అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి

రచయిత, కవి

అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి (1831 - 1892) తెలుగు కవి.

జీవితసంగ్రహం

మార్చు

ఇతడు ఆరామ ద్రావిడ బ్రాహ్మణుడు, హరితసగోత్రుడు. వీరి పిఠాపురము కడనున్న చేబ్రోలులో గంగమాంబ, రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు మాడుగుల సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రితుడుగా ఉన్నాడు. 1869లో పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావును ఆశ్రయించాడు. జననము: 1831- వికృతి సంవత్సరము. నిర్యాణము: 1892. ఇతని కుమారుడు అల్లంరాజు రంగశాయి కవి కూడా రచయిత, కవి పండితులు.

రచించిన గ్రంథములు

మార్చు
  • 1. శ్రీకృష్ణభూపతిలలామ శతకము (1853)
  • 2. శేష ధర్మములు (ఆరాశ్వాసముల పద్యకావ్యము). (1867)
  • 3. పాపయమంత్రి శతకము.
  • 4. ఆత్మబోధము (శంకరకృతికి దెలుగుపద్యములు) (1875)
  • 5. మణిధ్వజచరిత్రము (గ్రంథము లభింపలేదు)
  • 6. సింహాద్రి రామాధిప శతకము (1876)
  • 7. భద్రాపరిణయము (1878) [1]
  • 8. శ్రీకృష్ణ లీలా కల్యాణము (1878)
  • 9. చాటుధారా చమత్కారసారము.[2]

వంశచరిత్ర

మార్చు

సుబ్రహ్మణ్యకవిది పండితవంశము. ఇతని తండ్రి రంగధామాద్యుడు. నారాయణాచల మాహాత్మ్య కృతికర్త. కవిచోర చంద్రోదయ, సత్యభామా విలాసాదులు రచించిన రామకృష్ణకవి కితడు భిన్నోదర సోదరుడు.

సాహిత్యకృషి

మార్చు

సుబ్రహ్మణ్యకవి నాగాభట్ల నరసకవితో నుభయభాషల పఠించెను. చాలావఱకు స్వయంకృషి చేసి సాహిత్యనిష్ణాతుడాయెను. మనుచరిత్రము-ఆముక్తమాల్యద వీరి కభిమానిత గ్రంథములు. జ్యోతిషభాగముకూడ నీయన చక్కగనెఱిగెను. అధికొంత తొలుత జీవనాధారమైనది. క్రమముగా గవిత్వరచనమే ప్రధానవృత్తిగా బెట్టుకొని రాజ దర్శనము చేయుచు సుబ్రహ్మణ్యకవి తనలేవడి నెట్టుకొనుచుండెను. 1853లో మాడుగల్లు సంస్థానాధిపతియగు శ్రీకృష్ణభూపతిపై నీకవి సీసపద్యములశతక మొకటి చెప్పెను. అది "శ్రీకృష్ణభూపతి లలామశతకము." అప్పటికి గవియీ డిరువది రెండేడులు. మాడుగల్లుసంస్థాన పండితులు మనకవి నెన్నో తిప్పలు పెట్టిరట. మంత్రిప్రెగడ సూర్యప్రకాశరాయకవి మున్నగువారు నాడు తత్సంస్థాన విద్వత్కవులు. అక్కడివారు "కుట్రయొనర్చె లేమ తన గుబ్బలయుబ్బు సహింపలేమిచేన్." అను సమస్య నిచ్చి, నిలుచుండగా బూరింపుమనిరి. అది యీకవిచే నిటు పూరింపబడియె.

వట్రువహారరత్నములు వన్నె నగల్ పులిమీదవచ్చు నా
పుట్ల యటన్నరీతి జిగి బొల్పగు చూచుకలీల జూచుచున్
దొట్రిలనేల? కేలగొని గోగులనొక్కుము నాథయంచు దా
గుట్రయొనర్చె లేమ తనగుబ్బలయుబ్బు సహింపలేమిచేన్.

ఇట్టి పరీక్షల కాగిన సుబ్రహ్మణ్యకవిని మాడుగల్లుఱేడు మెచ్చి యాస్థానకవిగా నర్థించెను. కాని జన్మస్థానమున కాయూరు దూరమగుటచే నంగీకరింపక కవిగారు వార్షికబహూకారము వచ్చునటుల ప్రార్థించెను. 1853 మొదలు 1869 వఱకు నాసంస్థాన వార్షికవిత్తము సుబ్రహ్మణ్యకవి పొందుచుండెను. 1869 లో పీఠికాపుర సంస్థానమున మాసవేతన మేర్పడినది. గంగాధరరామరాయేంద్రు డీకవిప్రతిభ దెలిసికొని సన్మానించెను.

