అల్లరి 2002 సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం.[2] ఈ సినిమాను తమిళంలోకి కురుంబు అనే పేరుతో అల్లరి నరేష్ హీరోగానే రీమేక్ చేశారు.

అల్లరి
దర్శకత్వంరవిబాబు
రచననివాస్ (సంభాషణలు) రవిబాబు (చిత్రానువాదం)
నిర్మాతరవిబాబు
సురేష్ మూవీస్ (సమర్పణ)[1]
తారాగణంఅల్లరి నరేష్
శ్వేత అగర్వాల్
ఛాయాగ్రహణంలోక్ నాథ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంజె. పాల్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుసురేష్ మూవీస్
విడుదల తేదీ
2002 మే 10 (2002-05-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రవి ఓ మధ్య తరగతి కాలేజీ కుర్రాడు. అతని తండ్రి (కోట శ్రీనివాస రావు) ఒక చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. డబ్బులు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అదే అపార్టుమెంటు లో నివసించే అపర్ణ అలియాస్ అప్పు (శ్వేత అగర్వాల్) రవికి మంచి స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరగడం వలన అన్ని పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ముఖ్యంగా రవికి ఎప్పుడైనా డబ్బు అవసరమైతే అపర్ణ సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అలానే ఉంటుంది.

అలా ఉండగా రవికి తన పక్కింట్లోకి కొత్తగా వచ్చిన మోడరన్ అమ్మాయి రుచి (నీలాంబరి)ని చూసి ప్రేమలో పడతాడు. రుచి కూడా అతని ఆకర్షణలో పడి అతనిచేత మంచి బహుమతులు కొనిపించుకుంటూ కాలక్షేపం చేస్తుంటుంది. రవి తాను రుచితో ప్రేమలో పడ్డానని తెలుసుకుని ఎవరో రాసినట్లు ప్రేమలేఖ రాసి దాన్ని రుచికి అందజేయమని అప్పుకు ఇస్తాడు. అప్పు ఆ లెటర్ ను తెరిచి చదివి అది మరీ చిన్నపిల్లల రాతలా ఉండటంతో దాన్ని అందంగా తిరగరాసి రుచికి అందజేస్తుంది. రుచి ఆ లెటర్ని చదువుకుని తనను ఎవరో రహస్యంగా ప్రేమిస్తున్నట్లు తెలుసుకుని ఆనందిస్తుంది. ఒకరోజు రవి రుచిని కలుసుకుని ఆ ప్రేమలేఖ రాసింది తనేనని చెప్పడంతో ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు.

రుచి చదివేసిన తర్వాత ప్రేమలేఖను జాగ్రత్తగా పెట్టకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో అనేక అనుమానాలకు కారణమవుతుంది. ముఖ్యంగా రుచి నాన్నకూ (చలపతి రావు), రవి అమ్మకు మధ్య సంబంధం ఉన్నట్లు అనుమానిస్తారు. మరో వైపు తన స్నేహితుడు రవి మరో అమ్మాయిని గుడ్డిగా నమ్మి తనతో ప్రేమగా ఉండటం చూసి అపర్ణ లోలోపల బాధ పడుతూ ఉంటుంది. తాను కూడా రవిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంటుంది. ఒకసారి రుచి తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవి తన ఫ్లాట్ కి వస్తే ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తానని చెబుతుంది. తీరా రవి అక్కడికి వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా రుచి తల్లిదండ్రులు వచ్చేసరికి మరింత గందరగోళం మొదలవుతుంది. చివరికి ఏం జరిగిందో అందరూ తెలుసుకుంటారు. చివర్లో అప్పుకు ఓ మెడికల్ కాలేజీలో సీటొచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంటుంది. అప్పుడు రవి తాను రాసిన ప్రేమలేఖను మళ్ళీ ఒకసారి చదివి నిజానికి అది రాసింది అపర్ణ అని తెలుసుకుని ఆమె తన పట్ల చూపిన ప్రేమను తెలుసుకుంటాడు. చివరికి రవి తనకి అపర్ణ పట్ల ఉన్న అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడంతో అపర్ణ అతన్ని క్షమించేస్తుంది.

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. "Interview with Ravi Babu by Jeevi". idlebrain.com. 26 April 2002. Retrieved 6 April 2015.
  2. "Allari". idlebrain.com. Retrieved 25 April 2013.