఉపయోగించారు.[3][4][5][6]. పరమాణువులు సంఖ్య అనంతమనీ, వాటిని ఎవరూ సృష్టించలేదనీ, శాశ్వతంగా ఉండిపోయేవని, ఒక వస్తువు యొక్క లక్షణాలు దానిని కూర్చే పరమాణువుల మీద ఆధారపడి ఉంటుందని డెమోక్రిటస్ బోధించాడు.[4][5][6] తరువాత గ్రీకు తత్వవేత్త ఎపిక్యురస్ (Epicurus) (సా. పూ. 341 - 270) మరియు రోమన్ ఎపిక్యురియన్ కవి లుక్రీషియస్ (Lucretius) (క్రీ.పూ. 99 - సి. 55 బి.సి) డెమోక్రిటస్ అణువాదాన్ని మరికొంత మెరుగుపరిచి విశదీకరి౦చారు.[5][6] అయితే మధ్య యుగ ఆరంభంలో పాశ్చాత్య ఐరోపా అణువాదాన్ని మరచిపోయింది.[5] 12 వ శతాబ్దంలో అరిస్టాటిల్ పాతరచనలను ఆధారంగా పేర్కొంటూ చేసిన రచనలతో అణువాదం మళ్ళీ పశ్చిమ ఐరోపాలో వెలుగులోకి వచ్చింది.[5]

14 వ శతాబ్దంలో, లుక్రీషియస్ రాసిన డి రెరం నాచురా, డయోజెనెస్ లియేటియస్ రాసిన లైవ్స్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ ఎమినెంట్ ఫిలాసఫర్స్ లాంటి రచనలవల్ల పండితుల దృష్టి ఈ శాస్త్రంమీదకు ప్రసరించింది.[5] ఏదేమైనా అణువాదం సనాతన క్రైస్తవ బోధనలతో విభేధించే ఎపిక్యురియనిజమ్ అనే తత్వశాస్త్ర భావన కాబట్టి, చాలా మంది యూరోపియన్ తత్వవేత్తలు దీనిని అంగీకరించలేదు.[5] ఫ్రెంచి కేథలిక్ పూజారి పియరీ గ్యాసేన్డి (1592 – 1655) ఎపిక్యురియన్ అణువాదాన్ని కొన్ని మార్పులతో పునరుద్ధరించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం పరమాణువులు దేవునిచే సృష్టించబడి చాలా అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ, అవి అనంతం కావని ఆయన పేర్కొన్నాడు.[5][6] గ్యాస్సెండి సవరించిన అణు సిద్ధాంతాన్ని ఫ్రాన్స్‌లో వైద్యుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ (1620 - 1688), ఇంగ్లాండ్‌లో సహజ తత్వవేత్త వాల్టర్ చార్లెటన్ (1619 - 1707) ప్రాచుర్యం లోకి తెచ్చారు.[5] రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ (1627 – 1691) మరియు భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ (1642 – 1727) ఇద్దరూ పరమాణువాదాన్ని సమర్థించారు. 17 వ శతాబ్దం చివరినాటికి, ఇది శాస్త్రీయ సమాజంలోని కొన్ని వర్గాల ద్వారా ఆమోదించబడింది.[5]

జాన్ డాల్టన్సవరించు

18 వ శతాబ్దం చివరిలో, అణుసిద్ధాంతాలతో సంబంధం లేకుండా రసాయన చర్యల గురించి రెండు నియమాలు సూత్రీకరించబడ్డాయి. మొదటిది ద్రవ్యనిత్యత్వ నియమం (law of conservation of mass). ఇది ఆంటోనీ లావోయిజర్ పనితో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఇది రసాయన ప్రతిచర్యలో మొత్తం ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందని పేర్కొంది (అంటే చర్యలో పాల్గొనే క్రియాజనకాలు, వాటి ఉత్పత్తులు ఒకే ద్రవ్యరాశి కలిగి ఉంటాయి).[7] రెండవది నియత నిష్పత్తి నియమం (law of definite proportions). 1799 లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ చేత మొదట ప్రతిపాదించిన ఈ సూత్ర ప్రకారం,[8] ఒక సమ్మేళనం దానిలోని రసాయన మూలకాలుగా విభజించబడితే, అసలు పదార్థ పరిమాణం లేదా మూలంతో సంబంధం లేకుండా, విడిపోయిన భాగాల ద్రవ్యరాశి బరువు ఎల్లప్పుడూ ఒకే నిష్పత్తిలో ఉంటుంది.

మూలాలుసవరించు

  1. రోహిణీ ప్రసాద్, కొడవటిగంటి (2012). అణువుల శక్తి. హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 13.
  2. Berryman, Sylvia, "Ancient Atomism", Stanford Encyclopedia of Philosophy (Fall 2008 Edition), Edward N. Zalta (ed.) [1]
  3. Pullman, Bernard (1998). The Atom in the History of Human Thought. Oxford, England: Oxford University Press. pp. 31–33. ISBN 978-0-19-515040-7.
  4. 4.0 4.1 Kenny, Anthony (2004). Ancient Philosophy. A New History of Western Philosophy. 1. Oxford, England: Oxford University Press. pp. 26–28. ISBN 0-19-875273-3.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 5.9 Pyle, Andrew (2010). "Atoms and Atomism". In Grafton, Anthony; Most, Glenn W.; Settis, Salvatore (సంపాదకులు.). The Classical Tradition. Cambridge, Massachusetts and London, England: The Belknap Press of Harvard University Press. pp. 103–104. ISBN 978-0-674-03572-0.
  6. 6.0 6.1 6.2 6.3 Cohen, Henri; Lefebvre, Claire, సంపాదకులు. (2017). Handbook of Categorization in Cognitive Science (Second సంపాదకులు.). Amsterdam, The Netherlands: Elsevier. p. 427. ISBN 978-0-08-101107-2.
  7. Weisstein, Eric W. "Lavoisier, Antoine (1743-1794)". scienceworld.wolfram.com. Retrieved 2009-08-01. Cite web requires |website= (help)
  8. Proust, Joseph Louis. "Researches on Copper", excerpted from Ann. chim. 32, 26-54 (1799) [as translated and reproduced in Henry M. Leicester and Herbert S. Klickstein, A Source Book in Chemistry, 1400–1900 (Cambridge, Massachusetts: Harvard, 1952)]. Retrieved on August 29, 2007.