భద్రా పరిణయము

మార్చు

"భద్రాపరిణయము" అను ప్రౌఢాంధ్ర ప్రబంధ మా మహారాజున కంకితము గావించెను. ఏత త్కృతిప్రదానవిషయ మీ పద్యము తెలుపును.

శాలివాహనశక సంవత్సరము లిందు
     గగనకరీందుసంఖ్యల నెసంగ
జరుగు ప్రమాధివత్సర మార్గశిరశుద్ధ
     సప్తమీ శుక్రవాసరమునందు
శ్రీ మహారాజభూషిత చరిత్రుండు సూ
     ర్యారాయభూనాయకాత్మజుండు
రావు గంగాధరరామరాయక్షమా
     ధవుడు సుబ్రహ్మణ్య కవివరునకు

బీఠపురదుర్గ సౌధంపు బెద్దకొలువు
నందు భద్రాపరిణయ కావ్యంబు నంది
యధికతరమాన్యభూమి నెయ్యూఱులును సు
వర్ణ వలయంబులును సేలువలు నొసంగె.

ఈ భద్రాపరిణయము నాలుగాశ్వాసములు కలది. కాణాదము పెద్దన సోమయాజి భద్రాపరిణయమను మాఱు పేరుగల ముకుందవిలాస ప్రబంధము రచించెనని వీరేశలింగముపంతులు గారు వ్రాసిరి. ఆ ముకుంద విలాసములోని కవితారీతు లీ సుబ్రహ్మణ్యకవి కొన్ని సంగ్రహించెను. అందలిపద్యములు పద్యములుగా గొన్ని యిందున్నవి. కథలో గూడ బెద్ద మార్పులేదు. భావములు చాలవఱకు దానిని బోలినవే. ఈవిషయము శ్రీ నడకుదుటి వీరరాజుగారును వెల్లడించిరి. ఆకవి కవితపైగల యభిమానమున నీసుబ్రహ్మణ్యకవి యిటులు చేసినాడని సమర్థించు కొనవలయును. పురాణపండ మల్లయ్యశాస్త్రిగారి వ్యాఖ్యతో 1912 లో నీగ్రంథము నేటి పీఠికాపుర ప్రభువు లావిష్కరించిరి. సుబ్రహ్మణ్యకవి సాధారణకవి కాడనుట కతనిగూర్చినకథలు చాలగలవు. పెద్దపెద్ద సంస్థానములకు బోయి యతడుచూపిన విచిత్రాశుకవితాదు లందులకు దార్కాణ.

చాటు ధారాచమత్కార సారము

మార్చు

ఆయన 'చాటు ధారాచమత్కారసార' మనునొక గ్రంథము సంధానించెను. అందు సంస్కృతమున జాటువులుగ నుండి పండితులచే బరంపరాయాతములై యున్న గంభీరార్థకములగు శ్లోకములకు సులభమైన యర్థము వ్రాయబడియున్నది. ప్రాచీనాధునాతనపద్యము లెన్నో యందున్నవి.

కమలాకర కమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైనకొలను గని రా సుదతుల్.

ఈపద్య మిచ్చి మాడుగుల సంస్థానములో నెవరో పండితులు సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నర్థము చెప్పుమనిరట. నాటి వారిలో నిట్టి పాషాణములను బ్రద్దలుగొట్టు దిట్టలు చాలమంది యుండువారు. మన శాస్త్రీగారు వెంటనే దానికర్థము వివరించిచెప్పిరి. తరువాత సేకరించిన కొన్ని చాటువులకు వ్యాఖ్య వ్రాసి "చాటుధారా చమత్కారసారము" వెలువరించిరి. జయంతి రామయ్యపంతులుగారికి వీరికిని మైత్రి. రామయ్యపంతులుగారి ప్రోత్సాహమువలన నీకృతి రచితమైనది.

కవితాధార

మార్చు

సుబ్రహ్మణ్యకవి ప్రతిభావ్యుత్పత్తులు సమానముగా గల కవివరుడు. వారిపద్యధారకు జివరగా భద్రా పరిణయము నుండి నొక యుదాహరణమిచ్చి విడిచెదను.

పగడపుమోవితో జిలుగుబయ్యదతో విడియంపుసొంపుతో
నిగనిగ నుబ్బుసిబ్బెముల నిగ్గులతో దగుగుబ్బదోయితో
సొగసగువేణితో బెళుకు చూపులతో లలిలేతనవ్వుతో
జిగివగగుల్కవచ్చి యొక చేడియచూచె ద్రిలోకమోహనున్
                        భద్రాపరిణయము.

మూలాలు

మార్చు
  • ఆంధ్ర రచయితలు : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940. పేజీలు: 63-8.
  • పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973