అల్లుడుగారు వచ్చారు
అల్లుడుగారు వచ్చారు 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దీనిని ఎం.ఆర్.సి & మెలోడీ థియేటర్స్ పతాకంపై సుంకర మధు మురళి, ముళ్ళపూడి బ్రహ్మానందం నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, కౌసల్య, హీరా రాజగోపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఇది తమిళ చిత్రం పూవేలి (1998) కి రీమేక్, ఎ వాక్ ఇన్ ది క్లౌడ్స్ (1995) సినిమాకు అనధికారిక రీమేక్. [1] [2]
అల్లుడుగారు వచ్చారు (1999 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
తారాగణం | జగపతి బాబు, హీరా, కౌసల్య, నాజర్, రమా ప్రభ |
నిర్మాణ సంస్థ | ఎం.ఆర్.సి.మెలోడి కంబైన్స్ |
భాష | తెలుగు |
మురళి (జగపతి బాబు) కుటుంబ సంబంధాలను కోరుకునే అనాథ. అతను ప్రొఫెషనల్ వయోలిన్ వాయిద్యగాడు, నేపథ్య గాయకుడు. షాలిని (హీరా రాజగోపాల్) తో ప్రేమలో పడతాడు. ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ వెంటపడతాడు. కానీ ఆమె అతని ప్రేమను అవమానించినప్పుడు, ఇక ఆమెను ఇబ్బంది పెట్టననీ, ఏదో ఒక రోజున ఆమే తనను అర్థం చేసుకుని తన వద్దకు వస్తుందనీ చెబుతాడు. ఒక రోజు, మురళి తన చిన్ననాటి స్నేహితురాలు మహా / మహాలక్ష్మి (కౌసల్య) ను కలుస్తాడు. అంతకు కొద్ది కాలం క్రితమే ఆమె ప్రేమికుడు మధు (అబ్బాస్) ను ప్రమాదంలో మరణించాడు. తండ్రి తమ ప్రేమను అంగీకరించేందుకు వత్తిడి చెయడం కోసం, తామిద్దరూ అప్పటికే పెళ్ళి చేసుకున్నామని అబద్ధం చెప్పి ఉంది. ఇదిలా ఉండగా, మురళే ఆమె భర్త అని ఆమె మేనమామ అనుకుంటాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఆమె గ్రామానికి వెళ్తారు. కానీ మహా తండ్రి రాఘవరావు (నాసర్) వారిద్దరి పెళ్ళి పట్ల చాలా కోపంగా ఉంటాడు. మురళిని తన అల్లుడిగా అంగీకరించడు.
వాస్తవానికి, ఆ ఇంటి సభ్యులకు తాను నచ్చకుండా చేసుకోవాలని మురళి ప్రయత్నం. ఆ విధంగా అతను మహాను, ఆ ఊరినీ వదలి తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. అందుకోసం అతడు వేసే ప్రణాళికలు ఎదురొచ్చి, అతనికి వారి ప్రేమ ఆప్యాయతలు సంపాదించి పెడతాయి. ఆ విధంగా అతడు ఆ ఇంట్లో ఉంటూండగా ఆ కుటుంబంలో సభ్యుడుగా ఉండడం క్రమేణా ఇష్టపడటం మొదలౌతుంది. మహాతో ప్రేమలో కూడా పడతాడు. అయితే మురళి, మహా మధ్య ఉన్న భార్యాభర్తల కథను మహా అమ్మమ్మ (రమా ప్రభ) పసిగడుతుంది. ఆమెకు మహాపై ఉన్న ప్రేమ వలన, వారిద్దరికీ పెళ్ళి చెయ్యడానికి ఆమె ఒక నాటకం ఆడుతుంది.
ఇదిలా ఉంటే, షాలిని మురళి పట్ల ప్రేమ పెంచుకుంటుంది. మురళి మహాల పెళ్ళికి ముందు ఆమె ఆ గ్రామానికి వస్తుంది. అందరి మనస్సులలో సందేహాలను సృష్టిస్తుంది. ఇది కొంత గందరగోళానికి, సమస్యలకూ దారితీస్తుంది. చివరగా, మురళి మహాల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
తారాగణం మార్చు
సంగీతం మార్చు
ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశాడు. దీన్ని హెచ్‌ఎంవి ఆడియో కంపెనీ విడుదల చేసింది.
సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "చాలీచాలని కులుకుల లోనా" | జయచంద్రన్, చిత్ర | 5:14 |
2. | "మరుగేల ముసుగేలా" | హరిహరన్ | 5:00 |
3. | "గుండెలో సందడి" | శశిప్రీతమ్, కె.ఎస్.చిత్ర | 3:28 |
4. | "రంగురంగు రెక్కల" | ఎం.ఎం. కీరవాణి | 4:54 |
5. | "ఐశ్వర్య రాయి నీకు" | నవీన్ | 4:30 |
6. | "నీరారా పిలిచినా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:25 |
Total length: | 27:31 |
మూలాలు మార్చు
- ↑ "Alludugaru Vacharu". The Cine Bay. Archived from the original on 2018-09-17. Retrieved 2020-07-31.
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2018-09-17. Retrieved 2020-07-31.