డాక్టర్ అలేఖ్య పుంజాల (జ. ఏప్రిల్ 9, 1962) కూచిపూడి కళాకారిణి, నాట్య గురువు. తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య బోధకురాలిగా అనేకమందికి నృత్యశిక్షణ ఇచ్చిన అలేఖ్య, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ హోదాని అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది.[1][2]

అలేఖ్య పుంజాల
జననంఅలేఖ్య
ఏప్రిల్ 9, 1962
హైదరాబాదు, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
వృత్తిపీఠాధిపతి (లలిత కళాపీఠం, తెలుగు విశ్వవిద్యాలయం)
ప్రసిద్ధికూచిపూడి నర్తకి
భార్య / భర్తపుంజాల వినయ్
పిల్లలుశాశ్వత్‌ రాంశంకర్‌, దేవాన్ష్‌ కృష్ణశంకర్
తండ్రిమార్గం నరసింగరావు
తల్లిసుగుణ
వెబ్‌సైటు
అలేఖ్య పుంజాల వెబ్సైట్

జననం - విద్యాభ్యాసం

మార్చు

అలేఖ్య 1962, ఏప్రిల్ 9న మార్గం నరసింగరావు, సుగుణ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.[3] నరసింగరావు ఎగ్జిబిషన్‌ సొసైటీ శాశ్వత గౌరవ సభ్యుడిగా ఉండేవాడు. సుగుణ రంగస్థల నటుడైన స్థానం నరసింహారావుతో రేడియో నాటికలో నటించేది.

‘ప్రాచీన చరిత్ర, కళలు’ అనే అంశంపై పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ తోపాటు ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్‌, సైకాలజీ చదివిన అలేఖ్య తన గురువు ఉమా రామారావు సలహామేరకు 1989లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎంఏ కూచిపూడిలో చేరింది.

కుటుంబం

మార్చు

అలేఖ్యకు మాజీ కేంద్రమంత్రి కీ.శే. పుంజల శివశంకర్ కుమారుడు వినయ్‌కుమార్‌ తో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వినయ్‌కుమార్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులుగా పనిచేస్తూ, రాజకీయాలలో ఉన్నాడు.[4] వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి శాశ్వత్‌ రాంశంకర్‌, కోడలు సంజన న్యాయవాది వృత్తిలో ఉన్నారు. చిన్నబ్బాయి దేవాన్ష్‌ కృష్ణశంకర్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.

ఉపాధ్యాయరంగం

మార్చు
 
కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకుంటున్న డా. అలేఖ్య పుంజాల

1990లో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన అలేఖ్య అటుతరువాత నృత్యశాఖ శాఖాధిపతిగా, టూరిజం స్టడీస్‌ డైరెక్టరుగా, లలితకళాపీఠానికి పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించింది. పదిమంది పీహెచ్‌డీ పరిశోధనా విద్యార్థులకు గైడ్‌గా ఉంటూ వారికి తగిన సూచనలు అందిస్తున్నది.[5]

రిజిస్ట్రార్‌గా: 2017, నవంబరు నుండి 2019 నవంబరు వరకు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలను నిర్వహించింది. 1985లో ఏర్పాటైన విశ్వవిద్యాలయ చరిత్రలో రిజిస్ట్రార్‌ హోదాను అందుకున్న తొలి మహిళ అలేఖ్య అవడం విశేషం.[6]

కళారంగం

మార్చు

తన నాలుగవ ఏటనుండే గురువు దయాల్ సరన్ వద్ద ఒడిస్సీ, కథక్ అంశాలలో శిక్షణ పొందిన అలేఖ్య నాట్యాచార్యురాలు ఉమా రామారావు వద్ద కూచిపూడి నృత్యశిక్షణ తీసుకున్నది. వందలాది మందికి నృత్యంలో శిక్షణను ఇస్తుంది. తన నాట్యంతో, అభినయంతో రాజమండ్రి సాహిత్యపీఠం నుండి అభినయ తపస్విని అనే బిరుదును అందుకుంది.[7][8] దేశ విదేశాల్లో జరిగిన సదస్సుల్లో పత్రాలు సమర్పించింది. అనేక పరిశోధనాత్మక ప్రాజెక్టులను పూర్తిచేసింది. కూచిపూడి నృత్యంపై శిక్షణా శిబిరాలు నిర్వహించింది. యునైటెడ్ కింగ్‌డమ్, సిరియా, అబుదాబీ, దుబాయ్, మస్కట్, కతర్, లెబనాన్, బహ్రయిన్, సైప్రస్, పోలాండ్, టర్కీ, బల్గేరియా, మారిషస్ వంటి దేశాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించి జాతీయ స్థాయిలో పలు పురస్కారాలను అందుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

ప్రదర్శనలు - కార్యక్రమాలు

మార్చు
 1. ప్రపంచ తెలుగు మహాసభ వేదికపై ఓరుగల్లు వీరవనిత రాణీ రుద్రమ నృత్యరూపక ప్రదర్శన
 2. లకుమ, నాయకి, సత్యభామా విలాసం, అలిమేలు మంగావిలాసం, దుర్గాసుర సంహారం, ద్రౌపతి, చిత్రకూట మహత్యం, ఆండాల్‌ కళ్యాణం వంటి పలు పురాణ పాత్రల ఆధారంగా నృత్యప్రదర్శనలు
 3. మండోదరి కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శన (రవీంద్ర భారతి - సెప్టెంబర్ 10, 2018)[9][10]
 4. ప్రతి సంవత్సరం ప్రపంచ నృత్యోత్సవాలు నిర్వహణ

అవార్డులు - పురస్కారాలు

మార్చు
 1. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం (2011) – 2012, అక్టోబర్ 9న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి
 2. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2
 3. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం (2014), 14 జూలై 2016[11]
 4. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
 5. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం (2002)
 6. రాష్ట్ర ప్రభుత్వ హంస పురస్కారం (2009)
 7. ప్రతిభా రాజీవ్ పురస్కారం (2009)
 8. సిద్ధేంద్రయోగి నర్తన పురస్కారం

మూలాలు

మార్చు
 1. ఆంధ్రజ్యోతి, నవ్య - ఓపెన్ పేజి (1 January 2018). "అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని." వెంకటేశ్‌. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 2. Deccan Chronicle, Life Style (17 January 2018). "Passion to excel". Reshmi Chakravorty. Archived from the original on 17 January 2018. Retrieved 14 May 2019.
 3. http://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=796&at=2 Archived 2021-03-02 at the Wayback Machine సంగీత నాటక అకాడమీ వెబ్సైట్
 4. The New Indian Express (22 November 2014). "A Love Story Directed by Friends". The New Indian Express. Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
 5. ఆంధ్రజ్యోతి, ప్రత్యేకం (13 September 2015). "నృత్య వైభవం... నేటి యువతరం". Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 6. వార్త, తెలంగాణ (26 November 2017). "తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య". వార్త. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 7. The Hindu, Dance (10 September 2015). "Alekhya's passion for tradition". Gudipoodi Srihari. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 8. Telangana Today, SundayScape (9 September 2018). "Dance is meditation to this Abhinaya Tapasvini". Mythreya Kodakandla. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 9. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (4 September 2018). "నాట్యమే నా ఊపిరి: అలేఖ్య పుంజల". Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 10. The Times of India, Entertainment (15 September 2018). "Alekhya Punjala retells the tale of Ravana's wife, Mandodari". Sweta Pendyala. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
 11. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.